Begin typing your search above and press return to search.

కన్నడలో బోర్డులేదా...20వేలు ఫైన్

ఈ నేపథ్యంలో బెంగళూరు మహా నగర పాలక మండలి కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రతి వాణిజ్య బోర్డు కనీసం 60శాతం కన్నడలో రాసుండాలి.

By:  Tupaki Political Desk   |   13 Dec 2025 3:45 PM IST
కన్నడలో బోర్డులేదా...20వేలు ఫైన్
X

కర్ణాటకలో వ్యాపారం చేయాలనుకుంటే బోర్డు తప్పనిసరిగా కన్నడలోనే ఉండితీరాలంటూ బెంగళూరు మహానగర పాలక మండలి కఠిన నిబంధనలు జారీ చేసింది. ఎక్కడ...ఎన్నడ...మధ్యలో కన్నడ అంటూ బెంగళూరులో ఇతర భాషీయుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని సగటు కన్నడిగులు వాపోతున్నారు. కర్ణాటక రాజధానిలోనే కన్నడ మాట్లాడకుంటే... బోర్డులు కన్నడలో లేకుంటే...ఇక భాషేం బతికి బట్టకడుతుందని కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

సిలికాన్ నగరంలా వేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు కాస్మోపాలిటిన్ సిటీగా ఇతర రాష్ట్ర వాసులకు ఉపాధి కల్పిస్తోంది. తమిళం,మలయాళం, తెలుగు భాష మాట్లాడేవారి ఆధిపత్యం పెరిగిపోతోందని ...దీనికి అడ్డుకట్ట వేయాల్సిందేనని కన్నడ భాషాభిమానులు నిరంతరం పోరాడుతునే ఉన్నారు. కర్ణాటకలోనే కన్నడ మైనారిటీ భాషగా మారడం నిజంగా దురదృష్టకరమన వారి అభిప్రాయం. కర్ణాటకలో కన్నడ పరిరక్షణ కోసం ఆడలిత భాష కన్నడదల్లే ...అంటే పరిపాలనా భాష కన్నడలోనే అని కఠిన నిబంధన ఎప్పట్నుంచో అమలులో ఉంది. అయితే బెంగళూరు నగరం ఐటీ రంగం విస్తరించాక మహానగరంలా మారిపోయింది. పలు భాషీయులు ఈ నగరంలో ఉంటున్నారు. అయితే వారు కన్నడను ప్రేమించడం లేదు...ఆ భాషను గౌరవించడంలేదు...ఆ భాషలో మాట్లాడ్డం లేదని కన్నడిగుల ప్రధాన ఆరోపణ.

ఈ నేపథ్యంలో బెంగళూరు మహా నగర పాలక మండలి కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రతి వాణిజ్య బోర్డు కనీసం 60శాతం కన్నడలో రాసుండాలి. అలా లేని పక్షంలో రూ.20వేల అపరాధ రుసుము కట్టాల్సిందేనని హుకూం జారీచేసింది. ఈ నిర్ణయం కచ్చితంగా సగటు కన్నడిగులకు ఆనందం కలిగించేదే. వాస్తవానికి బెంగళూరులో అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్ర ప్రజల సంఖ్య హెచ్చు. వీరి ఆధిపత్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బెంగళూరులో బడా బడా వ్యాపారాలు తెలుగువారివే. సినీపరిశ్రమలోనూ తెలుగువారి ప్రభావం హెచ్చు. టీవీ సీరియళ్ళలో నటించే హీరోయిన్లు తెలుగులో అవకాశాలు వస్తే చాలు జంప్ అయిపోతున్నారు. తెలుగు ప్రధాన టీవీ సీరియల్స్ లో కన్నడిగులో హెచ్చు. అలాగే నేషనల్ క్రష్ రష్మికా మందన్న, కాంతార ఫేం రుక్మిణి వసంత ఇపుడు జాతీయస్థాయిలో మెరిసిపోతున్నారు. అయినా కన్నడ భాషాచిత్రాల్లో నటించేందుకు హీరోయిన్ల కొరత వెంటాడునే ఉంది. ఎలా చూసుకున్నా బెంగళూరులో కన్నడ భాషకు నిరాదరణకు గురవుతోందన్న వాదన బలీయంగా వినవస్తోంది.

బెంగళూరులో హోటళ్ళు, ఇతర వ్యాపారాలు చేసేవారు బోర్డుల్ని కన్నడలోనే రాయాలి. అలా చేయకుంటే వారి వాణిజ్య లైసెన్స్ రద్దయ్యే ప్రమాదముందని నగరపాలక మండలి హెచ్చరిస్తోంది. ఈమధ్య ఓ ఆటోవాల ప్యాసింజర్ కన్నడలో మాట్లాడలేదని బూతులు తిట్టిన వీడియో వైరల్ అయ్యింది. కన్నడ బిగ్ బాస్ హౌస్ ను కూడా కన్నడ సంస్కృతికి ప్రతీకగా తీర్చి దద్దారు. ఎందరు ఎన్నివిధాలుగా కన్నడ కోసం పోరాడుతున్నా...ఇతర భాషీయులు బెంగళూరులో ఉంటూ కూడా కన్నడను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో అర్థం కాదు. కనీసం నగరపాలక మండలి జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో అయినా కన్నడ బోర్డులు కనపిస్తాయేమో.

మరి మన తెలుగు రాష్ట్రాల్లో సంగతి ఏంటని అడుగుతారా? ఇక్కడ తెలుగు వినియోగం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. భాషప్రాతిపదికన రాష్ట్రాలు విడిపోయినపుడు ...ఆయా రాష్ట్రాల్లో ఆ భాషకు దక్కాల్సిన గౌరవం సరిగా దక్కట్లేదేమో నని కర్ణాటక, తెలుగు రాష్ట్రాలను చూస్తే అనిపిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బోర్డులు చూడండి ఎక్కడా పూర్తిస్థాయి తెలుగు మనకు కనిపించదు. అడ్మినిస్ట్రేటివ్ భాషగా తెలుగును ఏనాడూ గౌరవించుకోవడం లేదు. తమిళనాడు భాషాభిమానం పరంగా అగ్రస్థాననా నిలుస్తోంది. ఆ తర్వాత కన్నడ...చిట్టచివరి స్థానంలో తెలుగు. తెలుగులో మాట్లాడ్డమే నామోషీ అనుకునే తరం నుంచి తెలుగు పదాలే రాని తరం దాకా తెలుగు క్షీణిస్తోంది. కనీసం తమిళనాడు, కర్ణాటకలో భాషకోసం పోరాడేవారున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ పరిస్థితి అసలు కనిపించదు.