బీహర్ తొలి దెబ్బ సిద్ధూ మీదనేనా ?
బీహార్ లో రెండో విడత చివరి విడత ఎన్నికలు మంగళవారంతో పూర్తి అయిపోతున్నాయి. ఇక రెండు రోజుల తరువాత కౌంటింగ్ ఉంది.
By: Satya P | 11 Nov 2025 9:34 AM ISTబీహార్ లో రెండో విడత చివరి విడత ఎన్నికలు మంగళవారంతో పూర్తి అయిపోతున్నాయి. ఇక రెండు రోజుల తరువాత కౌంటింగ్ ఉంది. ఈ నెల 14న ఫలితాలు వస్తాయి. బీహార్ లో ఎవరి గెలిచేది జనాలు తీర్పు ఇస్తారు. ఈసారి ఫలితం అయితే మహా ఘట్ బంధన్ కి అనుకూలంగా ఉంటుందని ఇండియా కూటమి నేతలు చాలా నమ్మకంగా ఉన్నారు. ఈసారి ఘట్ బంధన్ గెలిచి బీహార్ కైవశం అయితే మాత్రం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ క్రెడిట్ లో సింహ భాగం అందుకుంటారు అని అంటున్నారు. ఆయన బీహార్ ఎన్నికల కంటే ముందే నిర్వహించిన ఓటర్ చోరీ యాత్రకు బ్రహ్మాండమైన స్పందన లభించింది. ఒక విధంగా జనాల మూడ్ ని ముందే మార్చేసినట్లుగా కూడా చెబుతున్నారు.
గెలిస్తే జరిగేది :
ఇండియా కూటమి కట్టాక వరస పరాజయాలే పలకరించాయి. కేంద్రంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని వేసుకున్న అంచనాలు తప్పాయి. మూడోసారి కూడా మోడీ ప్రధానిగా ప్రమాణం చేసి హ్యాట్రిక్ పీఎం అనిపించుకున్నారు. ఇక హర్యానా మహారాష్ట్రలలో కూడా పెట్టుకున్న ఆశలు నిరాశ అయ్యాయి. అక్కడా ఎన్డీయేదే పై చేయి అయింది. ఢిల్లీలో చూసుకుంటే రెండున్నర దశాబ్దాల తరువాత బీజేపీ గెలిచి జెండా ఎగరేసింది.
బీహార్ బూస్ట్ :
సరే ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నా ఇండియా కూటమి కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలని నిర్ణయించుకుని మరీ బీహార్ బరిలోకి దిగింది. బీహార్ లో కనుక అధికారం దక్కితే మెల్లగా హిందీ బెల్ట్ ని పాకేందుకు ఆస్కారం ఉంటుందని దేశంలో అత్యధికం ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరాదిన మార్పు కచ్చితంగా వస్తుందని అది 2029 ఎన్నికల్లో బాగా దోహదపడుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అంతే కాదు బీహార్ ఇచ్చిన బూస్ట్ తో ఇండియా కూటమి మరింత శక్తివంతంగా మారి ఎన్డీయే మీద ఢీ కొట్టేందుకు ఇంకా కొత్త ఉత్సాహం చూపిస్తుంది అని అంటున్నారు.
రాహుల్ కీ రోల్ :
కాంగ్రెస్ అగ్ర నేతగా ఉన్న రాహుల్ గాంధీ పార్టీలో కీలక నిర్ణయాల విషయంలో ఇంతకాలం ఆచీ తూచీ వ్యవహరిస్తూ వచ్చారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా వాయిదా వేస్తూ వచ్చారు. దానికి కారణం దేశంలో ప్రజల మూడ్ నాడి అందిపుచ్చుకుని తమకు సానుకూలం చేసుకునేందుకే ఈ ప్రయత్నం అని అంటున్నారు. ఇపుడు బీహార్ కనుక ఇండియా కూటమికి దక్కితే కాంగ్రెస్ సంస్థాగతంగా కూడా మరింత బలంగా మారి సంచలన నిర్ణాయలు తీసుకునే చాన్స్ ఉంది అని అంటున్నారు. రాహుల్ సైతం ఎటువటి తడబాటూ తాత్సారం లేకుండా ముఖ్యమైన నిర్ణయాలనే తీసుకుంటారు అని అంటున్నారు.
కర్ణాటక ఫోకస్ :
ఇక లేటెస్ట్ గా చూస్తే కన్నడ కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్యకు కేంద్ర కాంగ్రెస్ పెద్దల అపాయింట్మెంట్ లభించలేదు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నిజానికి చూస్తే కనుక కేంద్ర కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కావాలని సిద్ధరామయ్య భావించారు, కానీ ఆ సమావేశం అవసరం లేదని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని అంటున్నారు. దాంతో కర్ణాటక సీఎం పీఠం కదులుతోందని వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి.
మాట ప్రకారం :
ఇక చూస్తే రెండున్నరేళ్ళ తర్వాత సిద్ధరామయ్య దిగిపోయి డీకే శివకుమార్ కి బాధ్యతలు అప్పగిస్తారు అని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తోంది. దాంతో డీకేకి కన్నడ పగ్గాలు అప్పగించడానికి కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారా అందుకే సిద్ధరామయ్యకు అపాయింట్మెంట్ ఇవ్వలేదా అన్నది కూడా చర్చ సాగుతోంది. ఇక బీహార్ లో కనుక కాంగ్రెస్ కూటమి గెలిస్తే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కి కూడా మంచి బలం వస్తుందని దాంతో సంస్థాగతంగా కీలక నిర్ణయాలు మరింత దూకుడుగా తీసుకునే చాన్స్ ఉందని అంటున్నారు. అలా చూసుకుంటే బీహార్ తొలి దెబ్బ కన్నడ సిద్ధూకే తగులుతుందా అన్నది ఇపుడు పొలిటికల్ గా హాట్ టాపిక్ గా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
