తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఘోరం
కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా కాశీబుగ్గలో నిర్మించిన ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. నిజానికి ఈ ఆలయానికి ఇంతకుముందు ఎప్పుడు ఈ స్థాయిలో భక్తులు రాలేదు.
By: Tupaki Political Desk | 1 Nov 2025 1:11 PM ISTశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఘోరం చోటుచేసుకుంది. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుని 9 మంది మరణించారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని చెబుతున్నారు. ఆలయంలో రైలింగ్ ఊడిపడిపోవడంతో తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక సమాచారం. ఏకాదశి, శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఆలయం ప్రైవేటు యాజమాన్యంలో ఉండటం, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా లేకపోవడం వల్ల దుర్ఘటన చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు.
కార్తీక మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా కాశీబుగ్గలో నిర్మించిన ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. నిజానికి ఈ ఆలయానికి ఇంతకుముందు ఎప్పుడు ఈ స్థాయిలో భక్తులు రాలేదు. శనివారం రోజున ఏకాదశి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఐదేళ్ల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఓ భక్తుడు నిర్మించిన ఈ ఆలయం ప్రైవేటు యాజమాన్యంలోనే ఉంది.
భారీగా వచ్చిన భక్తులు దర్శనాల కోసం ఎగబడటం, వందల మంది ఒకేసారి చొచ్చుకురావడం వల్ల రద్దీని నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన రైలింగ్ ఊడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఒకరిపై ఒకరు పడటంతో దాదాపు ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
ఇక దుర్ఘటనపై సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనను అత్యంత దురదృష్టకరంగా వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు బాధితులను అండగా నిలుస్తామని ప్రకటించారు. జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇన్ చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును హుటాహుటిన కాశీబుగ్గ వెళ్లాలని ఆదేశించారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స అందజేయాలని సూచించారు.
