కవిత టార్గెట్ క్లియర్.. మరోసారి క్లారిటీ ఇచ్చేశారుగా!
అవకాశాలు ఎవరూ ఇవ్వరు.. మనమే వాటిని తీసుకోవాలన్న నానుడిని బాగానే వంట బట్టించుకున్నారు కల్వకుంట్ల కవిత.
By: Garuda Media | 21 Sept 2025 12:10 PM ISTఅవకాశాలు ఎవరూ ఇవ్వరు.. మనమే వాటిని తీసుకోవాలన్న నానుడిని బాగానే వంట బట్టించుకున్నారు కల్వకుంట్ల కవిత. తాజాగా ఆమె ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెచేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయాల్లో ఎవరూ స్పేస్ ఇవ్వరిన.. స్పేస్ కల్పించుకోవాలన్న ఆమె.. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై తాను ఇంకా నిర్ణయానికి రాలేదన్న ఆమె.. తనను తాను ఫ్రీబర్డ్ గా అభివర్ణించుకోవటం గమనార్హం.
ఎవరూ స్పేస్ ఇవ్వరని.. తొక్కుకుంటూనే వెళ్తేనే తొవ్వ దొరుకుతుందన్న ఆమె వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తానిప్పుడు ఫ్రీబర్డ్ అన్న ఆమె.. తనను బీఆర్ఎస్ తో సహా అనేక మంది నేతలు కలుస్తున్నట్లుగా చెప్పారు. తాను కూడా పలువురితో సంప్రదింపులు జరుపుతున్నానని పేర్కొన్నారు. అయితే.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా సాగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.
ఈ ఏడాది దసరాకు తమ ఊరైన చింతమడకలో బతుకమ్మ ఉత్సవాలకు వెళుతున్నట్లు చెప్పిన ఆమె.. తనకు కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మినహా మాజీ మంత్రి హరీశ్ రావుపై ఎలాంటి వ్యక్తిగత కోపం లేదన్నారు. కిందిస్థాయి అధికారుల పరిశీలన.. ఆమోదం లేకుండానే ఫైళ్లు కేసీఆర్ వద్దకు వెళ్లాయన్న ఆమె.. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని ఎత్తి చూపిందని గుర్తు చేశారు.
విచారణ వేళ.. అంతా కేసీఆర్ నిర్ణయమేనని హరీశ్ రావు చెప్పినట్లుగా కమిషన్ నివేదికలో పేర్కొన్నారన్న ఆమె.. ఈ తీరుపై తనకు అభంతరం ఉందన్న విషయాన్ని స్పష్టం చేశారు. తన తండ్రిని కాళేశ్వరం ఇష్యూలో కమిట్ చేసిన హరీశ్ రావే తన టార్గెట్ అన్న విషయాన్ని కవిత మరోసారి స్పష్టం చేశారని చెబుతున్నారు. అయితే సంతోష్.. లేదంటే హరీశ్ తన రాజకీయ ప్రత్యర్థులన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు తన మాటలతో తేల్చి చెప్పారని చెప్పాలి. తాజాగా హరీశ్ పేరును ప్రస్తావించటం ద్వారా తన రాజకీయ లక్ష్యాన్ని కవిత డిసైడ్ చేసుకుందన్నది మర్చిపోకూడదు.
హరీశ్.. సంతోష్ లు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతూనే తన సోదరుడు కేటీఆర్ విషయంలో మాత్రం కవిత ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయని చెప్పాలి. నీటిపారుదల శాఖకు సంబంధించిన ఫైల్లను సరైన ప్రొసీజర్ పాటించకుండా నేరుగా సీఎంకు పంపటం పై 2016లోనే తాను కేటీఆర్ ను అప్రమత్తం చేశానని చెప్పిన కవిత.. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మినహా తనకు ఎవరి మీదా ఎలాంటి కోపాలు లేవన్నారు. తాను పార్టీ పెడితే బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లతోపాటు అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.
