కారు దిగిన కవితక్క.. తండ్రి కేసీఆర్ కే ‘రివర్స్’ ఆఫర్ ఇచ్చింది..
ఈ వ్యాఖ్యలతో కల్వకుంట్ల కుటుంబంలో ‘కలహాలు’ ఏ రేంజ్‌లో ఉన్నాయో స్పష్టమైపోయిందని విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు.
By: A.N.Kumar | 18 Jun 2026 6:00 PM ISTతెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఊహించడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదేమో.. మొన్నటివరకు "కారు, సారు, సర్కారు" అంటూ గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్న కల్వకుంట్ల కవిత గారు.. ఇప్పుడు రూటు మార్చారు.. రేంజ్ మార్చారు.. అసలు పార్టీనే మార్చేశారు. ‘భారత్ రాష్ట్ర సమితి’ కి బైబై చెప్పేసి, తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అంటూ సరికొత్త దుకాణం.. ఐతే రాజకీయ పార్టీ పెట్టేశారు. పాత ‘టీఆర్ఎస్’ సెంటిమెంట్‌ను ఇలా కొత్తగా వాడుకోవడంలో ఆమె టైమింగ్‌ను మెచ్చుకోవాల్సిందే.. అయితే తాజాగా ఒక జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేల్చిన బాంబు ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ‘సంచలనం’ కాస్తా ‘నవ్వుల జల్లు’గా విశ్లేషకులకు ‘మైండ్ బ్లాక్’ అయ్యేలా చేస్తోంది.
బాస్ కే రివర్స్ ఆఫర్.. ఇదెక్కడి మాస్ ప్లాన్ అబ్బా
ఇంటర్వ్యూలో యాంకర్ చాలా అమాయకంగా.. "ఒకవేళ మీ తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు స్వయంగా వచ్చి.. ‘అమ్మా, కవితా.. ఇంటికొచ్చేయ్ మళ్లీ మన పార్టీలోనే ఉండు’ అని అడిగితే ఏం చేస్తారు?" అని ప్రశ్నించారు. దానికి కవిత గారు ఇచ్చిన సమాధానం విని పొలిటికల్ పండితుల టీ కప్పులు చేతుల్లోంచి జారిపడ్డాయట.. "నా జీవితంలో చాలా అవమానాలు చూశాను. గౌరవం లేని చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. కాబట్టి నేను బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు. ఒకవేళ కేసీఆరే నా దగ్గరకు వస్తే.. నేను ఆయన పార్టీలోకి వెళ్ళడం కాదు, ఆయన్నే నా ‘తెలంగాణ రక్షణ సేన’ లోకి రమ్మని ఆహ్వానిస్తా " అని తేల్చిచెప్పారు. అబ్బా.. ఏం కాన్ఫిడెన్స్.. తెలంగాణను దశాబ్ద కాలం పాటు శాసించిన ఉద్యమ సింహం, రాజకీయ చాణక్యుడు కేసీఆర్‌కే.. కొత్తగా పెట్టిన పార్టీలోకి ‘మెంబర్‌షిప్’ ఆఫర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయ అనిపించుకోవడమే కాకుండా తండ్రికే ‘రివర్స్ టాబ్లెట్’ వేశారు కవితక్క!
ఫ్యామిలీ పాలిటిక్స్: ‘కారు’ వర్సెస్ ‘రక్షణ సేన’
ఈ వ్యాఖ్యలతో కల్వకుంట్ల కుటుంబంలో ‘కలహాలు’ ఏ రేంజ్‌లో ఉన్నాయో స్పష్టమైపోయిందని విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. "నన్ను గౌరవం లేకుండా బయటకు పంపించారు" అని కవిత గారు తెగ ఫీలవుతుంటే.. జనాలు మాత్రం "అసలు కేసీఆర్ సొంత కూతుర్నే బయటకు పంపించేంత సీన్ ఉందా? లేక ఇదంతా ఏదైనా కొత్త పొలిటికల్ స్క్రిప్టా?" అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ‘రక్షణ సేన’ పెట్టుకున్న కవిత గారికి.. ఇప్పుడు తండ్రి కేసీఆరే రక్షణ కోసం తన పార్టీలోకి రావాలని కోరడం ఈ శతాబ్దపు అతిపెద్ద రాజకీయ జోక్ అంటున్నారు నెటిజన్లు.
తదుపరి అంకం ఏమిటో?
ప్రస్తుతానికైతే కవిత గారి ‘ఓపెన్ ఆఫర్’ పై అటు ఫామ్‌హౌస్ నుంచి కానీ, ఇటు బీఆర్ఎస్ భవన్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. కేసీఆర్ గారు ఈ కామెంట్‌ను విని నవ్వుకున్నారో.. లేక "కన్నతల్లే కాకరాకరకాయ్ అన్నదట" అని సామెతలు వెతుక్కుంటున్నారో చూడాలి.
ఏదేమైనా ఒకప్పుడు కేసీఆర్ వెనుక నడిచిన కవిత.. ఇప్పుడు కేసీఆర్ నే తన వెనుక నడవమంటున్నారు. ఈ ‘రివర్స్ గేర్’ రాజకీయం తెలంగాణను ఎటు తీసుకెళ్తుందో కానీ ప్రేక్షకులకు మాత్రం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ!
