Begin typing your search above and press return to search.

కవిత వెనుక ‘జీరో’ క్యాడర్!

కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ కు దూరంగా.. జాగృతిపేరుతో సొంతంగా ఎదుగడానికి అడుగులు వేస్తోంది.

By:  A.N.Kumar   |   3 Aug 2025 1:29 PM IST
Kavitha Political Drift Distance in BRS
X

కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ కు దూరంగా.. జాగృతిపేరుతో సొంతంగా ఎదుగడానికి అడుగులు వేస్తోంది. తండ్రి, సోదరుడికి దూరంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అడుగులువేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత రాజకీయ వైఖరి అందరినీ షాక్ కు గురిచేస్తోంది.. కష్టాల్లో ఉన్న పార్టీకి పునర్నిర్మాణం అవసరమైన ఈ సమయంలో, కవిత తీరుపై పార్టీ అంతర్గతంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆమె వెంట పార్టీ శ్రేణులు లేకపోవడం, కేడర్‌లోనూ వ్యతిరేకత పెరిగిపోతుండటం ఈ చర్చకు ప్రధాన కారణం.

ప్రత్యర్థులకు ఊతం ఇస్తున్నారా?

బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. ఈ సమయంలో పార్టీ శక్తివంతంగా పోరాడి, ప్రజల సమస్యల కోసం గొంతెత్తాలి. కానీ కవిత వ్యవహార శైలి మాత్రం ప్రత్యర్థులకు మద్దతుగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌లకు వ్యతిరేకంగా పరోక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పార్టీ శ్రేణుల్లో అయోమయానికి దారితీస్తున్నాయి. ఇది పార్టీ పురోగతిని అడ్డుకుంటుందని పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు.

పార్టీకి దూరమవుతున్న కవిత?

ప్రస్తుతం కవిత వెంట బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా మధ్యస్థాయి కేడర్, నిలబడటం లేదు. ఒంటరిగా వెళుతున్న ఆమెతో కలిసి పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఆమె ఇటీవల వ్యవహరిస్తున్న తీరేనని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవల ఆమె రాసిన 'ఓపెన్ లెటర్' కూడా రాజకీయంగా పెద్దగా స్పందన పొందలేదు. ఈ లేఖ ద్వారా ప్రజల్లో తనకు మద్దతు ఉందనే ప్రచారం జరిగినా, వాస్తవానికి బీఆర్ఎస్‌లో ఆమెకు మద్దతు లేదనేది తేటతెల్లమవుతోంది.

షర్మిల తరహాలో...

దివంగత నేత వైఎస్ఆర్ కుటుంబంలో షర్మిల పరిస్థితిని గుర్తు చేస్తూ, ఇప్పుడు కవితను కూడా అదే కోణంలో చూస్తున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత షర్మిల తన సొంత రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నట్లే, కవిత కూడా బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లి తన సొంత మార్గాన్ని ఎంచుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే, కష్టకాలంలో రాజకీయ చతురత చూపకుండా, కేవలం మీడియాలో కనిపించడం కోసం లేఖలు రాయడం, గిల్లికజ్జాలు పెట్టుకోవడం వంటివి ప్రజల్లో సానుకూలతను పెంచడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

కవిత రాజకీయ భవిష్యత్తు

ఈ నేపథ్యంలో, కవిత రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె బీఆర్ఎస్ పునర్నిర్మాణంలో భాగం కాకపోతే, సొంత రాజకీయ దారి ఎంచుకుంటారా? లేక ఇది పార్టీకి మరింత నష్టాన్ని కలిగిస్తుందా? అనే అంశంపై చర్చ జరుగుతోంది.

పార్టీకి ప్రజా మద్దతు లభించాలంటే, కేవలం మాటలు చెప్పడం కాకుండా, క్షేత్ర స్థాయిలో కష్టపడి పనిచేయడం అవసరం. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో నాయకత్వ పునర్నిర్మాణం అవసరం. అందులో భాగం కావాలంటే కవిత తన వైఖరిని మార్చుకోవాలని, లేదంటే ఆమె వెంట 'జీరో క్యాడర్' అనే పరిస్థితి మాత్రమే మిగిలిపోతుందని..ఆమె ఒంటరిగా మారి.. రెంటికి చెడ్డ రేవడిలా మారుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.