స్కూల్ వాష్ రూమ్ లోనే బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి విద్యార్థిని.. వారిపై కేస్ ఫైల్!
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని తన స్కూల్ వాష్ రూమ్ లో మగ బిడ్డకు జన్మనిచ్చింది..
By: Madhu Reddy | 29 Aug 2025 10:01 AM ISTకర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థిని తన స్కూల్ వాష్ రూమ్ లో మగ బిడ్డకు జన్మనిచ్చింది.. ప్రస్తుతం బాలిక , శిశువు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. వారిని సాహాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
అధికారుల స్పందన..
ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ.. పాఠశాల ప్రిన్సిపల్, వార్డెన్, స్టాఫ్ నర్స్ తో పాటు సదరు బాధిత బాలిక సోదరుడిపై కూడా సుమోటో కేసు ఫైల్ చేసినట్లు సమాచారం. ఇక ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆలస్యంగా వెలుగులోకి..
ఇకపోతే ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు శశిధర్ కోసాంబే మాట్లాడుతూ అధికారులు సమయానికి సమాచారం ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే పాఠశాల సిబ్బంది ఏం చేస్తోందని, వెంటనే దీనిపై నివేదిక పంపాలని ఫైర్ అవుతూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇలాంటి విషయాలను కమిషన్ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తూ.. దీనిపై ప్రిన్సిపాల్, సిబ్బందిపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
స్పందించిన ప్రిన్సిపాల్..
ఈ ఘటనపై ఆ స్కూల్ ప్రిన్సిపాల్ బసమ్మ మాట్లాడుతూ.." నేను నెల రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించాను. ఆ విద్యార్థిని బర్త్ సర్టిఫికెట్ ప్రకారం ఆమె వయసు 17 సంవత్సరాల 8 నెలలు . అసలు ఆమె గర్భం దాల్చిందని, ఆ లక్షణాలు కూడా ఆమెలో మాకు కనిపించలేదు. జూన్లో స్కూల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ఎక్కువగా హాజరు కాలేదు. ఆగస్టు ఐదు నుంచి మాత్రమే రెగ్యులర్గా రావడం ప్రారంభించింది. తలనొప్పి, అనారోగ్య కారణాలతో తరచూ గైర్హాజరయ్యేది. ఇప్పుడు ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది అనే విషయం మాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ విషయాన్ని మేము బాలిక తల్లిదండ్రులతో మాట్లాడాలని ప్రయత్నించగా వారు నిరాకరించారు " అంటూ ప్రిన్సిపాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
