Begin typing your search above and press return to search.

చిక్కుల్లో బీఆర్ఎస్.. ఒకవైపు కవిత.. మరోవైపు డీలిమిటేషన్.. ఇప్పుడెలా?

కవిత పార్టీతో ఇకపై తెలంగాణ సెంటిమెంటు, భావోద్వేగం ద్వారా వచ్చే ఓట్లలో చీలిక ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   27 March 2026 1:45 PM IST
చిక్కుల్లో బీఆర్ఎస్.. ఒకవైపు కవిత.. మరోవైపు డీలిమిటేషన్.. ఇప్పుడెలా?
X

ప్రతిపక్ష స్థానంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించలేక సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి తాజా రాజకీయ పరిణామాలు మరింత సమస్యగా మారనున్నాయా? అనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత రూపంలో ఎదురవబోయే సవాల్ తోపాటు నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కేసులు, నేతల వలసలు, వరుస ఓటములతో బీఆర్ఎస్ రాజకీయంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటోందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ప్రారంభించే పార్టీని తట్టుకుని నిలబడటమే కాకుండా, పునర్విభజనతో తమ కంచుకోటలకు బీటలు పడకుండా కాపాడుకోవడం బీఆర్ఎస్ అధినాయకత్వానికి తక్షణ అవసరంగా వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత దాదాపు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీని మరింత ఇబ్బంది పెట్టేలా తాజా రాజకీయ పరిణామాలు ఉన్నాయని అంటున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ప్రారంభించడం బీఆర్ఎస్ కు రాజకీయంగా తీవ్ర నష్టంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కవిత పార్టీ పెడతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా, బీఆర్ఎస్ నాయకత్వం ఆమెను నిలువరించే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. కవిత వల్ల పార్టీకి పెద్దగా నష్టం వాటిల్లే అవకాశం లేదనే ధీమానే ఇందుకు కారణంగా వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే తెలంగాణ పేరుతోనే పార్టీని ప్రారంభిస్తున్న కవిత బీఆర్ఎస్ పార్టీనే లక్ష్యంగా చేసుకునే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు. కవిత పార్టీతో ఇకపై తెలంగాణ సెంటిమెంటు, భావోద్వేగం ద్వారా వచ్చే ఓట్లలో చీలిక ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన కూడా బీఆర్ఎస్ పార్టీకి సమస్యాత్మకంగా మారే పరిస్థితి ఉందని అంటున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండటం, కనీసం ఆ పార్టీల అధినాయకత్వంతో బీఆర్ఎస్ హైకమాండ్ కి సత్సంబంధాలు లేకపోవడం వల్ల తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. సహజంగా నియోజకవర్గాల పునర్విభజన అంశంలో అధికార పార్టీకి కొంత అనుకూలత ఉంటుందని, ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ వరకు సమాన వాటా దక్కంచుకోవచ్చని అంచనా వేస్తున్నారు. పైకి రాజకీయ ప్రత్యర్థులుగా ఈ రెండు పార్టీల నాయకులు వ్యవహరించినా తమకు బలం ఉన్న చోట తమ స్థానాలు కాపాడుకునేలా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అంటే నియోజకవర్గాల పునర్విభజనలో రెండు పార్టీల మధ్య సర్దుబాటు ప్రయత్నాలు జరిగేందుకు ఏమైనా అవకాశం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే బీఆర్ఎస్ ను దెబ్బతీసేలా నియోజకవర్గ విభజనలో అడుగులు పడొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు రెండు జాతీయ పార్టీలతో మంచి సంబంధాలు లేకపోవడం వల్ల కూడా ఈ ముప్పు అధికమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణలో రెండోసారి అధికారం కాపాడుకోవాలని కాంగ్రెస్, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని బీజేపీ తమ అధికారాన్ని ఉపయోగించుకోవచ్చని, కానీ, ఈ అవకాశం లేక బీఆర్ఎస్ మాత్రం రాజకీయంగా ఇబ్బంది పడొచ్చని అంటున్నారు.