స్కూల్ అటెండెన్స్‌లో ‘జై శ్రీరామ్’నా?.. కర్ణాటక బీజేపీ నేత గాలి వ్యాఖ్యలు వైరల్
కర్ణాటక రాజకీయాల్లో మరోసారి మతం, విద్య, సంస్కృతి చుట్టూ ఒక పెద్ద చర్చకు తెరలేచింది.
By: A.N.Kumar | 23 May 2026 12:01 PM ISTకర్ణాటక రాజకీయాల్లో మరోసారి మతం, విద్య, సంస్కృతి చుట్టూ ఒక పెద్ద చర్చకు తెరలేచింది. పాఠశాలల్లో ఉదయం అటెండెన్స్ తీసుకునే సమయంలో విద్యార్థులు సాధారణంగా చెప్పే “ఎస్ సార్” లేదా “ప్రెజెంట్ మేడం” అనే పదాలకు బదులుగా “జై శ్రీరామ్” అనాలంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. మాజీ బీజేపీ నేత బసనగౌడ పాటిల్ యత్నాల్ చేసిన ప్రతిపాదనకు మద్దతుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమాజం రెండు వర్గాలుగా చీలిపోయింది. అయితే ఇది కేవలం ఒక నినాదానికి సంబంధించిన వివాదం మాత్రమే కాదు..భారతదేశంలో విద్యాసంస్థల స్వరూపం, లౌకికవాదం, మతపరమైన గుర్తింపులు.. రాజకీయ ప్రయోజనాల మధ్య జరుగుతున్న ఒక నిరంతర సంఘర్షణకు ఇది తాజా ఉదాహరణగా నిలుస్తోంది.
“జై శ్రీరామ్”.. భక్తి నినాదమా? రాజకీయ గుర్తింపా?
“జై శ్రీరామ్” అనేది కోట్లాది మంది హిందువుల అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక నినాదం. అయితే గత కొన్ని దశాబ్దాలుగా ముఖ్యంగా అయోధ్య ఉద్యమం తర్వాత ఈ నినాదం రాజకీయ వేదికలపై కూడా అత్యంత బలంగా వినిపిస్తూ ఒక రాజకీయ గుర్తింపుగా రూపాంతరం చెందింది.
ఇప్పుడు అదే నినాదాన్ని పాఠశాలల్లో అదీ రోజువారీ హాజరు ప్రక్రియలో భాగం చేయాలనే ప్రతిపాదన రావడం వల్లే ఇది సాధారణ చర్చ స్థాయిని దాటి పెద్ద వివాదంగా మారింది. విద్యాసంస్థలు మతపరమైన ప్రభావాలకు దూరంగా ఉండాలని కోరుకునే వర్గాలకు, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని ఆకాంక్షించే వర్గాలకు మధ్య ఇది ఒక సిద్ధాంత పోరాటంగా మారింది.
హిజాబ్ నిర్ణయం తర్వాతే ఈ వ్యాఖ్యలు ఎందుకు?
ఈ తాజా వివాదం వెనుక కర్ణాటకలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌తో పాటు తలపాగా, జేన్యూ, రుద్రాక్ష వంటి మతపరమైన గుర్తింపులకు/విశ్వాస సూచికలకు పరిమిత అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంపై బీజేపీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు రావడం గమనార్హం.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. "ఇది కేవలం ‘ఎస్ సార్’ వర్సెస్ ‘జై శ్రీరామ్’ చర్చ కాదు. ‘విద్యాసంస్థల్లో హిజాబ్‌కు అనుమతి ఇస్తే హిందూ గుర్తింపుకూ సమాన స్థానం ఉండాలి’ అనే ప్రతిస్పందన నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ వ్యూహం." ఈ సున్నితమైన అంశంపై సామాజిక, రాజకీయ వేదికల్లో వినిపిస్తున్న భిన్నమైన వాదనలు మరింతగా అగ్గిరాజేస్తున్నాయి. పాఠశాలలు అన్ని మతాల పిల్లలు కలిసి చదివే పవిత్రమైన ప్రదేశాలు. అక్కడ ఏ ఒక్క మత గుర్తింపును రుద్దకూడదు. చిన్న వయసులోనే పిల్లల్లో మతపరమైన విభేదాలు, అసౌకర్యాలు తలెత్తే ప్రమాదం ఉంది. రేపు ప్రతి మతం తమ స్వంత మతపరమైన నినాదాన్ని హాజరు పట్టికలో చేర్చాలని డిమాండ్ చేస్తే విద్యా వ్యవస్థ కుప్పకూలుతుంది.
రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఇలాంటి భావోద్వేగ అంశాలు కేవలం మాటలకే పరిమితం కావు. కర్ణాటక రాజకీయాల్లో హిందుత్వ ఎజెండాను మళ్లీ బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడమే తమ లౌకిక విధానమని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. ఎన్నికల లబ్ధి కోసం విద్యార్థులను, విద్యావ్యవస్థను రాజకీయ క్షేత్రంలోకి లాగుతున్నారనే విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.
భారతదేశం లాంటి బహుళ మత, భాషా, వైవిధ్యభరిత సంస్కృతులు ఉన్న దేశంలో విద్యాసంస్థలు పూర్తిగా లౌకికంగా, తటస్థంగా ఉండాలా? లేక స్థానిక సంస్కృతి, మతపరమైన భావజాలాలకు కూడా అక్కడ అధికారిక స్థానం కల్పించాలా? ఒక చిన్న హాజరు పదం చుట్టూ మొదలైన ఈ చర్చ.. ఇప్పుడు దేశ భవిష్యత్తు, విద్యా విధానం లౌకిక స్ఫూర్తిని శాసించే ఒక పెద్ద ఐడియాలజీ డిబేట్‌గా రూపాంతరం చెందింది. దీనిపై సమగ్రమైన, ఏకాభిప్రాయంతో కూడిన నిర్ణయం రానంత వరకు ఇలాంటి వివాదాలు మున్ముందు కూడా వస్తూనే ఉంటాయనడంలో సందేహం లేదు.
