Begin typing your search above and press return to search.

ప్రజల గడప వద్దకే పాలన.. కర్ణాటకలో డీకే వినూత్న ప్రయోగం!

ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాయి. ప్రజల వద్దకు పాలన అంటూ కొత్త సంస్కరణలు తీసుకువస్తూ తమదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి.

By:  Tupaki Political Desk   |   21 Jun 2026 9:24 AM IST
ప్రజల గడప వద్దకే పాలన.. కర్ణాటకలో డీకే వినూత్న ప్రయోగం!
X

ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాయి. ప్రజల వద్దకు పాలన అంటూ కొత్త సంస్కరణలు తీసుకువస్తూ తమదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అంతేకాకుండా తమది ప్రజా పాలన అని చెప్పుకోడానికి ప్రభుత్వాధినేతలు ప్రాధాన్యం ఇస్తుంటారు. కర్ణాటక కొత్త సీఎం డీకే శివకుమార్ కూడా ఇదే విధమైన ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు. అయితే ఆయన ఇతర నాయకులకు భిన్నంగా నడుచుకుంటున్నారు. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఇందుకోసం కేబినెట్ లో తీర్మానం చేయడం విశేషంగా చెబుతున్నారు.

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ప్రశంసలు అందుకుంటోంది. ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరించే లక్ష్యంతో 'ప్రజా సేవ' అనే సరికొత్త మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. పాలనలో పారదర్శకతను పెంచుతూనే, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ఈ శాఖను ఒక వారధిగా వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ప్రజలు ఏదైనా ఫిర్యాదు చేయాలంటే దరఖాస్తులు ఇవ్వడం, ఆఫీసుల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు పడుతుంటారు. ఈ నూతన విభాగం ద్వారా ఇకపై ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీ డిజిటల్ పద్ధతిలో నమోదు కానుందని చెబుతున్నారు.

మంత్రులకు, అధికారులకు వచ్చే ఫిర్యాదులన్నీ ఈ విభాగం ద్వారానే నమోదవుతాయని అంటున్నారు. ప్రతి దరఖాస్తుకు ఒక గడువు ఉంటుందని, ఆ గడువులోపు పరిష్కారం చూపకపోతే ఎందుకు జరగలేదో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ఈ శాఖ పని చేస్తుంది, దీనివల్ల నిర్ణయాల అమలులో జాప్యం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

డీకే వ్యూహానికి ఇదో నిదర్శనం

డీకే శివకుమార్ అంటేనే దూకుడైన రాజకీయ వ్యూహాలకు మారుపేరుగా చెబుతారు. ఈ నిర్ణయం వెనుక ఆయన రాజకీయ పరిణితి స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం పాలన కోసమే కాకుండా, రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావడానికి ఇది ఒక సాధనంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో మంత్రులు విధిగా పర్యటించాలని, వారానికి ఒకసారి 'జనస్పందన' కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం ద్వారా, ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఫిర్యాదుల పరిష్కారంలో డిజిటలైజేషన్ చేయడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేసినట్లే అంటున్నారు. దీనిద్వారా ప్రజా వ్యతిరేకతను తగ్గించేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోడానికి వీలు చిక్కిందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తే, ప్రభుత్వానికి వచ్చే వ్యతిరేకత తగ్గుతుందనేది ముఖ్యమంత్రి డేకే వ్యూహంగా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వాలు కొత్త శాఖలను ఏర్పాటు చేయడం కొత్తేమీ కాదని, ఆ శాఖ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నదే అసలైన సవాలుగా చెబుతున్నారు. కాగా, అధికారుల వ్యవస్థలో మార్పు రాకుండా, కేవలం శాఖలు పెంచితే ప్రయోజనం ఉంటుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు ముఖ్యమంత్రి డీకే ప్రవేశపెట్టిన ఈ 'ప్రజా సేవ' శాఖకు ఎంత మేరకు ఆర్థిక, పరిపాలనా పరమైన అధికారాలు ఉంటాయి అన్నది కీలకంగా చెబుతున్నారు. నిధులు, అధికారాలు ఉంటేనే ఏ ప్రభుత్వ శాఖ అయినా సమర్థంగా పనిచేస్తుందని అంటున్నారు. మొత్తానికి, ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీసుకున్న ఈ నిర్ణయం కర్ణాటక పరిపాలనలో మార్పులు తెస్తుందా? లేక ఇది కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతుందా? అనేది వేచి చూడాల్సివుందని అంటున్నారు.