Begin typing your search above and press return to search.

డొనాల్డ్ ట్రంప్ సైన్యంలో అత్యంత నమ్మకమైన, చురుకైన సైనికురాలు ఔట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యంలో అత్యంత నమ్మకమైన, చురుకైన సైనికురాలు మైక్ పక్కన పెట్టి సైడ్ అయిపోయారు.

By:  A.N.Kumar   |   13 Aug 2026 8:02 PM IST
డొనాల్డ్ ట్రంప్ సైన్యంలో అత్యంత నమ్మకమైన, చురుకైన సైనికురాలు ఔట్
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైన్యంలో అత్యంత నమ్మకమైన, చురుకైన సైనికురాలు మైక్ పక్కన పెట్టి సైడ్ అయిపోయారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్న 28 ఏళ్ల కరోలిన్ లీవిట్ తన పదవికి గుడ్ బై చెప్పారు. ఈ నెల చివరి నాటికి ఆమె తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి బాధ్యతలను స్వీకరించిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కిన లీవిట్ ఇప్పుడు "చాలు బాబోయ్ ఈ ప్రెస్ మీట్లు" అంటూ వైట్ హౌస్ గేటు దాటుతున్నారు.

వైట్‌హౌస్ మైక్ ముందుకు వచ్చి ట్రంప్ నిర్ణయాలను సమర్థించడం, విలేకరులు అడిగే కఠిన ప్రశ్నలకు కౌంటర్లు ఇవ్వడం అంటే సాదాసీదా విషయం కాదు. ప్రపంచంలోనే అత్యంత శ్రమతో కూడుకున్న, కత్తి మీద సాము లాంటి ఉద్యోగం ఇది. దాదాపు 18 నెలలుగా ట్రంప్ భజనను నాన్‌స్టాప్‌గా మోసిన లీవిట్.. ఇప్పుడు తన ఇద్దరు చిన్న పిల్లలతో ప్రశాంతంగా సమయం గడపడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

ఈ ఏడాది మే నెలలోనే లీవిట్ రెండో సంతానంగా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. డెలివరీ సెలవుల తర్వాత మళ్లీ విధుల్లో చేరినప్పటికీ ఒకవైపు వైట్‌హౌస్ ఒత్తిడి.. మరోవైపు ఇద్దరు పసిపాపల పెంపకం రెండూ మెయింటెన్ చేయడం ఆమెకు అసాధ్యంగా మారింది. అందుకే "నా వల్ల కాదయ్యా!" అంటూ ఎక్స్ వేదికగా తన రాజీనామాను అధికారికంగా ప్రకటించారు. "ఒక తల్లిగా పిల్లలకు న్యాయం చేస్తూ ప్రెస్ సెక్రెటరీగా రోజూ విలేకరుల దాడిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే నా కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తున్నా" అని ఆమె చెప్పుకొచ్చారు. వెస్ట్ వింగ్‌లో గడపడం.. ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్‌తో గంటల తరబడి ముచ్చటించడం.. ప్రపంచ నాయకులను కలవడం తన జీవితంలో మర్చిపోలేని అనుభవాలని లీవిట్ మురిసిపోయారు.

అయితే ట్రంప్ మాత్రం తన నమ్మకస్తురాలిని అంత సులభంగా వదిలేలా లేరు.. ప్రెస్ సెక్రెటరీ పదవి పోయినా.. సలహాదారుగా తన వద్దే కొనసాగాలని ఆయన కోరడంతో లీవిట్ ఓకే చెప్పారు. మొత్తానికి వైట్‌హౌస్ లో రోజూ జరిగే రచ్చ, విలేకరుల ప్రశ్నల సునామీ నుంచి లీవిట్ కి ఉపశమనం లభించినట్లే. కానీ ఇకపై ట్రంప్ మార్క్ నిర్ణయాలను సమర్థించే ఆ కొత్త ‘బలిపశువు’ ఎవరో చూడాలి!