తొలి మహిళా సీఎం.. ముఖ్యమంత్రి కుర్చీనే టార్గెట్ చేసిన కవిత.. నెరవేరుతుందా?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెద్ద ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ను షేక్ చేసే మాటలు మాట్లాడారు.
By: A.N.Kumar | 16 Dec 2025 5:00 AM ISTతెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెద్ద ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ను షేక్ చేసే మాటలు మాట్లాడారు. అసలు ఎవ్వరూ చేయని ఆలోచనను ఆమె చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్నే టార్గెట్ చేసిన కవిత నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత తన రాజకీయ ఆశయాలు, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం సమయంలో చాలామంది ఈ పార్టీ రాజకీయంగా నిలబడగలదా? ఎక్కువ కాలం కొనసాగుతుందా? అంటూ అనుమానాలు వ్యక్తం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అయితే ఆ అనుమానాలన్నింటినీ తలకిందులు చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిందని, రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చి పాలించిన చరిత్రను సృష్టించిందని కవిత తెలిపారు.
ప్రజల మధ్య ఉండి వారి సమస్యల కోసం పోరాడినప్పుడే రాజకీయాల్లో ఎదుగుదల సాధ్యమవుతుందని కవిత అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నప్పుడు నాయకత్వ బాధ్యతలను ఆశించడం సహజమని చెప్పారు. అటువంటి సందర్భంలో అత్యున్నత పదవిని ఆశించకపోవడం తప్పేనని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలని, అలా ఆలోచించడమే రాజకీయాల సారమని ఆమె పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలో కీలకంగా మహిళా నాయకత్వంపై మాట్లాడిన కవిత, తెలంగాణకు ఇప్పటివరకు ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో మొత్తం 27 మంది ముఖ్యమంత్రులు పనిచేసినా, ఒక్క మహిళకు కూడా ఆ అవకాశం రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. మహిళలు ఎంతకాలం ఇంకా ఎదురుచూడాలని ప్రశ్నించారు. ఇప్పుడు అయినా తెలంగాణకు ఒక మహిళా సీఎం రావాల్సిన సమయం వచ్చిందని బలంగా వ్యాఖ్యానించారు.
2029 ఎన్నికల్లో పోటీపై ప్రశ్నించగా అప్పటికి స్పష్టమైన రాజకీయ వ్యూహం లేదని మొదట కవిత తెలిపారు. ప్రస్తుతం ప్రజల మధ్యకు వెళ్లి, తమకు జరిగిన అవమానాలను పంచుకోవడం, ప్రజల సమస్యలను వినడం, వాటిని ప్రస్తావించడం పైనే దృష్టి పెట్టామని చెప్పారు. అయితే తర్వాత ‘ఆస్క్ కవిత’ కార్యక్రమంలో ఎక్స్ వేదికగా మాట్లాడిన ఆమె 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మొత్తంగా చూస్తే, “నేనే తొలి తెలుగు మహిళా సీఎం అవుతాను” అన్న కవిత మాటలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఆచరణలో ఇది అంత ఈజీకాకున్నా అసాధ్యం ఏమీ కాదు. ఇప్పటికే షర్మిల ఓసారి ట్రైచేసి ఫెయిల్ అయిపోయారు. కవిత మాత్రం లాంగ్ టర్మ్ దీన్నీ ఆశయంగా పెట్టుకున్నారు. మహిళా నాయకత్వం, భవిష్యత్ రాజకీయ లక్ష్యాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. తెలంగాణలో బలమైన బీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీలను దాటి కవిత లక్ష్యం చేరుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.
