Begin typing your search above and press return to search.

వందేమాతరం గీతం..డీకేకి గవర్నర్ ఘాటు లేఖ !

వందేమాతరం గీతం ఇపుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుపుతున్న పాలకులకు రాజ్యాంగ పాలకులకు మధ్య వివాదంగా మారుతోంది.

By:  Satya P   |   23 Sept 2026 8:50 AM IST
వందేమాతరం గీతం..డీకేకి గవర్నర్ ఘాటు లేఖ !
X

వందేమాతరం గీతం ఇపుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుపుతున్న పాలకులకు రాజ్యాంగ పాలకులకు మధ్య వివాదంగా మారుతోంది. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీలో కీలక తీర్మానం చేసింది. దాని ప్రకారం 1937 నాటి కాంగ్రెస్ విధానానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. కేవలం రెండు చరణాలే ఆలపిస్తామని పేర్కొంది. అయితే దీని మీద ఎన్డీయే ఫైర్ అయింది. పార్లమెంట్ లో వందేమాతరం గీతాన్ని జాతీయ గౌరవ పరిరక్షణ చట్టం-2026 సవరణ ప్రకారం ఆరు గీతాలుగా పొడిగిస్తూ ఆమోదించాక మళ్ళీ ఈ ప్రైవేట్ తీర్మానాలు ఏమిటి అని కూడా బీజేపీ నేతలు మండిపడ్డారు. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మాత్రం రెండు చరణాలకే వందేమాతరం గీతాన్ని కుదించాలని తీసుకుంటున్న నిర్ణయాలు రాజ్ భవన్ తో ముఖ్యమంత్రులకు కొత్త పేచీలు తీసుకొస్తున్నాయి.

ఇంతకీ వివాదమెక్కడంటే :

తాజాగా కర్ణాటక ప్రభుత్వం వందేమాతరం రెండు చరణాలు ఆలపించాలని ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఈ నెల 8న కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం దీని మీద ఒక ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం చూస్తే రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ప్రధాని లేదా గవర్నర్ హాజరయ్యే కార్యక్రమాలు మినహా మిగిలిన ఏ ఇతర ప్రభుత్వ కార్యక్రమాలలో వందేమాతరం గీతం లోని మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలని అందులో పేర్కొంది. అంటే ప్రధాని వంటి వారి కార్యక్రమాలలో ఆరు చరణాలు ఆలపిస్తారు అన్న మాట. దీని మీద రాజ్ భవన్ ఇపుడు దృష్టి పెట్టింది. వందేమాతరం గీతాన్ని కుదించడం పట్ల కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అయితే తీవ్ర అభ్యనతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన డీకే శివ కుమార్ క ప్రభుత్వానికి ఘాటు లేఖ రాశారు.

రాజ్యాంగ విరుద్ధం అంటూ :

వందేమాతరం ఆరు చరణాలు పూర్తిగా ఆలపించాలని పార్లమెంట్ ఆమోదించిన తరువాత మళ్లీ ఈ కుదింపు ఏమిటని ఆ లేఖలో థావర్‌చంద్ గెహ్లాట్ ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం కొత్తగా ఉత్తర్వులు జారీ చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని ఆయన ఎత్తి చూపించారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలలో తప్పనిసరిగా ఆరు చరణాలూ ఆలపించి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. ఒక వేళ అలా కాదు అని అనుకుంటే కనుక అది రాజ్యాంగ పరమైన వివాదాలకు దారి తీస్తుందని పేర్కొన్నారు. జాతీయ గౌరవ పరిరక్షణ చట్టం-2026 సవరణ ప్రకారం జాతీయ గీతానికి కూడా చట్టబద్ధమైన రక్షణ ఉందని డీకే ప్రభుత్వానికి గవర్నర్ గుర్తుచేశారు.

కేంద్రానికే అధికారం :

అంతే కాదు డీకే శివకుమార్ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు భిన్నంగా ఉన్నాయని అంతే కాకుండా జాతీయ గౌరవ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని గవర్నర్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఇక దేశంలో జాతీయ చిహ్నాలపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. కేంద్ర పరిధిలోని అంశాల విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని చట్టాలు శాసనాలు చేయడానికి వీలు లేదని అన్నారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 162, 256, 257(1)ను ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ఈ ఉత్తర్వుల విషయంలో పున పరిశీలించాలని డీకేని కోరారు. అలాగే కొనసాగించాలని అనుకుంటే మాత్రం అది చివరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనవసర వివాదాలకు దారి తీస్తుందని అంతే కాదు రాజ్యాంగ పరమైన చిక్కులు ఏర్పడతాయని హెచ్చరించారు. డీకే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించడమే ఉత్తమ మార్గం అని కూడా పేర్కొన్నారు.