Begin typing your search above and press return to search.

కవితతో ప్రయాణించేది ఎవరు? కొత్త పార్టీపై భారీ అంచనాలు.. కఠిన సవాళ్లు

లక్ష్యాలు మారాయి.. దారులు చీలాయి.. బీఆర్ఎస్ వైఫల్యాలనే అస్త్రాలుగా చేసుకుని ఉద్యమకారుల అండతో కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ సమరానికి సైగ చేశారు.

By:  A.N.Kumar   |   28 March 2026 8:15 AM IST
కవితతో ప్రయాణించేది ఎవరు? కొత్త పార్టీపై భారీ అంచనాలు.. కఠిన సవాళ్లు
X

లక్ష్యాలు మారాయి.. దారులు చీలాయి.. బీఆర్ఎస్ వైఫల్యాలనే అస్త్రాలుగా చేసుకుని ఉద్యమకారుల అండతో కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ సమరానికి సైగ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదం మళ్ళీ వినిపిస్తూ.. కారుకు చెక్ పెట్టేందుకు 'కవితాత్మక' వ్యూహం సిద్ధమైంది. సవాళ్ల సముద్రాన్ని ఈదుతూ ఆమె నిర్మించబోయే కొత్త శక్తి.. తెలంగాణలో మూడో ప్రత్యామ్నాయం అవుతుందా?

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి తెరలేపుతూ కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు మేడ్చల్ సమీపంలోని మునీరాబాద్‌లో భారీ బహిరంగ సభలో పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఈ సభ ద్వారా తన రాజకీయ బలం ఏ స్థాయిలో ఉందో చూపించడమే కాకుండా బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తన పార్టీని నిలబెట్టాలన్నది కవిత వ్యూహంగా కనిపిస్తోంది.

కవిత చేసిన ఆరోపణలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ లక్ష్యాలతో పుట్టిన బీఆర్ఎస్ ప్రస్తుతం ఆ లక్ష్యాలను పూర్తిగా విస్మరించిందని ఆమె విమర్శించారు. రాష్ట్ర ఏర్పాటుకు 12 సంవత్సరాలు పూర్తయినా నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతుండటాన్ని ఆమె తీవ్రంగా ప్రస్తావించారు. ఈ పరిస్థితికి బీఆర్ఎస్ వైఫల్యమే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.

“బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం పేరుకే ఉన్న పార్టీ. అసలు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు అందరూ ఇప్పుడు నా వెంట ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చగల ఏకైక ప్రాంతీయ శక్తిగా నా పార్టీ అవతరిస్తుంది” అని కవిత ధీమా వ్యక్తం చేశారు.

అయితే, కొత్త పార్టీ స్థాపన ఒకవైపు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరోవైపు అనేక సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది. ఒక పార్టీ విజయవంతం కావాలంటే బలమైన నాయకత్వం, రెండో స్థాయి నాయకులు, గ్రామస్థాయిలో పట్టు ఉండటం అత్యంత కీలకం. కవితకు నాయకత్వం, ఉద్యమ అనుభవం, ప్రసంగ నైపుణ్యం ఉన్నా, జిల్లాలు, నియోజకవర్గాల్లో బలమైన నాయకులను ఆకర్షించడం ప్రధాన సవాల్‌గా మారింది.

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎలాంటి ఖాళీ లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీల మధ్య ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీకి నాయకులను ఆకర్షించడం అంత సులభం కాదు. తమ పార్టీ ఇతర పార్టీలకంటే మెరుగైనదని కవిత నిరూపించాల్సిన అవసరం ఉంది.

మరో కీలక అంశం మహిళా నాయకత్వంపై ఉన్న అభిప్రాయాలు. రాజకీయాల్లో మహిళా నాయకత్వాన్ని చాలాసార్లు బలహీనంగా భావించే పరిస్థితి ఉంది. ఈ ముద్రను చెరిపేసి, పురుష నాయకులను కూడా తన వెంట నడిపించుకోవడం కవితకు పరీక్షగా మారనుంది.

కేడర్ విషయంలో మాత్రం కవితకు కొంత బలం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఆమె చురుకైన పాత్ర, తెలంగాణ జాగృతి ద్వారా గ్రామస్థాయిలో ఏర్పరచుకున్న నెట్‌వర్క్ ఆమెకు ప్లస్ పాయింట్. అయితే, కేడర్ బలపడాలంటే ముందుగా నాయకత్వం బలపడాలి.

ముందున్న ఏడాది కాలం కవితకు అత్యంత కీలకం. ప్రజల మధ్య ఎక్కువగా ఉండటం, మీడియా దృష్టిని ఆకర్షించడం, పార్టీ విస్తరణపై దృష్టి పెట్టడం అవసరం. అదే సమయంలో ఆర్థిక వనరులు కూడా కీలకం. పార్టీ కార్యకలాపాలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడం కూడా పెద్ద సవాల్‌గా మారనుంది.

మొత్తానికి కవిత కొత్త పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నా, విజయానికి దారి మాత్రం సవాళ్లతో నిండినదే. ఈ ప్రయాణంలో ఆమెతో పాటు ఎవరు నడుస్తారన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.