Begin typing your search above and press return to search.

పార్టీల ప్ర‌చార యావ‌: ప్ర‌జ‌ల‌కు ప్రాణ సంక‌టం

భారీ బ‌హిరంగ ప్ర‌దేశాల్లో స‌భ‌లు నిర్వ‌హిస్తే.. అనుకున్న స్థాయిలో జ‌నాలు రాక‌పోతే.. ఇత‌ర పార్టీలు ఎద్దేవా చేసే అవ‌కాశం ఉంద‌న్న‌ది వాస్త‌వం. దీంతో ఓటు బ్యాంకు దూర‌మ‌వుతుంద‌న్న చ‌ర్చ కూడా ఉంది.

By:  Garuda Media   |   28 Sept 2025 3:00 PM IST
పార్టీల ప్ర‌చార యావ‌: ప్ర‌జ‌ల‌కు ప్రాణ సంక‌టం
X

రాజ‌కీయ పార్టీల ప్ర‌చార యావ ప్ర‌జ‌ల‌కు ప్రాణ సంక‌టంగా మారింది. తాజాగా జ‌రిగిన త‌మినాడు లోని క‌రూర్ క‌న్నీ టి విషాదంలో 40 మంది మృత్యువాత ప‌డ్డారు. వీరిలో ఇద్ద‌రు గ‌ర్భిణులు.. స‌హా మ‌రింత మంది చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో అస‌లు రాజ‌కీయ పార్టీల‌కు బాధ్య‌త లేదా? అనే చ‌ర్చ దేశ‌వ్యాప్తంగా మొద‌లైంది. వాస్త‌వానికి రాజ‌కీ య పార్టీలు స‌భలు పెట్ట‌డం.. విచ్చ‌ల‌విడిగా ప్ర‌జ‌ల‌ను త‌ర‌లించ‌డం.. త‌మ బ‌లాన్ని బ‌ల‌గాన్ని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌త ద‌శాబ్ద కాలంగా కామ‌న్‌గా మారింది.

త‌మిళ‌నాడు స‌హా.. కేర‌ళ‌, ఏపీలోనూ.. అనేక విషాద ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి.. పార్టీలు ప్ర‌చారం చేసుకునేందుకు ఎవ‌రికీ అభ్యంత‌రం ఉండ‌దు. కానీ, కొంద‌రు రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌లు.. స‌భ‌లు.. స‌మావేశాల విష‌యంలో పార్టీల‌కు ఇచ్చిన సూచ‌న‌లు వింత‌గా ఉంటున్నాయి. ఏ పార్టీ అయినా.. త‌మ స‌భ‌లు స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటాయి. దీనిలో త‌ప్పులేదు. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగే స‌భ‌లు, స‌మావేశాల‌ను మ‌రింత విజ‌యం సాధించేలా ప్లాన్ చేస్తారు. ఈ క్ర‌మంలోనే స‌ల‌హాదారులు.. వ్యూహం మార్చారు.

భారీ బ‌హిరంగ ప్ర‌దేశాల్లో స‌భ‌లు నిర్వ‌హిస్తే.. అనుకున్న స్థాయిలో జ‌నాలు రాక‌పోతే.. ఇత‌ర పార్టీలు ఎద్దేవా చేసే అవ‌కాశం ఉంద‌న్న‌ది వాస్త‌వం. దీంతో ఓటు బ్యాంకు దూర‌మ‌వుతుంద‌న్న చ‌ర్చ కూడా ఉంది. ఈ క్ర‌మంలోనే ఇరికిరుకు సందుల్లోనూ.. ప‌ట్టుమ‌ని 10 వేల మంది కూడా ప‌ట్ట‌ని వీధుల్లోనూ స‌మావేశాలు ఏర్పాటు చేసి.. అక్క‌డ‌కు వ‌చ్చిన వారితో స‌భ దిగ్విజ‌యం అయింద‌ని చెప్పుకొనే ప్ర‌య‌త్నాలు.. గ‌త ద‌శాబ్ద కాలం నుంచి జ‌రుగుతున్నాయి. అయితే.. ఎలాంటి తొక్కిస‌లాట జ‌ర‌గ‌క‌పోతే.. ఫ‌ర్వాలేదు. కానీ, జ‌రిగితేనే విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా టీవీకే స‌భ‌లోనూ ఇలానే జ‌రిగింది. క‌రూర్‌లోని వేలు స్వామిపురంలోని స్థానిక ర‌హ‌దారిపై నిర్వ‌హించిన స‌భ లో 40 మంది మృతి చెందారు. కానీ, ఇక్క‌డ ప‌ది వేల మంది కూడా ప‌ట్టే అవ‌కాశం లేద‌ని అధికారులు చెబుతున్నా రు. అలాంటిది.. ఏకంగా 2 ల‌క్ష‌ల మంది పైచిలుకు.. ఇరుగు పొరుగు జిల్లాల నుంచి త‌ర‌లించిన‌ట్టు తెలిసింది. దీంతో స‌భ హిట్ట‌యింద‌ని ప్ర‌చారం చేసుకునే వ్యూహం ఉంది.

గ‌తంలో ఏపీలోనూ.. ఓ పార్టీ నాయ‌కుడు నిర్వ‌హించిన స‌భ‌లో ఇలానే.. 2 వేల మంది ప‌ట్టే చోట నిర్వ‌హించిన స‌భ‌లో 20 వేల మందిని పిలిచారు. అప్ప‌ట్లో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 8 మంది చ‌నిపోయారు. కేర‌ళ‌లో రాహుల్‌గాంధీ నిర్వ‌హించిన స‌భ‌లో తొక్కిస‌లాట జ‌రిగినా.. ఒక్క‌రు మిన‌హా అంద‌రూ బ‌య‌ట ప‌డ్డారు. క‌ర్ణాట‌క‌లో గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. తొక్కిస‌లాట‌లుజ‌రిగాయి. అయితే.. ఎవ‌రూ ప్రాణాలు కోల్పోలేదు. ఏదేమైనా పార్టీ ప్ర‌చార యావ ప్ర‌జ‌ల‌కు సంక‌టంగా మారింద‌న్న‌ది వాస్త‌వం.