Begin typing your search above and press return to search.

కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ...కవిత ఎమోషనల్ కామెంట్స్ !

తెలంగాణా రక్షణ సేన టీఆర్ ఎస్ అధ్యక్షురాలు అయిన కల్వకుంట్ల కవిత ఒక ప్రముఖ చానల్ ఇంటర్వ్యూలో కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Satya P   |   16 Aug 2026 9:42 AM IST
కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ...కవిత ఎమోషనల్ కామెంట్స్ !
X

తెలంగాణా రక్షణ సేన టీఆర్ ఎస్ అధ్యక్షురాలు అయిన కల్వకుంట్ల కవిత ఒక ప్రముఖ చానల్ ఇంటర్వ్యూలో కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ బీఆర్ఎస్ లో కలిసే ప్రసక్తి లేదని అన్నారు. తనను అకారణంగా సస్పెండ్ చేసి బయటకు పంపించిన పార్టీలోకి తిరిగి వెళ్ళడం అన్నది జరిగే పని కాదని ఆమె అన్నారు. ఇది తాను నూటికి నూరు శాతం చెబుతున్న మాట అని అన్నారు. తండ్రిగా కేసీఆర్ అంటే తనకు ఎపుడూ గౌరవం అన్నారు. ఆయనను తాను కుమర్తెగా ప్రేమిస్తాను అని అదే సమయంలో రాజకీయంగా బీఆర్ఎస్ తో విభేదిస్తాను అని స్పష్టం చేశారు. తనకు జీవిత కాలానికి సరిపడా బాధను మిగిల్చారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో నేను ఒక్కరే :

ఒక తండ్రిని ఎదిరించి రాజకీయ పార్టీని పెట్టిన చరిత్ర బహుశా దేశంలో తన ఒక్కరి విషయంలోనే జరిగి ఉండొచ్చు అని ఆమె అన్నారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయని అన్నారు. తెలంగాణా కోసం తాను జాగృతి సంస్థ ద్వారా ఎన్నో ఉద్యమాలు చేశాను అని బీఆర్ఎస్ లో ఒక అగ్ర నాయకురాలిగా ఉన్నాను అని అలాంటి తనను ఏడాదిగా పార్టీలో ఎడం పెంచి చివరికి షోకాజ్ నోటీసు అయినా ఇవ్వకుండా సడెన్ గా సస్పెండ్ చేయడం బాధ కలిగించింది అన్నారు. ఏ పార్టీ కోసం అయితే తాను ఆరు నెలల పాటు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నానో అదే పార్టీ తనకు అండగా నిలబడలేకపోయింది అన్నారు. తనను సస్పెండ్ చేసినపుడు బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ కనీసంగా స్పందించలేదని అన్నారు.

తప్పకుండా గెలుస్తాం :

తెలంగాణాలో తమ పార్టీ తప్పకుండా గెలిచి తీరుతుందని కవిత స్పష్టం చేసారు. తాను సామాజిక తెలంగాణా నినాదంతో ముందుకు సాగుతున్నాను అన్నారు. బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు తన డిమాండ్ అన్నారు. బీసీలకు మహిళలకు సాధికారిత తమ పార్టీ లక్ష్యాలు అని ఆమె చెప్పారు. తెలంగాణా సమాజంలో బీసీలు అంతా తమ పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు అని అన్నారు. అందువల్ల తాను గెలిచి చూపిస్తాను అన్నారు. ఈ రోజున కవిత ఒంటరిగా కనిపిస్తున్నా తమ పార్టీ సైన్యం వెనకాల చాలానే తయారు అవుతోందని చెప్పారు. 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలు నియమించామని తొమ్మిది పార్లమెంట్ సీట్లలో బాధ్యులను పార్టీ తరఫున నియమించామని ఆమె చెప్పారు. వంద రోజుల పార్టీ తమదని అయినా బలంగా రాజకీయ క్షేత్రంలో నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

బీజేపీ అవుట్ :

తెలంగాణాలో తమ పార్టీ ఎదుదుగల వల్ల బీజేపీకే అతి పెద్ద నష్టం జరుగుతుందని అన్నారు. ఆ పార్టీ సామాజిక తెలంగాణాకు వ్యతిరేకమని కవిత విమర్శించారు. ఇక తన పార్టీ వల్ల బీఆర్ఎస్ కి నష్టమా కాంగ్రెస్ కి నష్టమా అన్నది కాలం తేల్చాల్సినదే అన్నారు. తాము మాత్రం ఫోర్ ఫ్రంట్ లో నిలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అదే సమయంలో తెలంగాణాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అన్న తేడా లేకుండా మూడు పార్టీల మీద బలమైన పోరాటం చేస్తామని కవిత చెప్పారు.

తెలుగు గడ్డ మీదనే :

ఇదే సందర్భంలో కవిత మరో మాట అన్నారు. తెలుగు గడ్డ మీదనే ఆడ బిడ్డలకు అన్యాయం జరుగుతోంది అని చెప్పారు. జాతీయ స్థాయిలో రాహుల్ ప్రియాంక సంఖ్యతగా ఉన్నారని యాంకర్ అన్న మాటలకు ఆమె స్పందిస్తూ ఏపీలో జగన్ షర్మిల అయినా ఇక్కడ తాను కేటీఆర్ అయినా సమస్య వచ్చినది ఆడ బిడ్డలకే అని అన్నారు. తెలుగు నీరులో ఏదైనా లోపం ఉందేమో అని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. ఇక ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఒక డైలాగ్ ని యాంకర్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసి వినిపించారు. శత్రువులు ఎక్కడో ఉండరని కూతుళ్ళు చెల్లెళ్ళ రూపంలో తిరుగుతుంటారని అన్న దానికి కవిత నవ్వూతూనే దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటామని అన్నారు. శత్రువులు కొడుకులు అన్నల రూపంలో ఉంటారని కౌంటర్ వేశారు. దీని ద్వారా కేటీఆర్ మీదనే ఆమె కామెంట్స్ చేశారని అంటున్నారు.