కరూర్ తొక్కిసలాటపై ఎఫ్‌ఐఆర్... తెరపైకి సంచలన అభియోగాలు!
అవును... కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే అరెస్టులు మొదలయ్యాయి.
By: Raja Ch | 30 Sept 2025 9:37 AM ISTతమిళనాడులోని కరూర్ లో సినీనటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభలో శనివారం రాత్రి తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాటలో మృతుల సంఖ్య 41 కి చేరింది. పదుల సంఖ్యలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్. లో విజయ్ పై కీలక అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది.
అవును... కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే అరెస్టులు మొదలయ్యాయి. మరోవైపు దర్యాప్తు అధికారిని ప్రభుత్వం మార్చింది. ఈ సమయంలో విజయ్ ఉద్దేశపూర్వక రాజకీయ బలప్రదర్శన వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వాటి ప్రకారం... విజయ్ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా.. 11 గంటలకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉంది. కానీ ఆయన సాయంత్రం ఏడు గంటలకు వచ్చారు. భారీ జనసందోహాన్ని చూపించేందుకే ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా వచ్చారని ఎఫ్.ఐ.ఆర్.లో పొందుపరిచారు!
ఆ ఉద్దేశపూర్వక ఆలస్యం వల్ల ప్రజలు అలా ఎండలో నిల్చొని అలసిపోయారు. మరోవైపు విజయ్ ప్రయాణిస్తున్న బస్సు.. ఎలాంటి అనుమతులు లేకున్నా షెడ్యూల్ కు భిన్నంగా పలుచోట్ల ఆగింది. దాని వల్ల పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అనంతరం ఏడు గంటలకు విజయ్ వచ్చేసరికి ఆ జనసమూహాన్ని నిర్వహించడం కష్టమైపోయింది.. అది తొక్కిసలాటకు దారితీసింది అని ఎఫ్‌ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు.
ఇక, అక్కడ గుమిగూడిన వారికి ఆహారం, మంచినీళ్లు, ఇతర సౌకర్యాలు అందుబాటులో లేవంటూ వచ్చిన హెచ్చరికలను నటుడితో పాటు సీనియర్ నాయకుడు ఎన్.ఆనంద్ విస్మరించారని పేర్కొన్న పోలీసులు.. పార్టీ జిల్లా సెక్రటరీ మథియాళన్, స్టేట్ జనరల్ సెక్రటరీ ఆనంద్, స్టేట్ జాయిట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ పేర్లను ఎఫ్‌ఐఆర్ లో చేర్చారు. సోమవారం రాత్రి మథియాళన్ ను అరెస్ట్ చేశారు.
మరోవైపు ఈ దుర్ఘటనలో కుట్రకోణం ఉందని, అందువల్ల స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు టీవీకే నాయకుడు ఆదవ్ అర్జున మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కు విన్నవించారు.
