తొక్కిసలాట ఘటన... రెట్టింపు పరిహారం ప్రకటించిన విజయ్!
ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ ఓ ప్రకటన చేశారు. ఇందులో భాగంగా.. కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడ్డ వారికి రెండు లక్షల రూపాయల చొప్పన పరిహారాన్ని ప్రకటించారు.
By: Raja Ch | 28 Sept 2025 12:44 PM ISTప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్.. కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో సంభవించిన భారీ తొక్కిసలాట తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. వీరిలో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నారు. ఈ సమయంలో ఈ ఘటనపై ‘ఎక్స్’ వేదికగా మరోసారి స్పందించిన విజయ్.. మృతులకు, క్షతగాత్రులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
అవును... కరూర్ లో టీవీకే అధినేత నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డ వారికి లక్ష రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు.
ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ ఓ ప్రకటన చేశారు. ఇందులో భాగంగా.. కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడ్డ వారికి రెండు లక్షల రూపాయల చొప్పన పరిహారాన్ని ప్రకటించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ‘ఎక్స్’ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలు, గాయపడ్డవారిని తాను స్వయంగా కలుస్తానని అన్నారు.
అంతక ముందు స్పందించిన ఆయన... "నా హృదయం ముక్కలైంది.. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను.. ఆ బాధ మాటల్లో వర్ణించలేనిది. కరూర్ లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.
స్పందించిన స్టాలిన్!:
కరూర్ లో జరిగిన ఘటనలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం స్టాలిన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 39 మంది ప్రాణాలో కోల్పోయారని.. రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంతమంది ప్రజలు మరణించడం ఇదే తొలిశారని తెలిపారు.
ఇదే సమయంలో.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని.. ప్రస్తుతం 51 మంది చికిత్స పొందుతున్నారని అన్నారు. ఇక.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.లక్ష పరిహారం అందిస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. అనంతరం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన విజయ్.. రెట్టింపు పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం!
