Begin typing your search above and press return to search.

రసవత్తరం... కరూర్ తొక్కిసలాటపై కుష్బూ సంచలన వ్యాఖ్యలు!

తమిళనాడులోని కరూర్‌ లో గత నెల 27న జరిగిన టీవీకే పార్టీ అధినేత విజయ్‌ ప్రచారసభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మరణించిన సంగతీ తెలిసిందే

By:  Raja Ch   |   5 Oct 2025 12:28 PM IST
రసవత్తరం... కరూర్ తొక్కిసలాటపై కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
X

తమిళనాడులోని కరూర్‌ లో గత నెల 27న జరిగిన టీవీకే పార్టీ అధినేత విజయ్‌ ప్రచారసభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మరణించిన సంగతీ తెలిసిందే. ఈ ఘటన జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఘటన అనంతరం తమిళనాట రాజకీయ పరిణామాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఈ సమయంలో కుష్బూ స్పందించారు.

అవును... కరూర్ లో జరిగిన తొక్కిసలాట అనంతరం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలుండటంతో ఇప్పటికే వేడేక్కిన రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో... విజయ్ కు బాసటగా బీజేపీ నిలుస్తూ.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది.

ఈ సమయంలో తాజాగా బీజేపీ నేత కుష్బూ స్పందించారు. ఇందులో భాగంగా... విజయ్ ఇప్పటికే ప్రజలకు క్షమాపణలు చెప్పారని.. ఆయన సీబీఐ దర్యాప్తును కూడా డిమాండ్ చేశారని అన్నారు. అయితే... తమిళనాడు ప్రభుత్వం మాత్రం సిట్ ద్వారా దర్యాప్తు నిర్వహిస్తోందని.. సంఘటనా స్థలానికి వెళ్లడంలో ఉన్న ఇబ్బందులను కూడా విజయ్ వివరించారని అన్నారు.

ఇదే సమయంలో... కరూర్ లో జరిగిన తొక్కిసలాట క్రియేట్ చేసిన ప్రమాదంగా కనిపిస్తోందంటూ ఆమె ఆరోపించారు. తొక్కిసలాట పూర్తిగా నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రజలు నమ్ముతున్నారని చెప్పిన కుష్బూ.. విజయ్ కోసం ఎంతమంది ప్రజలు వస్తారో ప్రభుత్వానికి తెలిసినా ర్యాలీకి సరైన స్థలం కేటాయించలేదని, ఇది సృష్టించిన విపత్తులా కనిపిస్తోందని అన్నారు.

మరోవైపు ఈ దుర్ఘటనపై విచారణకు ఎన్డీయే ఎంపీల బృందాన్ని కరూర్‌ పంపింది. ఈ క్రమంలో... విచారణ చేపట్టిన ఈ బృందం దుర్ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించింది. ఈ సందర్భంగా స్పందించిన బీజేపీ సీనియర్ నేత హెచ్ రాజా... విజయ్ తో అభిప్రాయభేదాలు ఉన్నా కరూర్‌ దుర్ఘటన వ్యవహారంలో అండగా ఉంటానని తెలిపారు.

దీంతో... వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ దృష్ట్యా విజయ్‌ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ కాస్త ముందుచూపుతో వ్యవహరిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మద్దతు విజయ్ కి భారీ ఉపశమనం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

మణిపూర్ - కరూర్... డీఎంకే కౌంటర్!:

ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్పందించారు. రామనాథపురంలో మాట్లాడిన ఆయన... మణిపూర్ అల్లర్ల సమయంలో వెంటనే అక్కడికి వెళ్లని బీజేపీ నేతలు... కరూర్ ప్రమాదంపై మాత్రం వెంటనే దర్యాప్తు బృందాన్ని ఎందుకు పంపిందని ప్రశ్నించారు. అయితే... మణిపూర్ వేరు, కరూర్ వేరు.. రెండింటినీ పోల్చడం పూర్తి అర్ధంలేనిదని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు.