కవిత క్లారిటీ...షర్మిల మిస్ అయిందేంటి ?
తెలంగాణాలో వైఎస్సార్ టీపీని స్టార్ట్ చేసి మూడేళ్ళు నడిపి కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీకి వచ్చి పీసీసీ చీఫ్ గా అయిన షర్మిల తన రాజకీయ పారాటం వైసీపీ మీదనే అని గట్టిగా చెప్పలేకపోయారు అని గుర్తు చేస్తున్నారు.
By: Satya P | 2 May 2026 10:00 PM ISTతెలంగాణాలో వైఎస్సార్ టీపీని స్టార్ట్ చేసి మూడేళ్ళు నడిపి కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీకి వచ్చి పీసీసీ చీఫ్ గా అయిన షర్మిల తన రాజకీయ పారాటం వైసీపీ మీదనే అని గట్టిగా చెప్పలేకపోయారు అని గుర్తు చేస్తున్నారు. ఆమె వైసీపీ అధినేత జగన్ ని నేరుగా టార్గెట్ చేయడంతో పాటు వ్యక్తిగత అంశాలు కూడా తెర మీదకు రావడంతో షర్మిల ఇంటి పోరునే రాజకీయ పోరాటంగా మార్చుకున్నారు అన్న భావన అయితే జనంలోకి వెళ్ళింది అని ప్రచారంలో ఉన్న మాట. కట్ చేస్తే తెలంగాణాలో మరో చెల్లెలు కవిత పార్టీ పెట్టారు. ఆ పార్టీ కూడా గులాబీ పార్టీని పోలిన పేరుతోనే టీఆర్ఎస్ గా నామకరణం చేశారు. మరి కవిత రాజకీయ పంధా ఎలా ఉంటుంది అన్నది పెద్ద చర్చగా ఉంది.
క్లారిటీ ఇచ్చినట్లేనా :
కవిత ఈ మధ్య కేసీఆర్ మీద విమర్శలు చేశారు. దాని మీద చాలా మంది ప్రతి విమర్శలు కూడా ఆమె మీద చేశారు. తండ్రిని పట్టుకుని కవిత ఇంతింత విమర్శలు చేస్తారా అని కూడా నిలదీశారు. అయితే దానికి కవిత మీట్ ది ప్రెస్ లో క్లారిటీ ఇచ్చారు. తాను విమర్శిస్తున్నది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కానీ తన తండ్రి కేసీఆర్ ని కాదని ఆమె స్పష్టం చేశారు. తనకు తల్లిదండ్రులు ఎంతో చేశారని వారి వల్ల ఏ ఇబ్బంది రాలేదని ఆమె అన్నారు. అయితే రాజకీయ సిద్ధాంత పరంగానే తాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని విమర్శిస్తున్నాను అని ఆమె చెప్పుకొచ్చారు కేసీఆర్ లేకపోతే తన జీవితం జన్మ లేవని కూడా ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు. తనది సిద్ధాంత బద్ధమైన పోరాటమే తప్ప ఇంటి పోరు కాదని పక్కా క్లారిటీతో కవిత చెప్పిన జవాబు తెలంగాణా సమాజానికి వివరణగానే అనుకోవాల్సి ఉంది.
పార్టీ పరంగానే సమరం :
ఈ విధంగా ఆదిలోనే కవిత తన మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేశారు. కేసీఆర్ తండ్రి అని ఆయనను ఆయన మీద విమర్శలు ఏంటి అని సామాన్య జనంలో కూడా ఉండే అభిప్రాయాలకు సందేహాలకు ఆమె తెర దించారని అనుకోవాల్సి ఉంది. రక్త సంబంధం ఒక ప్రధాన సెంటిమెంట్. రాజకీయాల్లో చూస్తే అది ఎంతో ప్రభావం చూపిస్తుంది. అందుకే రాజకీయంగానే కాదు అన్ని విధాలుగా పెద్ద అయిన కేసీఆర్ విషయంలో కవిత వ్యూహాత్మకంగానే నమస్కార బాణం వేసారు అని భావించాలి. తాను తండ్రి మీద పోరాడడం లేదని రాజకీయంగానే తన సమరం అని ఆమె చెప్పేశారు. అంటే రామాంజనేయ యుద్ధం లాంటిది అన్న మాట. భక్తి ఉన్నా రాముడి మీద ఆంజనేయుడు యుద్ధం చేసింది సిద్ధాంతపరంగా అని అంటారు.
రెండూ వేరుగానే :
కుటుంబ సభ్యులు రాజకీయాల్లో ఉన్నపుడు ఎక్కువగా వారి మధ్య రక్త బంధాలనే అంతా చర్చిస్తారు. దాని వల్ల కొత్తగా పార్టీ పెట్టిన వారికి కానీ అలాగే రాజకీయంగా స్థిరపడాలని చూసిన వారికి కానీ సమస్యలు వస్తాయి. ప్రజా సమస్యల విషయంలో వారు ఎంతగా పోరాడుతున్నా సరైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయకపోతే బూమరాంగ్ అవుతుంది. ఏపీలో షర్మిల ఇష్యూ అలాగే ఉందని అంటున్నారు. అందుకే కవిత అలెర్ట్ అయి ఈ విధంగా ప్రకటించారా అన్న చర్చ సాగుతోంది. తనకు కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాల వల్లనే పార్టీని పెట్టాను అన్న విమర్శలు జనంలోకి బలంగా వెళ్తే అది పార్టీ ఎదుగుదలకు తీరని అవరోధంగా మారుతుందని కూడా భావించే కవిత ఈ రకమైన క్లారిటీతో ఉన్నారు అని అంటున్నారు.
