ఇద్దరు భార్యలతో కార్వా చౌత్.. వీడియో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ‘రాంబాబు నిషాద్’ అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలతో కలిసి కర్వా చౌత్ నిర్వహించుకున్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By: Tupaki Political Desk | 13 Oct 2025 4:31 PM ISTనార్త్ లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే పండుగ ‘కర్వా చౌత్’. భార్య భక్తితో భర్తను పూజిస్తుంది. అయితే ఇటవల ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా నిలిచింది. ఈ వీడియోపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకే అన్నవారి కంటే సంప్రదాయాన్ని నాశనం చేస్తున్నారు అన్న వారే ఎక్కువ మంది ఉన్నారు. దేశ సంస్కృతి, విలువలు, చట్టాలను కూడా మీరేలా ఉందని చెప్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ‘రాంబాబు నిషాద్’ అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలతో కలిసి కర్వా చౌత్ నిర్వహించుకున్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ముగ్గురు కలిసి నవ్వుతూ, ఆచారాలు పాటిస్తూ కనిపిస్తున్నారు. ఇది సాధారణ ఘటనలా కనిపించినా.. భారతీయ సమాజంలో ఇది పెద్ద చర్చకు దారితీసింది. కొంత మంది ‘ఇది వారి వ్యక్తిగత జీవితం’ అంటుండగా, మరికొందరు ‘ఇది సంప్రదాయానికి అవమానం’ అని విమర్శిస్తున్నారు.
పవిత్రతకు ప్రతీక
భారతీయ సంస్కృతిలో వివాహం అనేది కేవలం చట్టం కోసం వేసుకొనే బంధం కాదు.. అది ఆధ్యాత్మిక బంధం.. హిందూ సంప్రదాయంలోని సప్తపదులు ఆ ఏడు అడుగులు జీవితాంతం భాగస్వాములు పరస్పర గౌరవం, విశ్వాసం, నిబద్ధతతో ఉండాలనేందుకు ప్రతిజ్ఞలు. వాటిలో ఒక ప్రతిజ్ఞ ‘భర్త లేదా భార్య ఇతర బయటి వ్యక్తులపై మనసు పెట్టకూడదు’ అని స్పష్టంగా చెబుతుంది. ఈ వాగ్ధానం కేవలం వ్యక్తిగత నిబద్ధత కాదు.. అది సామాజిక స్థిరత్వానికి మూలం. ఇద్దరు భార్యలతో బహిరంగంగా జీవించడం, అదే వేడుకను ఒకే ఆచారంగా జరపడం, ఆ పవిత్ర వాగ్ధానానికి విరుద్ధం. ఇది ఒక వ్యక్తిగత హక్కుగా చెప్పుకునేంత తేలికైన విషయం కాదు. ఇది సాంస్కృతిక బాధ్యతకు విరుద్ధం.
చట్టం స్పష్టంగా చెబుతుంది
భారతదేశంలో హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం.. ఒక వ్యక్తి ఒకే భార్య లేదా ఒకే భర్తతో వివాహ బంధంలో ఉండాలి. ఒకరి జీవితం కొనసాగుతూనే మరొకరిని వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధం. ఇది బైగామీ (Bigamy) అనే నేరానికి లోబడి, శిక్షార్హమైన చర్య అవుతుంది.
రాంబాబు నిషాద్ వంటి వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రదర్శనాత్మకంగా అలాంటి వీడియోలు పోస్టు చేయడం కేవలం నైతిక సమస్య కాదు, చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాలి. ఇది ఒక పెద్ద సామాజిక ప్రమాదం కూడా ఇలాంటి వీడియోలు యువతలో ‘సంప్రదాయం కేవలం ఎంపిక మాత్రమే’ అనే తప్పుడు భావనను పెంచుతాయి.
ఈ వీడియో ప్రధానమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ‘ఇది ఒక కుటుంబ ఆచారం కాదు.. అలాంటప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం ఎందుకు?’ ఇప్పుడు ప్రతి సందర్భం సోషల్ మీడియా కోసం ఒక ‘కంటెంట్’గా మారిపోయింది. కార్వా చౌత్ లాంటి సంప్రదాయ పండుగ మహిళల భర్తల పట్ల నిబద్ధత, ప్రేమను సూచించే పండుగ. ఇప్పుడు లైక్స్, కామెంట్ల కోసం ఒక షోలా మారుతోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రేమను ప్రదర్శనగా మార్చడం ద్వారా మన సంప్రదాయంలోని ఆత్మను కోల్పోతున్నాం.
వ్యక్తి గత స్వేచ్ఛకు హద్దులు ఉండాలి
ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛను ఉపయోగించే విధానం సామాజిక బాధ్యతతో కూడినదై ఉండాలి. వివాహం ఒక సామాజిక ఒప్పందం. అది కేవలం ఇద్దరి మధ్యే కాదు, సమాజం సాక్షిగా జరుగుతుంది. అందువల్ల దాన్ని బహిరంగ ప్రదర్శనగా, లైక్స్ కోసం ఇలాంటి పనులు చేయడం.. చట్టం ఉల్లంఘించిన తమను ఏమీ చేయలేదన్న విధానంగా సమాజానికి తప్పుదారి పట్టించేదిగా ఉంటుంది.
రాంబాబు నిషాద్ వీడియో ఒక వ్యక్తిగత స్వేచ్ఛ కాదు. ఇది సమాజం ఎంత మారిపోయిందో చూపించే అద్దం. సంప్రదాయ పండుగలు మనలను కలపాలి కానీ విభజించకూడదు. వివాహం మన సంస్కృతిలో నమ్మకానికి ప్రతీక. దాన్ని లైమ్‌లైట్‌లో పెట్టడం సరైన పద్ధతి కాదు.
