కవిత 'టచ్' పాలిటిక్స్: బీఆర్ఎస్ అలెర్ట్!
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులకు పుండుపై కారంగా మారాయి.
By: Garuda Media | 21 Sept 2025 1:00 PM ISTబీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులకు పుండుపై కారంగా మారాయి. ఆమె పార్టీని వీడి వెళ్లడంపై ఎవరూ పెద్దగా చింతించడం లేదు. కానీ, ఆమె చేసిన, చేస్తున్న వ్యాఖ్యలతో మాత్రం కలవర పడుతున్నారు. పార్టీలో ఉన్నప్పుడు.. పార్టీని వదిలేసిన తర్వాత కూడా కవిత వ్యవహారం కేసీఆర్ సహా.. పార్టీ అగ్రనాయకుల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై కవిత చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. అలానే తన తండ్రి కేసీఆర్‌ను దేవుడు అంటూనే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల క్రమంలోనేకవితను పార్టీ నుంచి బయటకు(సస్పెండ్) పంపారు. అయితే.. ఈ పరాభవంతో కలత చెందిన కవిత ఏకంగా పార్టీకే రాజీనామా చేసి.. ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆమెకు, బీఆర్ ఎస్‌కు ఎలాం టి సంబంధం లేదు. అయినా.. కూడా కవిత వ్యవహారాలు బీఆర్ ఎస్‌ను కలవర పెడుతున్నాయి. తాజాగా మీడియాతో మాట్లా డిన కవిత.. దాదాపు సొంత పార్టీపై సంకేతాలు ఇచ్చారు. నేరుగా స్పందించకపోయినా.. ``వందల మందితో మాట్లాడుతున్నా. గతంలో కేసీఆర్ కూడా ఇలానే మాట్లాడారు. పార్టీలు కొత్తవి రావాల్సిన అవసరం ఉంది. ఎన్ని పార్టీలు వస్తే అంతగా తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది.`` అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. బీఆర్ఎస్ నాయకులు తనకు `టచ్`లో ఉన్నారంటూ కవిత మరో బాంబు పేల్చారు. ఒకవైపు కొత్తపార్టీ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతూనే.. మరోవైపు, కేసీఆర్ వందల మందితో మాట్లాడారని.. ఇప్పుడు తాను కూడా ఇదే చేస్తున్నా నని ఆమె చెప్పుకొచ్చారు. ఇక, బీఆర్ ఎస్ నాయకులే తనతో టచ్‌లో ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. చాలా మంది ఈ జాబితాలో ఉన్నారని చెప్పారు. అయితే.. వారి పేర్లను మాత్రం ఆమె వెల్లడించలేదు. దీంతో బీఆర్ ఎస్ అధిష్టానం ఈ వ్యవహారం పై అలెర్ట్ అయినట్టు తెలిసింది. కవితతో టచ్‌లో ఉన్నవారు ఎవరు? అనే విషయంపై కూపీ లాగుతున్నట్టు సమాచారం.
ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కొందరు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మల్లారెడ్డి సహా ఆయన అల్లుడు కూడా అసంతృప్తితో ఉన్నారు. అలానే మరికొందరు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. వీరంతా కవితతో టచ్‌లో ఉన్నట్టు సంకేతాలు ఉన్నా.. నిర్ధారణ కావడం లేదు. దీంతో వారి వ్యవహారాలు, రాజకీయంగా వారు ఎలా ఉన్నారు? అనే విషయాలపై ఆయా జిల్లాల నాయకుల నుంచి పార్టీ సమాచారం సేకరించేందుకు రెడీ అయింది. ఇదిలావుంటే.. కవితకు తెలంగాణ సమాజంలో పెద్దగా ప్రాధాన్యం లేదని చెబుతున్న వారు కూడా ఉన్నారు. కేసీఆర్ బిడ్డగానే ఆమె గుర్తింపు పొందారని.. ఒంటరి పోరాటం ఫలించడం కష్టమని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా `టచ్` పాలిటిక్స్ మాత్రం బీఆర్ ఎస్‌కు సెగ పెడుతున్నాయి.
