కవిత ఏంటి మళ్లీ తిరగబడింది.. బీఆర్ఎస్ ను ఇరుకునపడేసింది..
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఆనాటి యూపీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపిన రోజు డిసెంబర్ 9. ఈ తేదీని పురస్కరించుకొని ఈ సంవత్సరం బీఆర్ఎస్ తెలంగాణ అంతటా విజయ్ దివస్ ను నిర్వహిస్తోంది.
By: A.N.Kumar | 9 Dec 2025 10:13 PM ISTతెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. తన మాతృపార్టీ బీఆర్ఎస్ పై మరోసారి విరుచుకుపడింది. ఒక్క ట్వీట్ తో షేక్ చేసింది.కవిత చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాక వరుసగా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న కవిత.. తాజాగా మరోసారి కాక పుట్టే వ్యాఖ్యలు చేసింది. ఇవి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
కవిత ట్వీట్ లో ఏమున్నదంటే?
కవిత తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. ‘అధికారం కల్పోయిన తర్వాత దీక్షా దివస్ లు, విజయ్ దివస్ లు చేయడంపై కవితపై పరోక్షంగా బీఆర్ఎస్ తీరును తప్పుపట్టారు. ఇది ఉద్యమాల గడ్డ అని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి కొట్టినట్టుగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
అసలు వివాదం ఏంటంటే?
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఆనాటి యూపీఏ ప్రభుత్వం పచ్చజెండా ఊపిన రోజు డిసెంబర్ 9. ఈ తేదీని పురస్కరించుకొని ఈ సంవత్సరం బీఆర్ఎస్ తెలంగాణ అంతటా విజయ్ దివస్ ను నిర్వహిస్తోంది. కేసీఆర్ దీక్ష విరమించిన సందర్భంగాన్ని గుర్తు చేసుకుంటూ కేటీఆర్, హరీష్ రావు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెట్టారు. ‘‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కు తొలి అడుగుపడి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29న దీక్షా దివస్ లేకుంటే డిసెంబర్ 9 విజయ్ దివస్ లేదు’’ అని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కవిత వాటిపై స్పందిస్తూ పరోక్షంగా విమర్శలు చేసినట్టుగా తెలుస్తోంది.
డిసెంబర్ 9న సోనియాగాంధీ బర్త్ డే. ఈరోజు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక తెలంగాణను గిఫ్ట్ గా ఇచ్చారని కాంగ్రెస్ నేతలు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే.. కేవలం కేసీఆర్ ఆమరణ దీక్ష మొదలుపెట్టిన నవంబర్ 29వ తేదీని మాత్రమే దీక్షా దివస్ పేరిట బీఆర్ఎస్ నిర్వహిస్తూ వచ్చింది. డిసెంబర్ 9న చేస్తే కాంగ్రెస్ కు క్రెడిట్ పోతుందని బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో ఈ తేదీన ఏ కార్యక్రమం చేయలేదు. కేవలం కేసీఆర్ ఆమరణ దీక్ష చేసేన నవంబర్ 29నే బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహించింది.
అయితే తాజాగా అధికారం కోల్పోయిన తర్వాత సడెన్ గా డిసెంబర్ 9న విజయ్ దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ భావించడంపైనే కవిత టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. సరిగ్గా ఈ అంశంపైనే కవిత పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ బీఆర్ఎస్ ను ఇరకాటంలో నెట్టినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
కవిత సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో అంతర్గత విమర్శలు, ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచే రావడంతో బీఆర్ఎస్ పరిస్థితి ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది.
