12 ఎకరాల్లో ఆలయం.. ఏడాది క్రితమే ప్రారంభం.. కాశీబుగ్గ ఆలయం వెనుక స్టోరీ ఇదీ..
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొమ్మిది మంది భక్తులు మరణించిన వెంకటేశ్వరస్వామి ఆలయంపై ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
By: Tupaki Political Desk | 1 Nov 2025 1:41 PM ISTశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొమ్మిది మంది భక్తులు మరణించిన వెంకటేశ్వరస్వామి ఆలయంపై ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దాదాపు 12 ఎకరాల్లో కొత్తగా నిర్మించిన ఈ ఆలయాన్ని ఏడాది క్రితమే ప్రారంభించారు. ఒడిశా రాజకుటుంబానికి చెందిన హరి ముకుంద పండా అనే 95 ఏళ్ల వృద్ధుడు తన సొంత ఖర్చులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. శతాధిక వృద్ధురాలైన తన తల్లి వెంకటేశ్వరస్వామి భక్తురాలు, తిరుమలలో స్వామి వారిని దర్శించుకోడానికి రోజురోజు ఇబ్బందులు ఎక్కువ అవుతుండటం వల్ల తన సొంత పొలంలో ఆలయం నిర్మించేందుకు హరి ముకుంద పండా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఆయన వెళ్లినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారని, ఆ రోజు ఆయనను క్యూలైన్ నుంచి పక్కకు తోసేసినట్లు చెబుతున్నారు. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని జీర్ణించుకోలేని హరి ముకుంద పండా తన కాశీబుగ్గలో సొంతూరులో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
2018లో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన ముకుంద పండా, 2023 డిసెంబరు నాటికి నిర్మాణం పూర్తి చేశారు. గత ఏడాది నుంచే భక్తుల దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఇంత పెద్ద ఆలయం కాశీబుగ్గ పరిసరాల్లో ఎక్కడా లేకపోవడంతో ఇటీవల కాలంలో భక్తుల రాక పెరగిందని చెబుతున్నారు. ఇక శనివారం, కార్తీక ఏకాదశి కావడంతో సుమారు పది వేల మంది భక్తులు ఒకేసారి వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. వీరిని నియంత్రించడానికి తగిన సిబ్బంది, సేవకులు లేకపోవడంతో దుర్ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నారు.
ఇక కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయానికి ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు, సూచనలు కూడా తీసుకోలేదని అంటున్నారు. ముకుంద పండా తల్లి శతాధిక వృద్ధురాలు విష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో నిపుణురాలు కావడంతో ఆమో సూచనలు, సలహాల ప్రకారమే ఆలయ నిర్మాణం జరిగిందని అంటున్నారు. వేల మంది భక్తులు రావడం, ఇరుకు ద్వారం గుండా ప్రవేశం కూడా ప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం హరి ముకుంద పండా నిర్వహణలోనే ఆలయం ఉంది. కొత్త ఆలయం కావడం, పైగా దర్శకర్త సొంత ఖర్చులు, సొంత పొలంలో నిర్మించడం వల్ల ప్రభుత్వం, పోలీసులు ఈ ఆలయ నిర్వహణపై దృష్టిపెట్టలేదు. ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడుతోపాటు శివుడు, దశావతరాలు, గరుత్మంతుడు, ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి. ఆలయ గోడలపై అద్భుతమైన శిల్పాలు చెక్కారు. నీటిని కొలను, కల్యాణ మండపాలు వంటివన్నీ ఏర్పాటు చేశారు. అన్ని రకాల సౌకర్యాలు ఉండటంతో భక్తుల రాక క్రమంగా పెరిగిందని అంటున్నారు. ఆలయంలో పూజలు ప్రారంభించిన ఏడాదిలోనే ఘోరం జరగడంపై భక్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
