Begin typing your search above and press return to search.

మాట నిలబెట్టుకున్న విజయ్... 95% పని పూర్తి!

కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన మూడు వారాల తర్వాత.. విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) మృతుల కుటుంబాలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చింది.

By:  Raja Ch   |   19 Oct 2025 5:20 PM IST
మాట నిలబెట్టుకున్న విజయ్... 95% పని పూర్తి!
X

టీవీకే అధినేత జోసఫ్ విజయ్.. కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో సంభవించిన భారీ తొక్కిసలాట తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విజయ్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు భారీ సహాయం ప్రకటించారు.

ఇందులో భాగంగా... ఈ తొక్కిసలాటలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడ్డ వారికి రెండు లక్షల రూపాయల చొప్పన పరిహారాన్ని ప్రకటించారు. ఇది ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం కంటే రెట్టింపు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆ ఘటనలో మృతి చెందిన 41 మందిలో 39 మంది కుటుంబాలకు తాజాగా రూ.20 లక్షలు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

అవును... కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన మూడు వారాల తర్వాత.. విజయ్ పార్టీ తమిళగ వెట్రీ కజగం (టీవీకే) మృతుల కుటుంబాలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చింది. తాజా నివేదికల ప్రకారం.. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 39 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ20 లక్షలు బదిలీ చేసింది!

ఈ సందర్భంగా మొత్తం రూ.7.8 కోట్ల సహాయాన్ని ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడిందని తెలుస్తోంది. అయితే.. కొన్ని విధానపరమైన జాప్యాల కారణంగా మరో రెండు కుటుంబాలకు ఇంకా పరిహారం అందలేదని తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా విజయ్ భరిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సహాయంతో పాటు.. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు అందజేస్తామని.. ఇదే క్రమంలో.. బాధిత కుటుంబాలకు విద్య, ఉపాధి అవకాశాలలో సహాయం అందించడం ద్వారా దీర్ఘకాలిక భరోసా ఇస్తామని విజయ్ హామీ ఇచ్చారు.

ప్రతీ నెల రూ.5వేల ఆర్ధిక సాయం!:

ఇలా.. కరూర్‌ తొక్కిసలాటలో మృతి చెందినవారి కుటుంబాలకు తలా రూ.20 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షలు అందజేయనున్నట్టు ప్రకటించడం.. తాజాగా రూ.20 లక్షలు అందించడం జరిగింది. ఇదే క్రమంలో... మృతుల కుటుంబాలకు నెల నెలా రూ.5 వేల ఆర్థికసాయం అందజేస్తామని టీవీకే నిర్వాహకుడు, జేప్పియార్‌ సాంకేతిక కళాశాల అధినేత, విల్సన్‌ తెలిపిన సంగతి తెలిసిందే.

'దీపావళి వేడుకలు మానుకోండి'!:

కరూర్ తొక్కిసలాట తర్వాత తాజాగా టీవీకే.. తన కార్యకర్తలకు దీపావళి జరుపుకోవద్దని సూచించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రచార సంయుక్త కార్యదర్శి లయోలా మణి స్పందిస్తూ... 'విజయ్ సూచనల ఆధారంగా, మరణించిన వ్యక్తికి నివాళులు అర్పించడానికి మనం దీపావళి జరుపుకోకూడదు' అని ఎక్స్ లో పేర్కొన్నారు.