నేపాల్ లో హోటల్ కు నిప్పు.. దూకేసిన భారతీయ జంట..దారుణం
నేపాల్ ప్రస్తుతం తీవ్ర అశాంతి పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి రాజధాని ఖాట్మండూను కూడా వణికించాయి.
By: A.N.Kumar | 12 Sept 2025 1:49 PM ISTనేపాల్ ప్రస్తుతం తీవ్ర అశాంతి పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి రాజధాని ఖాట్మండూను కూడా వణికించాయి. ఇప్పటికే ప్రధానమంత్రి కేపీ ఓలీ అధికారిక నివాసానికే నిప్పుపెట్టిన ఆగ్రహ నిరసనకారులు, ఇప్పుడు హోటల్ భవనాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఈ కల్లోల వాతావరణంలో గురువారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ఖాట్మండులోని హిల్టన్ హోటల్‌ను నిరసనకారులు మంటల బారిన పడేశారు. మంటల్లో చిక్కుకున్న భారతీయ దంపతులు ప్రాణాలను రక్షించుకోవడానికి నాలుగో అంతస్తు నుంచి దూకాల్సి వచ్చింది. ఈ దుర్ఘటనలో భార్య రాజేష్ దేవి గోల్ (55, డెహ్రాడూన్) అక్కడికక్కడే మరణించగా, ఆమె భర్త రామ్‌వీర్ సింగ్ గోల్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు పశుపతినాథ్ ఆలయ దర్శనార్థం నేపాల్‌కి వచ్చినట్లు సమాచారం.
ఇక మరోవైపు నిరసనల హింసతో పాటు జైళ్లలోనూ పరిస్థితి అదుపు తప్పింది. దేశవ్యాప్తంగా 25కి పైగా కారాగారాల్లో ఖైదీలు తిరుగుబాటు చేసి గోడలు బద్దలుకొట్టారు. సుమారు 15 వేల మంది ఖైదీలు పారిపోయారు. వారిలో కొందరిని నేపాల్ సైన్యం తిరిగి అదుపులోకి తెచ్చినప్పటికీ, చాలామంది ఇంకా పరారీలోనే ఉన్నారు.
రామెఛాప్ జిల్లా జైలులో ఖైదీలు గ్యాస్ సిలిండర్ పేల్చి గోడ కూల్చడంతో సిబ్బందితో ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో సిబ్బంది కాల్పులు జరపగా ముగ్గురు ఖైదీలు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఇప్పటి వరకు కల్లోల ఘటనల్లో 34 మంది మరణించగా, 1,300 మందికి పైగా గాయపడ్డారు.
సరిహద్దు దాటే ప్రయత్నంలో కూడా ఖైదీలు విఫలమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బయిర్‌గనియా చెక్‌పోస్ట్ సమీపంలో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 13 మంది నేపాలీ ఖైదీలను సశస్త్ర సీమా బల (ఎస్‌ఎస్‌బీ) అడ్డుకుంది. వారందరినీ తిరిగి నేపాల్ పోలీసులకు అప్పగించారు. ఇప్పటివరకు సరిహద్దు వద్ద 60మంది ఖైదీలు, ఒక బంగ్లాదేశ్ జాతీయుడు భారత బలగాలచే పట్టుబడి నేపాల్‌కు అప్పగించబడ్డారు.
ప్రజా నిరసనల ఆగ్రహం, జైళ్ల కల్లోలం, భద్రతా దళాల కఠిన చర్యలతో నేపాల్ చరిత్రలోనే ఒక క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. ఈ అల్లకల్లోల వాతావరణం ఎంతకాలం కొనసాగుతుందనేది ఇంకా అనిశ్చితంగానే ఉంది.
