Begin typing your search above and press return to search.

6, 30, 11, 39... ఈ ఏడాది తొక్కిసలాట ఘటనలివే!

ఈ ఏడాది ఇప్పటికే ఈ తరహా తొక్కిసలాట ఘటనలు మూడు జరగ్గా.. ఎక్కువ మరణాలు ఈ ఘటనలోనే చోటు చేసుకున్నాయి.

By:  Raja Ch   |   28 Sept 2025 11:47 AM IST
6, 30, 11, 39... ఈ ఏడాది తొక్కిసలాట ఘటనలివే!
X

తమిళనాడులోని కరూర్‌ లో.. సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ప్రచారసభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్‌.. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్త ప్రచారయాత్రను ప్రారంభించారు. వేలుసామిపురంలో శనివారం రాత్రి 7.30 గంటలకు విజయ్‌ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.

శనివారాల్లో మాత్రమే జరిగే ఈ యాత్రలో తాజాగా జరిగిన తాజా తొక్కిసలాటలో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 39 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనతో ఈ ఏడాది జరిగిన తొక్కిసలాట ఘటనల్లో మరొకటి వచ్చి చేరినట్లయ్యింది. ఈ ఏడాది ఇప్పటికే ఈ తరహా తొక్కిసలాట ఘటనలు మూడు జరగ్గా.. ఎక్కువ మరణాలు ఈ ఘటనలోనే చోటు చేసుకున్నాయి.

* ఇందులో భాగంగా... ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా.. సుమారు 48 మంది వరకూ గాయపడ్డారు!

* ఇక జనవరి 28న మౌని అమావాస్య రోజు మహా కుంభమేళాలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం చెందగా 60 మంది వరకూ గాయపడ్డారు. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో.. వారి తాకిడికి బారికేడ్లు విరగడం వల్ల తొక్కిసలాట జరిగింది!

* జూన్ 4న ఐపీఎల్ గెలిచిన ఆనందంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేపట్టిన విజయోత్సవ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా... సుమారు 50 మంది వరకూ గాయపడ్డారు!

* ఈ క్రమంలోనే తాజాగా కరూర్‌ లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39గా ఉండగా... క్షతగాత్రుల సంఖ్య 50కి పైగా ఉండొచ్చని అంటున్నారు. విజయ్‌ ప్రసంగిస్తుండగా.. కొందరు ఒక్కసారిగా ఆయనకు సమీపానికి వచ్చేందుకు ప్రయత్నించడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.