Begin typing your search above and press return to search.

కొత్త గర్ల్ ఫ్రెండ్ తో దొరికిన జస్టిన్ ట్రూడో.. వైరల్

టీఎంసీ (TMZ) పబ్లిష్ చేసిన ఒక వీడియోలో, 'రోర్' వంటి హిట్ పాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడోతో కలిసి టేబుల్ వద్ద ముచ్చటిస్తూ కనిపించారు.

By:  A.N.Kumar   |   30 July 2025 1:02 PM IST
కొత్త గర్ల్ ఫ్రెండ్ తో దొరికిన జస్టిన్ ట్రూడో.. వైరల్
X

ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ కేటీ పెర్రీ, కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడోల మధ్య ఇటీవల జరిగిన డిన్నర్ సమావేశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మాంట్రియాల్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్ "లె వయోలన్"లో జరిగిన ఈ భేటీ.. కేటీ పెర్రీ తన మాజీ ప్రేమికుడు ఒర్లాండో బ్లూమ్‌తో విడిపోయిన కొద్ది వారాల తర్వాత జరగడం విశేషం.

టీఎంసీ (TMZ) పబ్లిష్ చేసిన ఒక వీడియోలో, 'రోర్' వంటి హిట్ పాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేటీ పెర్రీ, జస్టిన్ ట్రూడోతో కలిసి టేబుల్ వద్ద ముచ్చటిస్తూ కనిపించారు. ఇద్దరూ ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతున్నట్లుగా కనిపించగా కేటీ పెర్రీ ట్రూడో చెప్పే మాటల్లో లీనమైపోయినట్లు స్పష్టంగా కనిపించింది.

ఈ డిన్నర్‌కి సంబంధించి ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం, ఈ జంట లాబ్స్టర్‌తో సహా పలు వంటకాలను ఆస్వాదించారు, కానీ మద్యం మాత్రం తీసుకోలేదు. భద్రతా సిబ్బంది వారి చుట్టూ ఉన్నప్పటికీ, వారు చాలా స్వేచ్ఛగా కనిపించారు. రెస్టారెంట్‌లోని సిబ్బందితో కూడా చాలా మర్యాదగా ప్రవర్తించారు. చివర్లో ఇద్దరూ చెఫ్‌ను అభినందించడమే కాకుండా వంటగదిలోకి వెళ్లి సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

కేటీ పెర్రీ తన కెనడా మ్యూజిక్ టూర్ మధ్యలో ఈ డిన్నర్ చేయడం మరో ఆసక్తికర అంశం. ఆమెకు ఒట్టావా , మాంట్రియాల్‌లలో షోలు ఉన్నాయి.

-కేటీ పెర్రీ – ఒర్లాండో బ్లూమ్ విడాకులపై ప్రకటన

ఇటీవల కేటీ పెర్రీ - హాలీవుడ్ నటుడు ఒర్లాండో బ్లూమ్ విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. వారి ప్రతినిధులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, "కేటీ - ఒర్లాండో గత కొన్ని నెలలుగా తమ సంబంధాన్ని విడగొట్టుకుంటూ.. వారి నాలుగు సంవత్సరాల కుమార్తె డేజీ డోవ్‌పై దృష్టి పెట్టే దిశగా కృషి చేస్తున్నారు" అని వెల్లడించారు.

ట్రూడో కూడా విడాకుల దశలోనే…

ఇక జస్టిన్ ట్రూడో విషయానికి వస్తే, ఆయన 2023లో తన భార్య సోఫీతో విడాకులు తీసుకున్నారు. వీరి వివాహ బంధం దాదాపు 18 ఏళ్ల పాటు కొనసాగింది. అందువల్లే ఆయన కూడా ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో కేటీ పెర్రీ – జస్టిన్ ట్రూడో డిన్నర్ భేటీపై అభిమానులు, మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. వీరి మధ్య నిజంగా ఏమొస్తుందో అనేది కాలమే చెప్పాలి, కానీ ఈ భేటీ కొత్త చర్చలకు తెరలేపింది మాత్రం నిజం! మరి ఈ ఇద్దరి మధ్య బంధం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.