Begin typing your search above and press return to search.

గాళ్ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేసి.. బాంబుతో చంపబోయి చచ్చిపోయాడు

అదే సమయంలో రమ్యతో గొడవకు దిగిన నాగేంద్ర.. ఒక్కసారిగా కత్తి బయటకు తీసి.. ఆమె తలపైనా.. చేతుల మీదా దాడి చేయటం మొదలు పెట్టాడు.

By:  Garuda Media   |   28 Jun 2026 2:35 PM IST
గాళ్ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేసి.. బాంబుతో చంపబోయి చచ్చిపోయాడు
X

అనూహ్య రీతిలో చోటు చేసుకునే షాకింగ్ క్రైం ఉదంతాలు ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రంలో వరుస పెట్టి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. సినిమాటిక్ గా ఉండే ఈ ఉదంతంలో బాధితురాలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా.. కిడ్నాప్ చేసిన యువతిని సమయస్ఫూర్తితో కాపాడాడు. తాను గాయాలపాలైనప్పటికి.. బాధిత మహిళకు ఎలాంటి కష్టం రాకుండా ఉండే క్రమంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. పెళ్లికి నో చెప్పిన ప్రేయసిని దారుణంగా ప్లాన్ చేసి.. ప్రియుడు తన దుర్మార్గపు ఆలోచనలకు తానే దెబ్బడిపోయిన వైనం చూస్తే.. చెడపకురా.. చెడేవు అన్న పాతకాలం సామెత గుర్తుకు రాక మానదు. సంచలనంగా మారిన ఈ దారుణ ఉదంతంలోకి వెళితే..

నిందితుడు నాగేంద్ర, బాధితురాలు రమ్య ఇద్దరూ ఉత్తర కర్ణాటకలోని అంకోలా ప్రాంతానికి చెందిన వారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితమే వీరి మధ్య పరియముంది. అది కాస్తా ప్రేమగా మారింది. కెరీర్ లో ఏదైనా సాధించేందుకు వీరిద్దరు తమ ఊరిని వదిలి బెంగళూరుకు చేరుకున్నారు. నాగేంద్ర డెలివరీ బాయ్ గా పని చేస్తుంటే.. రమ్య మాత్రం బెంగళూరులోని ప్రభుత్వ ఆసుపత్రి (సంజయ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రామ అండ్ ఆర్థోపెడిక్స్)లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తోంది.

ఇదిలా ఉండగా.. నాగేంద్ర.. రమ్యల మధ్య అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. గడిచిన ఆర్నెల్లుగా నాగేంద్ర తీరు రమ్యకు అస్సలు నచ్చట్లేదు. వీరి మధ్య వ్యత్యాసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అతడి అలవాట్లతో నాగేంద్రను ఆమె దూరం పెట్టింది. పెళ్లికి నో చెప్పింది. దీంతో.. రమ్య హాస్టల్లో ఉన్న వేళలో.. మాట్లాడేందుకు అని చెప్పిన వచ్చిన నాగేంద్ర ఆమెను ఊబర్ క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కించాడు. వారు కారు తమకూరు వైపు ప్రయాణిస్తోంది. మొదట్లో అంతా బాగానే ఉన్నా.. కాసేపటికి ఉబెర్ డ్రైవర్ కు పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది.

అతడి కారులో ఉన్న అమ్మాయిని సదరు వ్యక్తి కిడ్నాప్ చేశాడని. . అతడి నుంచి ఆమెను రక్షించేందుకు వీలుగా కారును వెంటనే సమీప పోలీసు స్టేషన్ వద్దకు తీసుకెళ్లాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. దీంతో మొత్తం పరిస్థితి సదరు డ్రైవర్ కు అర్థమైంది. అదే సమయంలో కారు డ్రైవర్ కు.. పోలీసులకు మధ్య జరిగిన సంభాషణను విన్ననాగేంద్ర.. ఆమెపై దాడికి ప్రయత్నించాడు. కత్తితో గాయపరిచే ప్రయత్నం చేశాడు. ముంచుకొస్తున్న ముప్పును గుర్తించిన కారు డ్రైవర్ కారును రోడ్డుకు ఒక పక్కన ఆపేశాడు.

అదే సమయంలో రమ్యతో గొడవకు దిగిన నాగేంద్ర.. ఒక్కసారిగా కత్తి బయటకు తీసి.. ఆమె తలపైనా.. చేతుల మీదా దాడి చేయటం మొదలు పెట్టాడు. వెనుక సీట్లో జరుగుతున్న దారుణాన్ని చూసిన కారు డ్రైవర్ భయపడకుండా.. కారును ఆపాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న రమ్య.. కారు డోర్ తెరిచి బయటకు దూకే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో కారు డ్రైవర్ ఆమెకు సాయం చేసి.. నాగేంద్ర చేతిలోని కత్తిని బలవంతంగా లాక్కొని దూరంగా విసిరేశాడు. ఇదే సమయంలో నాగేంద్రలోని ఉన్మాది బయటకు వచ్చాడు.

తన బ్యాగ్ లోని నాటు బాంబును బయటకు తీసిన నాగేంద్ర తన వద్ద ఉన్న లైటర్ తో వెలిగించే ప్రయత్నం చేయగా.. కారు డ్రైవర్ బలంతంగా దాన్ని చేత్తో లాక్కొని బయటకు విసిరేశాడు. అదే సమయంలో రమ్య సదరు డ్రైవర్ ను హెచ్చరిస్తూ.. అన్నా.. అతడి వద్ద బాంబులు ఉన్నాయని చెప్పటంతో.. వెంటనే కారు డ్రైవర్ కారు నుంచి దూరంగా పరిగెత్తాడు. రమ్య సైతం అతడ్ని అనుసరించింది. కారుకు దూరంగా వెళ్లినంతనే.. రోడ్డు మీద వెళుతున్న బైకిస్టును ఆపిన కారు డ్రైవర్.. ఆమెను రక్షించాలని కోరి.. బండి మీద దూరంగా పంపేశాడు.

వారు కారు దిగి కాస్త దూరం పరిగెత్తిన సమయంలోనే.. నాగేంద్ర కారు తలుపుల్ని మూసేసి.. తన వద్ద ఉన్న బాంబులతో తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ శక్తివంతమైన పేలుడుతో సమీపంలో ఉన్న కారు డ్రైవర్ గాయాలయ్యాయి. రమ్య సురక్షితంగా ఈ ఘోర దురాగతం నుంచి త్రుటిలో తప్పించుకుంది.ఒకవేళ.. పోలీసుల హెచ్చరికను ఫాలో కాకుండా కారును ఆపకుండా ఉంటే.. రమ్య.. కారు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయేవారని పోలీసులు చెబుతున్నారు. ఈ షాకింగ్ ఉదంతం కర్ణాటక వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న నాగేంద్ర కుటుంబ సభ్యులు షాక్ కు గురవుతున్నారు. మొత్తంగా ఈ ఉదంతంలో కారు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి.. బాధితురాలిని రక్షించిన వైనం అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.