Begin typing your search above and press return to search.

ఆ దుర్ఘటన వెనుక.. ఉచిత బస్సు రద్దీ కూడా?

కార్తీక ఏకాదశి సందర్భంగా శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాటకు దారితీసిన కారణాలు విస్తు గొలుపుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   2 Nov 2025 4:00 PM IST
ఆ దుర్ఘటన వెనుక.. ఉచిత బస్సు రద్దీ కూడా?
X

కార్తీక ఏకాదశి సందర్భంగా శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాటకు దారితీసిన కారణాలు విస్తు గొలుపుతున్నాయి. ముఖ్యంగా ఆలయ నిర్వహణలో వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసిందని చెబుతున్నప్పటికీ, ఊహించని స్థాయిలో భక్తులు రావడానికి ఉచిత బస్సు కూడా ఓ కారణంగా విశ్లేషిస్తున్నారు. సాధారణంగా ఈ ఆలయానికి రోజుకు రెండు నుంచి మూడు వేల మంది భక్తులు మాత్రమే వస్తారని, కానీ శనివారం ఒకేసారి 25 వేల మంది భక్తులు తరలిరావడానికి ఫ్రీ బస్సు ప్రధాన పాత్ర పోషించిందనే చర్చ జరుగుతోంది.

శనివారం కాశీబుగ్గ ఆలయంలో యథావిధిగా పూజలు జరుగగా, ఉదయం 9 గంటల వరకు పెద్దగా రద్దీ లేదని స్థానికులు చెబుతున్నారు. కానీ అనూహ్యంగా ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో భక్తుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలు చుట్టూ గ్రామీణ ప్రాంతాలే ఎక్కువ. దీంతో ఉదయం 7 గంటల తర్వాత బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తర్వాత కాశీబుగ్గ చేరుకోడానికి ఆయా ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారని, అందరూ 9-10 గంటల మధ్యలో రావడంతో ఒకేసారి రద్దీ పెరిగిపోయిందని స్థానికులు వివరిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కాశీబుగ్గకు మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జాతీయ రహదారికి అనుకుని ఉన్న ఈ చిన్న పట్టణానికి చుట్టుపక్కల సుమారు 10 మండలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలకు పలాస కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ నుంచి సుమారు పది మండలాలకు బస్సు సర్వీసులు విరివిగా ఉన్నాయి. దీంతో ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చిన తర్వాత మహిళలు గుడులు, గోపురాలకు దర్శనం కోసం రావడం ఎక్కువైందని అంటున్నారు.

శనివారం కూడా కాశీబుగ్గ ఆలయానికి ఇదే మాదిరిగా వేల మంది మహిళా భక్తులు తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన వారిలో మెజార్టీ సంఖ్యలో మహిళలే కనిపించారు. అందుకే ప్రాణాలు కోల్పోయిన వారిలో అందరూ మహిళలే ఉన్నారని అంటున్నారు. కొత్తగా కట్టిన ఆలయం కావడం, బస్సు సర్వీసులు అందుబాటులో ఉండటం వల్ల భక్తులు భారీగా తరలివచ్చారని అంటున్నారు. ఆలయంలో అద్భుతమైన శిల్పకలతోపాటు వెంకటేశ్వర స్వామి, శివుడు, దశావతరాలు ఇలా పలు దేవతామూర్తులను ప్రతిష్ఠించడం వల్ల కూడా భక్తులు భారీగా తరలిరావడానికి ఓ కారణంగా చెబుతున్నారు.