తోక ఎవరు? కుక్క ఎవరు కవితక్కా?
ఇలాంటి పరిణామాల మధ్యే కవిత తాజాగా విలేకరుల సమావేశంలో బరెస్ట్ అయ్యారు. “గుంట నక్క వ్యవహారం చూస్తే...తోక కుక్క ని ఊపే పరిస్థితి వచ్చింది..’ అని నాకు అనిపిస్తోందని కవిత సంచలన సెటైర్ వేశారు.
By: A.N.Kumar | 4 Jan 2026 5:12 PM ISTతెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేరుగా తండ్రి కేసీఆర్ ను, సోదరుడు కేటీఆర్ ను ఏమీ అనలేక.. కక్కలేక మింగలేక బావ హరీష్ రావు మీద పడిపోతున్నట్టుగా ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. తాను ఎంత మొత్తుకున్నా హరీష్ రావుపై దుమ్మెత్తిపోసినా కేసీఆర్ ఏమాత్రం లెక్క చేయకుండా అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిని కట్టబెట్టడంతో కవిత తాజాగా తన అసహనం మొత్తాన్ని బయటపెట్టారు. కేసీఆర్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ హరీష్ రావుపై అనరాని మాటలు అనేశారు. తెలంగాణ రాజకీయాల్లో కవిత విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
బీఆర్ఎస్ పరిణామాలపై కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో కాకరేపుతున్నాయి. “హరీష్‌కు ఎలాంటి బాధ్యతలు ఇవ్వొద్దు” అని కవిత ఎంతగా హెచ్చరించినా, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా బాధ్యతలు అప్పగించడంతో కవిత బరెస్ట్ అయ్యారు. ఇటీవల అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగించడాన్ని కవిత తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో నీళ్ల రగడ ముదిరిన నేపథ్యంలో ఈ అంశంపై స్వయంగా కేసీఆరే అసెంబ్లీలో మాట్లాడాలని కవిత డిమాండ్ చేశారు. హరీష్ ఏం చెప్పినా అది ప్రజల్లోకి వెళ్లదని, ఆయన ముందుకు రావడం వల్ల లాభం కంటే నష్టమే జరుగుతుందని ఆమె హెచ్చరించారు.
అసెంబ్లీ బహిష్కరణ.. వెనుక అసంతృప్తి
నీటి అంశాలపై జరిగిన చర్చలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరు, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలకు అనుమతి లేకపోవడంపై పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్‌లో హరీష్ షో
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించింది. ఈ మొత్తం ప్రక్రియను హరీష్‌రావు తన భుజాలపై వేసుకుని నడిపించారు. నీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న ఆరోపణలను స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశారు.
కవిత వర్సెస్ హరీష్.. అసలు పోరు ఇదేనా?
హరీష్‌ను పక్కన పెట్టకపోతే దేవుడు కూడా బీఆర్ఎస్‌ను కాపాడలేడు అన్న స్థాయిలో కవిత వ్యాఖ్యలు చేసినా కేసీఆర్‌తో పాటు కేటీఆర్ వాటిని పట్టించుకోలేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. కవిత కంటే హరీషే పార్టీకి కీలకమన్న సంకేతం ఇది అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
‘తోక కుక్కని ఊపే పరిస్థితి’ సెటైర్
ఇలాంటి పరిణామాల మధ్యే కవిత తాజాగా విలేకరుల సమావేశంలో బరెస్ట్ అయ్యారు. “గుంట నక్క వ్యవహారం చూస్తే...తోక కుక్క ని ఊపే పరిస్థితి వచ్చింది..’ అని నాకు అనిపిస్తోందని కవిత సంచలన సెటైర్ వేశారు. ఎవరు ఏమనుకున్నా.. ఎవరు ఏం అర్థం చేసుకున్నా తనకు తెలియదని.. ఒక్క మాట కాంగ్రెస్ వాళ్లు అంటే మొత్తానికి మొత్తం సభ వాయిదా వేసుకొని 5 రోజులు వాకౌట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కవిత నిలదీశారు. సభ పెట్టింది ఎవరికోసం అంటూ నిలదీశారు. దీంతో కవిత వ్యాఖ్యల్లో ‘తోక ఎవరు? కుక్క ఎవరు?’ అన్న పదాలు బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ నిర్ణయాలు ఎవరి చేతుల్లో ఉన్నాయన్న ప్రశ్నకు ఈ వ్యాఖ్యలు ప్రతిబింబమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హరీష్‌కు పగ్గాలు అప్పగించడం వల్ల పార్టీపై నియంత్రణ ఎవరిదన్న సందేహం కార్యకర్తల్లోనూ నెలకొంది.
మొత్తానికి బీఆర్ఎస్‌లో కవిత మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారుతోంది. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో మరింత ముదురుతోంది. ఇది అంతర్గత విభేదాలకే పరిమితమవుతుందా? లేక భవిష్యత్ రాజకీయ దిశను మార్చుతుందా? అన్నది కాలమే తేల్చాలి.
