బీఆర్ఎస్ కి కవిత ఎనీ టైం రిజైన్...లెటర్ రెడీ చేసిందా ?
అయితే కవిత తన స్థాయిని తన సమర్థతను ఎక్కువగా ఊహించుకున్నారా అన్న చర్చ కూడా ఉంది.
By: Satya P | 22 Aug 2025 7:00 PM ISTబీఆర్ఎస్ పార్టీ లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా అన్నది చర్చగా ఉంది. బీఆర్ఎస్ అనే గులాబీ తోట అంతా అల్లుకుంది కేసీఆర్ కుటుంబం చుట్టూనే. కేసీఆర్ తెలంగాణా ఉద్యమం అంటూ పాతికేళ్ల క్రితం పోరాటం స్టార్ట్ చేశారు. మొదట్లో మేనల్లుడు హరీష్ రావు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఆ తర్వాత కుమారుడు కేటీఆర్ కుమార్తె కవిత వచ్చి చేరారు. దాంతో ఆనాటి టీఆర్ఎస్ సకుటుంబ సపరివార సమేతంగా మారింది. ఇక పద్నాలుగేళ్ళ పోరాటం తరువాత బీఆర్ఎస్ సోలోగా అధికారంలోకి వచ్చింది. రెండు టెర్ములు పవర్ ని కూడా అందుకుంది. ఈ క్రమంలో కుటుంబానికి సైతం తగిన ప్రాధాన్యత దక్కింది. అలా కవిత కూడా ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ లో అతి ముఖ్య భూమిక పోషించారు అనే చెప్పాలి.
మొదట్లో ఆమె అలా :
తెలంగాణా ఉద్యమ కాలంలో తెలంగాణా జాగృతి పేరుతో కవిత తన వంతు చేశారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి రాగానే ఆమె కూడా నిజమాబాద్ నుంచి ఎంపీ అయ్యారు. అలా అయిదేళ్ళ పాటు ఆమె పార్లమెంట్ లో ఉన్నారు. అయితే కవిత తనకు అందివచ్చిన అవకాశాన్ని ఎంతమేరకు వాడుకున్నారు అన్నదే కీలకమైన పాయింట్ గా ఉంది. ఆమె ఎంపీగా ఉన్నపుడే ఢిల్లీ లిక్కర్ స్కాం లో తమ వంతు పాత్ర ఉందని ఆమెని గత ఏడాది అరెస్టు చేశారు. అలా ఆమె తీహార్ జైలులో ఏకంగా ఆరు నెలల పాటు ఉన్నారు ఇది నిజంగా ఆమెకు అత్యంత కష్టతరమైన సమయంగా చెబుతారు.
ఎక్కువ ఊహించుకున్నారా :
అయితే కవిత తన స్థాయిని తన సమర్థతను ఎక్కువగా ఊహించుకున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఆమె పార్టీ అధినాయకత్వం మీద విమర్శలు చేయడం ద్వారా తప్పులే చేశారు అని అంటున్నారు. ఆమె తనకు పార్టీలో కీలక స్థానం దక్కాలని ఆరాటపడ్డారు కానీ దానికి తగిన విధంగా తనకు వచ్చిన అవకాశాలను మలచుకోలేకపోయారు అని అంటారు. అందుకే ఆమె ఒక్కసారి మాత్రమే ఎంపీ అయ్యారు. రెండోసారి ఓటమి పాలు అయ్యారు. మరి పార్టీ అందించిన ప్రోత్సాహం తో ఆమె మరోసారి ఎంపీ అయి ఉంటే ఆమెకు కూడా పట్టు పెరిగేది అని అంటారు.
వారసత్వం హక్కుగా :
ఏ రంగంలో అయినా వారసత్వం అన్నది ఒకసారి మాత్రమే ఉపయోగపడే అవకాశంగా చూడాల్సి ఉంటుంది. ఆ మీదట ఎవరికి వారు తమ సొంత సత్తాకు పదుని పెట్టుకుంటేనే అందలాలు దక్కుతాయి. కానీ కవిత మాత్రం వారసత్వం విషయంలో హక్కుగా చూస్తున్నారు అన్న చర్చ వస్తోంది అన్న కేటీఆర్ మీద ఆమె ఆగ్రహంతో ఉంటూ బీఆర్ఎస్ వ్యతిరేక మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం క్లిష్ట కాలంలో పార్టీని ఇబ్బందులు పెట్టడం దాకా వెళ్లారని కూడా అంటున్నారు. దాంతోనే ఆమె పుట్టి పెరిగిన బీఆర్ఎస్ లో ఈ రోజు ఆమెకు తగిన మద్దతు దక్కడంలేదు అని అంటున్నారు. రాజకీయంగా తప్పటడుగులు వేస్తే ఖనుక అవి పాతాళానికే దారి చూపిస్తాయని చరిత్ర అనేఅ మార్లు నిరూపించింది అని కూడా గుర్తు చేస్తున్నారు.
