Begin typing your search above and press return to search.

వైసీపీలో కాసు వారి కుస్తీలు.. ఫ‌లించేనా ..!

కాసు మహేష్ రెడ్డి. వారసత్వ రాజకీయాలతో పాలిటిక్స్ లోకి వచ్చిన కాసు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున గురజాల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

By:  Garuda Media   |   8 May 2026 5:00 PM IST
వైసీపీలో కాసు వారి కుస్తీలు.. ఫ‌లించేనా ..!
X

కాసు మహేష్ రెడ్డి. వారసత్వ రాజకీయాలతో పాలిటిక్స్ లోకి వచ్చిన కాసు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున గురజాల నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. నియోజకవర్గంలో సమస్యలను తాను పరిష్కరిస్తానని కచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని అప్పట్లో ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. అయితే ఆశించిన విధంగా కాసు మహేష్ రెడ్డి పెద్దగా పనిచేయలేకపోయారు. ఫలితంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఆయనకు టికెట్ ఇచ్చినప్పటికీ గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. ప్రజలను మెప్పించలేకపోయారు.

వాస్తవానికి గురజాల నియోజకవర్గంలో సామాజిక వర్గాలపరంగా విభిన్నమైన రాజకీయాలు కనిపిస్తున్నా యి. రెడ్డి... కమ్మ సామాజిక వర్గాల మధ్య ఒక్కొక్కసారి కలివిడి కనిపిస్తుంటే కొన్ని కొన్ని సందర్భాల్లో విడి విడి రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి. ఇది సంస్థాగతంగా ఉన్న నాయకులకు ఇబ్బంది లేకపోయినా కొత్తగా వచ్చే నాయకులకు ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా కాసు మహేష్ రెడ్డికి గత ఎన్నికల్లో ఓటమిపాలవడానికి సామాజిక సమీకరణ ప్రభావం చూపించిందన్నది స్పష్టమైనది. రెడ్డి సామాజిక వర్గమే కాసుకు అనుకూలంగా పనిచేయలేదని పరిశీలకులు అంచనా వేశారు.

మరి వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఏమన్నా పుంజుకుంటున్నారా అంటే చెప్పడానికి కష్టం. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా నియోజకవర్గంలో సమీకరణలు మారుతున్నాయి. దీంతో కాసు మహేష్ రెడ్డి ప్రభావం పెద్దగా కనిపించే అవకాశం ఉండదని అంటున్నారు. ప్రస్తుతం ఆయన ప్రజల మధ్య ఉంటున్నానని చెబుతున్నా ప్రజల సమస్యలపై గళం వినిపిస్తున్నానని అంటున్నప్పటికీ ప్రజల ఆకాంక్షల మేరకు ఆయన పని చేయడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది.

సమస్యలు అన్నిచోట్ల ఉంటాయి కానీ ఏ సమస్య ఏ వర్గానికి అవసరం అనేది ప్రధానం. ఈ విషయంలో కాసు వెనకబడుతున్నారనేది ప్రధాన చర్చనీయాంశం. ఇదే సమయంలో తాను అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టిన కాసు ఇప్పుడు అదే సామాజిక వర్గాన్ని చేరదీసేందుకు వారి ఓట్లను సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిని అదే సామాజిక వర్గం తప్పుపడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు తాము కనిపించలేదని ఇప్పుడు తమ అవసరం వచ్చిందని పెదవి విరుస్తున్నారు. ఇది ఒక రకంగా కాసు మహేష్ రెడ్డికి మైనస్ గా మారుతోంది.

అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఆయన మరింత బలంగా ప్రజల మధ్య ఉండడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకుని వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి చక్కబడుతుందని అంచనా వేస్తున్నారు. కార్యకర్తల సమీకరణతో పాటు నాయకుల సమన్వయం ఈ నియోజకవర్గంలో వైసీపీకి అత్యంత కీలకం. కానీ కాసును వ్యతిరేకించే వారు వైసీపీలోనే ఉండడం.. ప్రధాన ఇబ్బందికర అంశంగా మారింది. వీరిని సమన్వయం చేసుకొని కాసు ఏ విధంగా ముందుకు సాగుతారు అనేది చూడాలి.