Begin typing your search above and press return to search.

విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట.. అసలు కారణమేంటి?

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ రోడ్ షోకు 10 వేల మంది ప్రజలు హాజరువుతారని భావిస్తే.. ఏకంగా లక్షకు పైనే జనం ఈ రోడ్ షోకు పోటెత్తటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

By:  Garuda Media   |   28 Sept 2025 9:45 AM IST
విజయ్ రోడ్ షోలో తొక్కిసలాట.. అసలు కారణమేంటి?
X

ఇటీవల కాలంలో పెట్టిన ఒక రాజకీయ పార్టీ సభలో తొక్కిసలాట చోటు చేసుకోవటం.. ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోవటం.. 45 మందికి పైనే తీవ్రంగా గాయపడటం.. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. అనూహ్య రీతిలో చోటు చేసుకున్న ఈ విషాదం ఇప్పుడు షాకింగ్ గా మారింది. రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటకు అసలు కారణమేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఈ తొక్కిసలాటకు కారణం భారీగా వచ్చిన జనసందోహంగా చెబుతున్నారు. విజయ్ పార్టీ అయిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) నిర్వహించిన ఈ సభకు పార్టీ అధినేత.. ప్రముఖ సినీ నటుడైన విజయ్ హాజరయ్యే విషయంలో చాలా ఆలస్యం జరిగిందని చెబుతున్నారు. షెడ్యూల్ కంటే ఏడు గంటలు ఆలస్యంగా ఆయన కరూర్ కు చేరుకున్నారు. గంటల కొద్దీ వెయిట్ చేసిన ప్రజలు.. విజయ్ ను చూసేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించటం.. ఆయనకు దగ్గరగా వెళ్లాలని అనుకోవటం కూడా తొక్కిసలాటకు కారణంగా చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ రోడ్ షోకు 10 వేల మంది ప్రజలు హాజరువుతారని భావిస్తే.. ఏకంగా లక్షకు పైనే జనం ఈ రోడ్ షోకు పోటెత్తటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. అంచనాలకు మించి భారీగా హాజరైన అభిమానులు కూడా ఈ తొక్కిసలాటకు మరో ముఖ్య కారణంగా చెబుతున్నారు. పోలీసుల అనుమతి వేళలోనూ.. తమ రోడ్ షోకు 10 వేల మంది వస్తారని అంచనా వేస్తే.. అనుమతి పొందిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

పది వేల మంది వస్తారని అంచనా వేసినప్పటికీ.. ముందస్తు జాగ్రత్తతో 60 వే లమందికి సరిపోయేలా సభా స్థలిని ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. లైట్ హౌస్ రౌండ్ టానా సమీపంలో ఇంజనీర్ తో అధ్యయనం చేయించామని.. 1.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం 60 వేల మందికి సరిపోతుందని.. తమ సభకు పది వేల మందే వస్తారు కాబట్టి.. ఎలాంటి సమస్య ఉండదని భావించినట్లు తెలుస్తోంది. అయితే.. రోడ్ షో నిర్వహించిన ప్రదేశాన్ని పోలీసులే విజయ్ పార్టీకి సూచించారన్న విమర్శ కూడా ఉంది. ఈ విషాద ఉదంతంలో పోలీసుల వైఫల్యం.. నిఘా విభాగం పని తీరు సరిగా లేకపోవటం కూడా ఇంత మంది ప్రాణాలు పోయేందుకు కారణమైనట్లుగా చెబుతున్నారు.

షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం రెండు గంటల వేళకు విజయ్ వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉన్నప్పటికీ.. ఆయన ఆరు గంటలు ఆలస్యంగా రావటం కూడా ప్రమాదానికి కారణమైనట్లు భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం జరిగి ఉంటే.. ఇంత భారీ స్థాయిలో అభిమానులు అక్కడకు చేరుకునే అవకాశం ఉండేది కాదని అంటున్నారు. విజయ్ ఆలస్యంతో ఆయన అభిమానులు మరింత మంది ఎక్కువగా చేరుకున్నారని.. తీవ్రమైన రద్దీతో పాటు.. ఉక్కపోత కూడా అనేక మంది స్ప్రహ కోల్పోవటానికి కారణమైనట్లుగా చెబుతున్నారు.

పరిస్థితి అదుపు తప్పినట్లుగా గుర్తించిన విజయ్.. పలువురికి తన వాహనంలో ఉన్న నీళ్ల బాటిళ్లను అందించే ప్రయత్నం చేయటం.. తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేయటం చేశారు. అయితే.. కార్యకర్తలు.. అభిమానులు పెద్ద ఎత్తున విజయ్ వాహనం వద్దకు వచ్చే ప్రయత్నం చేయటంతో తీవ్రమైన తొక్కిసలాటకు కారణమైందంటున్నారు. ఇదే పెద్ద ఎత్తున ప్రాణాలు పోయేందుకు కారణమైనట్లుగా భావిస్తున్నారు.

సభ నిర్వహించిన ప్రాంతం ఇరుకైన రోడ్లు ఉండటం.. వేలాది మందితో రోడ్లు మొత్తం కిక్కిరిసిపోవటం.. సభ పూర్తయ్యే సరికి చీకట్లు అలుముకోవటం.. తీవ్రమైన ఉక్కపోత కారణంగా.. త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోవాలన్న తొందరతో గందరగోళం చోటు చేసుకోవటంతోనే ఇంత విషాదానికి కారణమైందని చెప్పొచ్చు. సభ నుంచి తిరుచ్చి ఎయిర్ పోర్టుకు చేరుకున్న విజయ్ ను అక్కడి మీడియా ప్రశ్నించగా.. విషణ్ణ వదనంతో ఉన్న ఆయన మౌనంగా వెళ్లిపోయారు. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే.. తన గుండె పగిలిందని వేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.