పునాదిగా ఉండాల్సిన చోట :
కవిత బీఆర్ఎస్ కి పునదిగా ఉండాల్సిన నేపధ్యం నుంచి ప్రయర్ధులకు ఆయుధంగా మారుతున్నారన్న చర్చ అయితే ఆ పార్టీలో ఉంది. పార్టీ తండ్రిది. అన్న చేతికి వెళ్తోంది అన్న అక్కసుతో ఆమె చేస్తున్న తప్పులు అన్నీ కూడా బీఆర్ ఎస్ కి అతి పెద్ద తలనొప్పిగా మారాయని అంటున్నారు ఇక ఆమెను పార్టీ తానుగా సస్పెండ్ చేస్తే తనకు సానుభూతి వస్తుంది అన్న ఆలోచనతో ఆమె ఉన్నారని అంటున్నారు. కానీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం ఆమె విషయంలో పెద్దగా రెస్పాండ్ కాకుండా చేయాల్సింది అంతా ఆమెనే చేసుకోమని వదిలేసారు. దాంతో ఇపుడు ఆమె నిర్ణయం ఆమె తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది.
మరోసారి బహిరంగ లేఖ :
ఇదిలా ఉంటే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీని ఇబ్బందిలో నెడుతో బహిరంగ లేఖ సంధించడం కూడా చర్చనీయాంశం అయింది. ఈ లేఖలో ఆమె ఏకంగా బీఆర్ఎస్ అధినాయకత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సింగరేణి కార్మిక సంఘం నుని తనను తొలగించడం మీద ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను పార్టీలో జరుగుతున్న విషయాలను బయటపెట్టడంతోనే తన మీద కక్ష కట్టారని ఆమె ఆరోపించారు. టీజీబీకేఎస్ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తాను అమెరికా వెళ్లినప్పుడు తొలగించడమేంటని ఇదేమి ధర్మమని ఆమె ప్రశ్నించారు. గతంలో తాను అమెరికాలో ఉన్నపుడు తాను కేసీఆర్ కి రాసిన లేఖను బయటపెట్టారని ఇపుడు కూడా తాను అమెరికాలో ఉంటే తన పదవిని తీసి అవమానించారు అని ఆమె అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
వెళ్ళిపోవడానికే రెడీనా :
ఇదిలా ఉంటే కవిత ఇక బీఆర్ఎస్ లో ఉండే పరిస్థితి లేదని అంటున్నారు. ఆమె వెళ్ళిపోవడానికి సిద్ధమై ఈ విధంగా అధినాయకత్వాన్ని ఇరుకున పెడుతున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆమె వీలు దొరికితే చాలు బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్నారు. చాలా కాలంగా ఆమె తెలంగాణా భవన్ కి వెళ్లడమే మానుకున్నారు ఇపుడు ఆమె బహిరంగ లేఖ రాయడం ద్వారా తాను ఉండడం లేదని సంకేతాలు పంపుతున్నారా అని కూడా అంటున్నారు.
అవమానం అంటూ ఆగ్రహం :
తనను కీలక పదవిలో నుంచి తొలగించడం మీద ఆమె మండిపోతున్నారు. ఒక విధంగా తనకు ఇది తీరని అవమామంగా భావిస్తున్నారు. దాంతో ఆమెకు పార్టీకి రాజీనామా చేయడం తప్ప వేరే మార్గం లేదని అంటున్నారు. మరో వైపు చూస్తే బీఆర్ ఎస్ ట్యాగ్ తో ఆమె చేస్తున్న ఆరోపణలు రాస్తున్న లేఖలు ఆమె వ్యవహార శైలిని అంతా చూస్తున్న బీఆర్ ఎస్ పెద్దలు సైతం ఆమె పార్టీని వీడితే బెటర్ అని భావిస్తున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది. మొత్తం మీద చూస్తే కవిత బీఆర్ఎస్ కి గుడ్ బై కొట్టే రోజు ఎంతో దూరంలో లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
