ఒకటో తరగతి పిల్లాడికి గుండెపోటు.. అయ్యో అనిపించే విషాదం
కర్ణాటకలోని గుండ్లపేట తాలుకా బన్నితాళ పురంలోని ఒక స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదివే ఆర్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
By: Garuda Media | 20 Aug 2025 10:06 AM ISTఅయ్యో అనిపించే విషాదంగా దీన్ని చెప్పొచ్చు. ఒకటో తరగతి చదివే విద్యార్థి ఒకరు స్కూల్లో కూప్పకూలిపోవటం.. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళితే గుండెపోటుకు గురైన వైనం వెలుగు చూడటమే కాదు.. చికిత్స వేళలోనే కన్నుమూసిన విషాద ఉదంతంగా దీన్ని చెప్పాలి. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ షాకింగ్ ఉదంతం గురించి తెలిసిన వారు ముక్కున వేలేసుకునే పరిస్థితి. సాధారణంగా గుండె జబ్బులు ఒక వయసు వచ్చే వరకు రావన్న భావన ఉంటుంది.. కానీ.. తాజా ఉదంతం మాత్రం అందుకు భిన్నమన్న విషయాన్ని స్పష్టం చేసింది.
కర్ణాటకలోని గుండ్లపేట తాలుకా బన్నితాళ పురంలోని ఒక స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదివే ఆర్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడ్ని తీసుకొని ఆసుపత్రికి వెళ్లారు. ఫస్ట్ ఎయిడ్ అనంతరం.. అతడి పరిస్థితి మరింత విషమంగా మారటంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. చామరాజనగర జిల్లాలోని ఈ పెద్దాసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు ఆర్య గుండెపోటుకు గురైన విషయాన్ని గుర్తించారు. అందుకు తగిన చికిత్సను మొదలు పెట్టారు.
అయితే.. చికిత్స మధ్యలోనే ఆర్య తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. చిన్నారి గుండెపోటుకు గురైన వైనం అతడి తల్లిదండ్రుల్ని శోకసంద్రంలోకి మునిగిపోయేలా చేసింది. పుట్టుకతోనే ఆర్యకు గుండెకు సంబంధించిన సమస్య ఉందన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. అప్పటివరకు చలాకీగా ఆడుతూపాడుతూ ఉండే తమ బిడ్డ.. ఇంత పెద్ద ఆరోగ్య సమస్యతో ఉన్న విషయాన్ని తాము గుర్తించలేదని ఆర్య తల్లిదండ్రులు వేదన చెందుతున్నారు. చిన్న వయసులోనే పెద్ద ఆరోగ్య సమస్యకు గురి కావటం.. ప్రాణాలు కోల్పోయిన వైనం పలువురిని కదిలిస్తోంది.
