Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా నుంచి ‘కవిత’ ఔట్!?

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి సస్పెండ్ అయిన తర్వాత మాజీ ఎమ్మెల్సీ కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.

By:  A.N.Kumar   |   8 Sept 2025 4:00 PM IST
సోషల్ మీడియా నుంచి ‘కవిత’ ఔట్!?
X

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి సస్పెండ్ అయిన తర్వాత మాజీ ఎమ్మెల్సీ కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. పార్టీ నుంచి బయటకొచ్చిన తర్వాత ఆమె చేసిన తీవ్ర ఆరోపణలు, హరీష్ రావు, కేటీఆర్‌లపై చేసిన విమర్శలు మొదట్లో సంచలనం సృష్టించినా.. ఇప్పుడు ఆ చర్చ పూర్తిగా చల్లారిపోయింది. సోషల్ మీడియాలో మూడు, నాలుగు రోజులు హడావుడి చేసిన కవిత టాపిక్ .. ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో పూర్తిగా మౌనంగా ఉన్నారు. దీంతో ఆమె రాజకీయ ప్రయాణం ముగిసిపోయిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

* ప్రజాబలం లేని కవిత...

బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత వరకు, కేసీఆర్ కూతురిగా కవితకు ఒక గుర్తింపు ఉండేది. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా కొంత మేర ప్రజల్లో ఉండగలిగినా, ఆమె రాజకీయ శక్తి పూర్తిగా పార్టీపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు పార్టీ మద్దతు లేకపోవడంతో ఆమె ప్రజాబలం ఎంత అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె సొంతంగా పార్టీ పెట్టినా విజయం సాధించే అవకాశాలు లేవని, తిరిగి బీఆర్ఎస్‌లో చేరితేనే ఆమె రాజకీయ అస్థిత్వం నిలబడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ జాగృతిలో కూడా అంతగా కార్యకర్తలు, జనసమీకరణ కనిపించడం లేదు.

* పీఆర్ వ్యూహం లేకపోవడం ప్రధాన లోపం

ఆధునిక రాజకీయాల్లో పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) టీమ్ ఎంత ముఖ్యమో కవితకు ఇప్పుడు తెలిసివస్తోంది. బీఆర్ఎస్ కు బలమైన సోషల్ మీడియా విభాగం ఉంది.. కవిత కూడా ఇదే విషయాన్ని ఇటీవల ఒక మీడియా సమావేశంలో ప్రస్తావించారు. కానీ ఆమెకు మాత్రం అలాంటి బలమైన పీఆర్ టీమ్ లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. ఆమె చేసిన ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆమె బృందం విఫలమైంది. పత్రికలు, టీవీ చర్చల్లో ఆమె తరఫున మాట్లాడేవారు కూడా కరువయ్యారు.

* విమర్శలు వెనుకకు నెట్టిన హరీష్ రావు వైఖరి

కవిత ఆరోపణలు చేసిన తర్వాత హరీష్ రావు విదేశాల నుంచి తిరిగి వచ్చి స్పందించిన తీరు ఆమెకు మరింత ప్రతికూలంగా మారింది. కవితలాగా హడావుడి చేయకుండా, హుందాగా, సంయమనంతో మాట్లాడిన హరీష్ రావు, ప్రజల సానుభూతిని పొందారు. దీంతో కవిత తొందరపడ్డారని, అనవసరమైన ఆరోపణలు చేశారని ప్రజలు, విశ్లేషకులు భావించారు. ఈ సంఘటన తర్వాత సోషల్ మీడియాలో కవిత గురించి చర్చ పూర్తిగా తగ్గిపోయింది. ఆమె మళ్లీ ఏదైనా సంచలనాత్మక ప్రకటన చేస్తే తప్ప, మీడియాలో ఆమెకు ప్రాధాన్యత లభించడం కష్టమే. బీఆర్ఎస్ లేకపోతే కవిత జీరోగా మారడం ఖాయమనే విశ్లేషణలు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.