కవిత కొత్త పార్టీ ఎప్పుడంటే ?
బీఆర్ ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ప్రజలకు సరైన న్యాయం ఏమీ చేయలేదని కవిత చెప్పడం ద్వారా ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు.
By: Satya P | 31 Oct 2025 3:00 AM ISTకల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముద్దుల తనయ, గులాబీ పార్టీలో తన ప్రత్యేక స్థానంతో ఎన్నో ఏళ్ల పాటు కొనసాగిన మహిళా నాయకురాలు. తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్న వాగ్దాటి ఆమెకు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బాగా కలిసి వచ్చింది. అయితే అదే బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిపోయేలా అదే వాగ్దాటి ఆమెకు చేటు చేసింది అని విశ్లేషిస్తారు. కవితకు కేసీఆర్ తో అన్న కేటీఆర్ తో ఎలాంటి విభేదాలు అయితే లేవు, పార్టీలో కొందరి కారణంగా తాను దూరం కావాల్సి వచ్చింది అని ఆమె ఎన్నో సార్లు చెప్పారు. తన మీద కుట్ర చేశారు అని ఆడబిడ్డను పార్టీకి కాకుండా చేశారు అని ఆమె విమర్శిస్తుంటారు.
జనం బాటలో :
కవిత తానుగానే జనంలో ఉండాలని భావించి తండ్రి పేరు ఫోటో ఏదీ వాడకుండా ప్రజలలోకి వస్తున్నారు ఆమె తన అత్తింటి వారి ఊరు నుంచి ఈ జనం బాట కార్యక్రమాన్ని మొదలెట్టారు. అంతే కాదు, తనను ఎంపీగా గెలిపించిన నిజామాబాద్ నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. జాగృతి తరఫున ఆమె ఈ జనం బాట చేపడుతున్నారు. అన్ని చోట్ల ప్రజలతో మమేకం అవుతున్నారు. బీఆర్ఎస్ తో తన బంధాన్ని చెబుతున్నారు రెండు దశాబ్దాల పాటు తాను పడిన కష్టాన్ని పార్టీ కోసం తాను చేసిన కార్యక్రమాలను వివరిస్తూనే అధికారంలో పదేళ్ళ పాటు బీఆర్ఎస్ ఉంటూ చేయని కార్యక్రమాలలను కూడా జనం వద్ద పెడుతున్నారు. తెలంగాణా అమర వీరులను మరచిపోయారని అందుకు తాను క్షమాపణలు చెబుతున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను మంత్రిని కాదని సంతకాలు పెట్టే అధికారం తనకు లేదని అయినా పార్టీ వేదికల మీద నుంచే ప్రశ్నించాను అని ఆమె చెబుతున్నారు. అదే సమయంలో ఆమె తాను పార్టీ పక్షాన తెలంగాణా ప్రజల కోసం నిలబడి పోరాడాను అయితే కొన్ని శక్తుల కుట్ర మూలంగా పార్టీ నుంచే బయటకు వెళ్ళాల్సి వచ్చింది అని అన్నారు. తెలంగాణా కోసం త్యాగాలు చేసికి ఈ రోజుకీ న్యాయం జరగలేదని కూడా ఆమె అంటున్నారు. ఒక విధంగా ఆమె బీఆర్ఎస్ ని ఇండైరెక్ట్ గా విమర్శిస్తున్నారు.
రేవంత్ రెడ్డి మీద ఎటాక్ :
అదే సమయంలో ఆమె రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ గానే ఎటాక్ చేస్తున్నారు. తెలంగాణా ఉద్యమానికి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం సంబంధం లేదని ఆమె విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పాలన తీరు ఏమీ బాగులేదని దుయ్యబెడుతున్నారు. తెలంగాణా ప్రజలు ఎంతో ఆశ పడి సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్షలు ఏవీ నెరవేరక పోవడం బాధాకరం అని ఆమె అంటున్నారు. ఒక విధంగా ఆమె తెలంగాణా ప్రజల పక్షాన మాట్లాడుతూ నిన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ రోజున ఉన్న కాంగ్రెస్ రెండింటినీ కలిపి విమర్శిస్తున్నారు.
జనం మనోగతం కోసమేనా :
బీఆర్ ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ప్రజలకు సరైన న్యాయం ఏమీ చేయలేదని కవిత చెప్పడం ద్వారా ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. తెలంగాణాలో చూస్తే బీజేపీ కూడా మరో పార్టీగా ఉంది. ఆ పార్టీని కూడా ఆమె విమర్శిస్తున్నారు. అంటే తెలంగాణాలో మరో ప్రాంతీయ పార్టీ కోసం జనాలు చూస్తున్నారా కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే జనాల మద్దతు ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఆమె ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆమె తొందర పడడం లేదని మొత్తం జనం బాట పూర్తి అయిన తరువాతనే ఆమె ఒక నిర్ణయానికి రావచ్చు అని అంటున్నారు.
క్లారిటీ అనుకోవచ్చా :
తాజాగా మహబూబ్ నగర్ పర్యటనలో కవిత కొత్త పార్టీ మీద కొంత క్లారిటీ అయితే ఇచ్చారు. ప్రజా సమస్యలు తీర్చేందుకు పార్టీలు అవసరం లేదని ఆమె అంటూనే ప్రజలు కోరుకుంటే అన్న మాట కూడా వాడారు. ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని కూడా గుర్తుకు తెచ్చారు. అంటే తెలంగాణాలో రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నాయి. అవసరం అనుకుంటే మరో ప్రాంతీయ పార్టీకి స్కోప్ ఉంటుందని ఆమె భావిస్తున్నారా అన్నది కూడా చర్చ సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే గడచిన నాలుగు దశాబ్దాలుగా ఎక్కువ కాలం అధికారంలో ఉన్నాయి.
ముందుకు సాగేది ఎలా :
తెలంగాణా వచ్చాక పదేళ్ల పాటు బీఆర్ ఎస్ ఉంది. మరో ప్రాంతీయ పార్టీ లేకపోవడం వల్లనే కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీకి చాన్స్ వచ్చింది అని కూడా విశ్లేషణ ఉంది. అందుకే కవిత కూడా కొత్త ప్రాంతీయ పార్టీకి తొందరపడకుండా అన్నీ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అయితే కొత్త పార్టీ పెట్టకపోతే ఆమె రాజకీయం ముందుకు సాగేది ఎలా అన్న చర్చ ఉంది. అంతే కాదు ఆమె వెనక ఉన్న వారు కూడా అదే కోరుకుంటారు అని అంటున్నారు. కొత్త పార్టీ విషయంలో కవిత ఇస్తున్న స్టేట్మెంట్స్ అన్నీ వ్యూహాత్మకమేనా అన్న చర్చ కూడా వస్తోంది. చూడాలి మరి ఆమె ఎపుడు ఈ దిశగా అడుగులు వేస్తారో.
