నిజాలు చెబితే బద్నాం చేశారు: హరీష్ ఇలాకాలో కవిత షాకింగ్ కామెంట్స్
బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``ఉన్న నిజాలు చెబితే.. నన్ను బద్నాం చేశారు.``
By: Garuda Media | 22 Sept 2025 10:40 AM ISTబీఆర్ఎస్ మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``ఉన్న నిజాలు చెబితే.. నన్ను బద్నాం చేశారు.`` అని పరోక్షంగా బీఆర్ ఎస్ పార్టీపైనా, నాయకులపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కేసీఆర్‌ను దేవుడు అని వ్యాఖ్యానించిన కవిత.. ఆయనను ఇబ్బంది పెట్టేలా.. ఆయనపై మరకలు పడేలా కొందరు వ్యవహరించారని తెలిపారు. ఈ విషయాలనే తాను బయట పెట్టానన్నారు. అయితే, తననే బద్నాం చేసి బయటకు పంపారని వ్యాఖ్యానించారు.
కాగా.. ఆదివారం ఆమె మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా చింతమడకలో స్థానిక జాగృతి కార్యకర్తలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత.. పరోక్షంగా మరోసారి హరీష్‌రావును టార్గెట్ చేసుకున్నారు. కేసీఆర్‌కు మచ్చలు తెచ్చే పనులు చేశారని అన్నారు. అంతేకాదు.. సిద్దిపేటను కొందరు తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారని హరీష్‌పై కామెంట్లు చేశారు. ``చింతమడక అయినా.. సిద్దిపేట అయినా.. ఎవరి జాగీరూకాదు.`` అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితిలో ఉన్నానని.. ఆ పరిస్థితిలోనే సిద్దిపేటకు వచ్చానని కవిత చెప్పారు. ``వాస్తవానికి సిద్దిపేటలో వేరేవా రికి అవకాశం లేదు(పరోక్షంగా హరీష్‌రావు). కానీ, ఉద్యమ సమయంలో కేసీఆర్ సార్.. వేరేవారిని తీసుకువచ్చి ఇక్కడి దింపిం డు. వారు.. దీనిని సొంత జాగీరు అనుకుంటున్నారు. చింతమడకైనా.. సిద్దిపేట అయినా.. ఎవరి జాగీరూ కాదు. చింతమడక.. చిరుతలను కన్న భూమి.`` అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదేసమయంలో తన రాకపై కొందరు ఆంక్షలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
``కేసీఆర్ కూతురు ముందునా.. మీ ఆంక్షలు. మీరు ఎన్ని ఆంక్షలు పెడితే అన్నిసార్లు ఇక్కడకే వస్తా. ఈ గడ్డ ఎవరి జాగీరూ కాదు`` అని కవిత అన్నారు. ఇదేసమయంలో ఆమె తనను సొంత కుటుంబం నుంచి దూరం చేసిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. అయితే..ఎక్కడా హరీష్‌రావు పేరును ఆమె ప్రస్తావించలేదు. ఇదిలావుంటే.. కవితకు స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి.. కుంకం పెట్టి.. బతుకమ్మ సంబురాలకు తీసుకువెళ్లారు. కాగా.. కవిత వ్యాఖ్యలపై హరీష్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
