Begin typing your search above and press return to search.

కర్ణాటకలో టిఫిన్ పాలిటిక్స్ ట్విస్ట్ లు...

మనకు విందు రాజకీయాలు కొత్తేం కాదు. ప్రధాన నేతల మధ్య సమస్యలు బూడిదమూసిన నిప్పులా మారినపుడు ఇలాంటి విందులు మహా పసందుగా ఉంటాయి.

By:  Tupaki Political Desk   |   2 Dec 2025 10:53 AM IST
కర్ణాటకలో  టిఫిన్ పాలిటిక్స్ ట్విస్ట్ లు...
X

మనకు విందు రాజకీయాలు కొత్తేం కాదు. ప్రధాన నేతల మధ్య సమస్యలు బూడిదమూసిన నిప్పులా మారినపుడు ఇలాంటి విందులు మహా పసందుగా ఉంటాయి. ఈ భేటీల్లో సమస్యల్ని పరిష్కరించుకోవడం కన్నా...మా మధ్య అంతా బాగానే ఉంది అనే సందేశం పార్టీకి, ప్రజలకు ఇచ్చేందుకే నేతలు ఇష్టపడుతుంటారు. తాజాగా కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం చిచ్చులా మారుతున్న నేపథ్యంలో బ్రేక్ ఫాస్ట్ భేటీలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను సాదరంగా బ్రేక్ ఫాస్ట్ కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఆ విషయం మీడయాలో సంచలనంగా మారింది. వారు టిఫిన్ లో ఏం తిన్నారు అనేది కూడా చర్చగా నిలిచింది. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న న్యూటన్ మూడో గమన సూత్రాన్ని డీకే బాగా నమ్మినట్టున్నారు. అందుకే వారు కూడా సిద్ధరామయ్యను మంగళవారం బ్రేక్ ఫాస్ట్ కు పిలిచారు.

ఈ విందు మరింత పసందుగా ఉండేలా డీకే సిద్దరామయ్యకు బాగా ఇష్టమైన నాన్ వెజ్ వండిస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం సదాశివనగర్ లోని డీకే నివాసంలో జరగబోయే ఈ విందు సమావేశం మరింత ఉత్కంఠ రేపుతోంది. మొన్న సీఎం సిద్దరామయ్య ఇచ్చిన టిఫిన్ పార్టీ బాగా వర్కవుట్ అయినట్టుందని నమ్మిన అధిష్టానం ఈసారి డీకే వంతుగా విందు ఇవ్వాలని సూచించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈనెల 8నుంచి బెళగావిలోని సువర్ణసౌధలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రతిపక్షాలకు ఈ పవర్ షేరింగ్ విమర్శనాస్త్రంగా మారరాదనే విందు రాజకీయాలకు ఇద్దరు నేతలు తెరలేపినట్లు తెలుస్తోంది.

ఉపముఖ్యమంత్రి డీకేశివకుమార్...ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాక, సీఎం సీటు తనకు దక్కాల్సిందే అని పట్టుబట్టినా...సిద్ధరామయ్య వ్యూహాత్మకంగా పావులు కదిపి తను ఆ సీటులో కూర్చోగలిగారు. అయితే అప్పట్లో ఇదో వివాదంగా మారింది. అసలు సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించడంలో అంతర్గత ఆలోచన చాలానే ఉందన్నది అప్పటి ప్రచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెనువెంటనే ఎంపీ ఎన్నికలు ముంచుకు రావడంతో...తనను సీఎం చేస్తే అధిక సంఖ్యలో ఎంపీలను తీసుకు వస్తానని సిద్ధరామయ్య అధిష్టానంతో అన్నారని, అందుకే అధిష్టానం కూడా సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపిందని వార్తలు గుప్పుమన్నాయి.

ఈ నేపథ్యంలో దసరా సంరంభం ముగిసిన వెంటనే పవర్ షేరింగ్ వివాదం తెరపైకి వచ్చింది. అక్టోబర్ తో రెండున్నరేళ్ళ పాలన కాలం ముగిసిపోవడంతో ఇక డీకే సీఎం అవుతారని అతని అనుచరులు ప్రచారం ప్రారంభించారు. అయితే అదేం కాదు అయిదేళ్ళపాటు నేనే సీఎం అని సిద్ధరామయ్య అంటే ఆయన చెప్పిందే ఫైనల్ అని డీకే స్పందించారు. మరోవైపు బీజేపీ బిహార్ ఎన్నికలు ముగిసిన వెంటేనే పవర్ షేరింగ్ పక్కా అని కాంగ్రెస్సే ప్రచారం ప్రారంభించిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి డీకే మొదట బీజేపీ తమ ఆంతరంగిక సమస్యల్ని చక్కదిద్దుకుంటే మంచిదని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

ఎన్ని వివాదాలు రాజుకున్నా...కాంగ్రెస్ లో ఢిల్లీ అధిష్టానందే చివరి మాట అవుతుందన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఈ పవర్ షేరింగ్ తుఫాను ఎంత తీవ్రంగా మారినా అధిష్టానం పరిస్థితి తన కంట్రోల్ లో ఉంచుకునేందుకే కసరత్తులు చేస్తోంది. ఈ సమస్యను ఇద్దరు నేతలు తామే చర్చించుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలని అధిష్టానం తెలిపినా...మరోవైపు తన వంతు వ్యూహాలు రచిస్తోంది. రాహుల్ గాంధీ ఇద్దరు నేతల్ని ఢిల్లీకి పిలిపించి కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి పవర్ షేరింగ్ అవుతుందో లేదో తెలీదు కానీ కర్ణాటకలో విందు రాజకీయాలు మాత్రం చాలా మందికి ఉచితవినోదాన్ని పంచుతున్నాయి.