Begin typing your search above and press return to search.

ఈ స్నేహాన్ని రాజకీయం చేయొద్దు బాస్

సరిహద్దు రాష్ట్రాల మధ్య పంచాయితీలు మామూలే. అందుకు భిన్నంగా స్నేహపూర్వక పరిస్థితులు.. అందునా కష్టంలో ఉన్న వేళలో అందటం చాలా తక్కువ.

By:  Garuda Media   |   24 Sept 2026 9:24 AM IST
ఈ స్నేహాన్ని రాజకీయం చేయొద్దు బాస్
X

సరిహద్దు రాష్ట్రాల మధ్య పంచాయితీలు మామూలే. అందుకు భిన్నంగా స్నేహపూర్వక పరిస్థితులు.. అందునా కష్టంలో ఉన్న వేళలో అందటం చాలా తక్కువ. అందుకు భిన్నంగా తెలంగాణ విషయంలో తాజాగా కర్ణాటక ప్రదర్శించిన పెద్ద మనసును రాబోయే రోజుల్లో గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్ నినో కారణంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భంలో.. తెలంగాణ నీటి అవసరాల విషయంలో కర్ణాటక పెద్ద మనసుతో వ్యవహరించిందని చెప్పాలి. ఆ మాటకు వస్తే కర్ణాటకలోనూ ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.

అయినప్పటికి తెలంగాణ పరిస్థితులను అర్థం చేసుకోవటం.. ఆ రాష్ట్రం నుంచి అందిన వినతిని పెద్ద మనసుతో మన్నిస్తూ.. కీలక నిర్ణయాన్ని ప్రకటించారు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్. తెలంగాణ మంత్రులు జూపల్లి క్రిష్ణారావు.. వాకిటి శ్రీహరి నేత్రత్వంలో బెంగళూరుకు వెళ్లిన రాష్ట్ర ప్రతినిధులు రెండు రోజుల్లో రెండు దఫాలుగా కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ కావటమే కాదు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలన్న వినతిని మన్నిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.

కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం నుంచి జూరాల ప్రాజెక్టుకు 10 రోజుల పాటు వారబందీ పద్దతిలో క్రిష్ణా జలలాలని విడుదల చేసేందుకు ఓకే చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి ఉత్తమ్ కర్ణాటక ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.. అనంతరం కర్ణాటక ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరిపి.. జూరాలకు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు.

నిజానికి నీళ్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వాలు.. కన్నడ ప్రజలు చాలా మొండిగా ఉంటారు. ముందు తమ ప్రయోజనాలు తప్పించి.. మిగిలిన వారిని అస్సలు పట్టించుకోరు. అందుకు భిన్నంగా తాజా పరిస్థితి ఉండటం విశేషం. దీనికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న స్నేహం కూడా సానుకూల నిర్ణయానికి కారణంగా చెప్పొచ్చు. నిజానికి కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో అక్కడి విపక్షాలు ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టే వీలుంది.ఆ రిస్క్ ను ఎదుర్కొంనేందుకు సిద్ధమై తెలంగాణకు నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకోవటం గమనార్హం.

క్రిష్ణా జలాలు విడుదల చేయాలని కోరుతూ తాము చేసిన వినతిపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన వైనంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రెండు పొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న చక్కటి స్నేహబంధానికి.. సోదరభావానికి ఒక గొప్ప నిదర్శనంగా సీఎం రేవంత్ పేర్కొన్నారు. కష్ట సమయంలో పెద్ద మనసును చాటిన కర్ణాటకను తెలంగాణ యాది చేసుకోవాల్సిన అవసరముంది.