Begin typing your search above and press return to search.

శత్రువుల నుంచి దేశాన్ని కాపాడాడు.. భార్య చేతిలో చనిపోయాడు

సంచలన నేరాలకు నెలవుగా కర్ణాటక రాష్ట్రం నిలుస్తోంది. ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న పలు ఉదంతాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

By:  Garuda Media   |   16 Jun 2026 1:02 PM IST
శత్రువుల నుంచి దేశాన్ని కాపాడాడు.. భార్య చేతిలో చనిపోయాడు
X

సంచలన నేరాలకు నెలవుగా కర్ణాటక రాష్ట్రం నిలుస్తోంది. ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న పలు ఉదంతాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన దారుణ ఉదంతం సదరు రాష్ట్రంలోని ఘట ప్రభా పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. మాజీ సైనికుడైన భర్తను.. ప్రియుడి కోసం భారీగా బీమా పాలసీలు చేసి.. యాక్సిడెంట్ లో గాయాలయ్యేలా చేసి.. చికిత్స పేరుతో సెలైన్ ఎక్కిస్తూ.. అందులో విషం కలిపి చంపేసిన దారుణం చోటు చేసుకుంది.

ఈ షాకింగ్ ఉదంతంలో సహకరించిన వ్యక్తికి.. వాటా సరిగా అందకపోవటంతో సెల్ఫీ వీడియోలో అసలు నిజాల్ని వెల్లడించటంతో ఈ షాకింగ్ దుర్మార్గం వెల్లడైంది. ప్రస్తుతం సదరు భార్య.. ఆమె ప్రియుడితో పాటు.. వారికి సహకరించిన వారందరిని పోలీసులు అరెస్టు చేశారు. దేశాన్ని శత్రువులు నుంచి కాపాడిన ఒక మాజీ సైనికుడు.. వివాహేతర సంబంధంలో భాగంగా ప్రియుడితో కలిసి వేసిన దుర్మార్గమైన ప్లాన్ లో ప్రాణాలు కోల్పోయిన వైనం వేదనకు గురి చేసేలా ఉందని చెప్పక తప్పదు.

బెళగావి ఎస్పీ కె. రామరాజన్ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే.. పద్దెనిమిది సంవత్సరాల క్రితం సందీప్, సుమల పెళ్లి జరిగింది. పెళ్లి నాటికే సందీప్ ఆర్మీలో పని చేస్తుండేవారు. వారికి ఇద్దరు పిల్లలు (కుమారుడు, కుమార్తె) సైన్యంలో సుదీర్ఘంగా సేవలు అందించిన సందీప్ 2023 డిసెంబరులో రిటైర్ అయ్యారు. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక తన స్వగ్రామమైన బెళగావి జిల్లా గూడగేరి గ్రామానికి తిరిగి వచ్చేశారు. దీంతో.. పిల్లలు విపరీతమైన సంతోషానికి గురయ్యారు. ఎప్పుడూ సెలవులకు వచ్చినప్పుడు మాత్రమే తండ్రిని చూసుకునే బదులు..ఇప్పుడు తండ్రి తమతోనే ఉంటారన్న ఆనందం వారిలో వ్యక్తమైంది.

మరోవైపు సందీప్ సతీమణి సుమకు స్థానిక వ్యాపారి పుండలీక విఠల్ డోంబర్ తో పరిచయం కావటం.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. రహస్యంగా సాగుతున్న ఈ అనైతిక బంధం గురించి 2023 డిసెంబరులో ఊరికి వచ్చేసిన భర్త సందీప్ కు తెలిసిపోయింది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దీంతో.. భర్తను వదిలించుకుంటే తప్పించి ప్రియుడితో తన సంబంధాన్ని కొనసాగించలేనని భావించింది. దీంతో.. ప్రియుడితో కలిసి దారుణ ప్లాన్ కు తెర తీసింది.

భర్త సందీప్ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక అతడి పేరు మీద ప్రియుడు పుండలీక సాయంతో మూడు భారీ బీమా పాలసీలు తీసుకున్నారు. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్న వారు.. ప్రియుడు బంధువైన రాహుల్ అనే ఫార్మసీ విద్యార్థి సాయంతో ఘోరమైన ప్లాన్ చేశారు. బైక్ మీద వెళుతున్న భర్తను యాక్సిడెంట్ చేసి.. చికిత్స అందించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నిద్రమాత్రలు ఇచ్చి.. ఆపై సెలైన్ లో విషయాన్ని ఎక్కించి.. అరగంట వ్యవధిలో సందీప్ ప్రాణాల్ని తీశారు.

రోడ్డు ప్రమాదంలో అంతర్గత గాయాలతోనే భర్త చనిపోయినట్లుగా నమ్మించి.. ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియల్ని పూరతి చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో విషం ఉన్నట్లు తేలితే దొరికిపోతామన్న భయంతో ముందుగానే బెళగావి జిల్లా కేంద్రంలోని కొందరు ల్యాబ్ టెక్నిషీయన్స్ తో.. మెడికల్ సిబ్బందికి బీమా సొమ్ములో వాటాలు ఇస్తామని చెప్పి.. నకిలీ ఫోరెన్సిక్ రిపోర్టు తయారు చేసేలా ప్లాన్ చేశారు. అంతా అనుకున్నట్లే దుర్మార్గమైన ప్లాన్ అమలు చేస్తున్న వేళలో.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

వారు ప్లాన్ చేసినట్లే బీమా సొమ్ములు చేతికి అందాయి. డబ్బుల పంపకాల్లో సుమకు.. ప్రియుడు పుండలీకకు మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రియుడు పుండలీక తాము సందీప్ ను ఎలా ప్లాన్ చేసి చంపింది.. అందుకు ఎవరెవరు తమకు సహకరించిందన్న వివరాల్ని తెలుపుతూ ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. సందీప్ తల్లిదండ్రులకు తమ కొడుకు మరణం మీద అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పుండలీకను పట్టుకోగా.. అతని పోన్లో సెల్ఫీ వీడియో లభించటం.. దీంతో తమదైన శైలిలో విచారించటతో మొత్తం దారుణం బయటకు వచ్చింది.

కోర్టు అనుమతితో సందీప్ సమాధిని తవ్వి.. అతడి డెడ్ బాడీని వెలికి తీసి మరోసారి ఫోరెన్సిక్ ల్యాబ్ కు నమూనాల్ని పంపారు. భార్య సుమ.. ఆమె ప్రియుడు పుండలీకతో పాటు వీరికి సహకరించిన మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఉదంతం కర్ణాటక వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. దేశానికి సేవలు అందించిన ఒక ఆర్మీ జవాను.. వివాహేతర సంబంధం కోసం ప్రియుడితో వేసిన ప్లాన్ తో ప్రాణాలు కోల్పోయిన వైనం చూసినప్పుడు అయ్యో అనిపించకమానదు.