కర్ణాటకలో వివాదాలు: ఏపీలో `రెడీ` చేస్తున్న కూటమి!
కర్ణాటకలో ఐటీ, పారిశ్రామిక దిగ్గజాలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
By: Garuda Media | 19 Oct 2025 10:55 AM ISTకర్ణాటకలో ఐటీ, పారిశ్రామిక దిగ్గజాలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మౌలిక సదు పాయాల కొరత నుంచి.. కుల గణన వరకు.. అనేక అంశాలతో రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, బయోకాన్, పారిశ్రామిక వేత్తలు మోహన్‌దాస్, రాజేష్‌లతో సర్కారు రణానికి దిగింది. దీంతో రాష్ట్రంలో పరిస్థితి చేజారుతోంది. రహదారుల సమస్య మరింత ఇబ్బందిగా మారిందన్నది వాస్తవం. ఫలితంగా పలు సంస్థలు తమ కార్యాలయాలను వేరే ప్రాంతాలకు మార్చుకుంటున్నాయి.
అయితే.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కొందరు.. ఈ విషయాన్ని మరింత హైలెట్ చేస్తున్నారు. ముఖ్యంగా బయోకాన్ అధిపతి కిరణ్ మజుందార్ షా చేసిన వ్యాఖ్యలు.. విదేశీయులు చేసిన కామెంట్లను కోట్ చేసిన తీరు మరింతగా సర్కారును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ పరిణామాలతోపాటు.. స్థానిక ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ నాయకులు కూడా మనకు రావాల్సిన పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు పోతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కర్ణాటక వివాదాలు తారస్థాయికి చేరాయి.
ఇదిలావుంటే.. ఇన్పోసిస్ నారాయణ మూర్తి కుటుంబానికి, సీఎం సిద్దరామయ్య కుటుంబానికి మధ్య మరో వివాదం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో మరోసారి నిర్వహిస్తున్న కుల గణనలో తాము పాల్గొనబోమని నారాయణ మూర్తి కుటుంబం ప్రకటించింది. దీనిని ప్రస్తావిస్తూ.. సిద్దరామయ్య ఆ కుటుంబానికి ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా రాశారా? అని వ్యాఖ్యానిస్తూ.. వారిని బృహస్పతులు(వేరుగా ఉండేవారు) అనే వ్యాఖ్య చేశారు. దీనిపై రచ్చ ఓ రేంజ్‌లో రేగింది. దీనిని నారాయణమూర్తి కుటుంబం తప్పుబట్టింది.
ఇదిలావుంటే.. కర్ణాటక నుంచి బయటకు వెళ్లిపోయేందుకు.. లేదా అక్కడే ఉండి విస్తరణ విషయంలో పునరాలోచన చేస్తున్న సంస్థలను ఏపీలోని కూటమి సర్కారు నిశితంగా గమనిస్తోంది. వారు ఏ మేరకు అంగీకారం తెలిపినా.. ఏపీకి ఆహ్వానించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసి.. రాష్ట్రానికి వచ్చే వారికి రెడ్ కార్పెట్ పరవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలతో కర్ణాటక ప్రభుత్వం వణుకుతున్నా.. పైకి మాత్రం గంభీరంగా ఉంది. పైగా కొత్త వివాదాలకు తెరదీస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
