మా నాన్న కెరీర్ క్లోజ్..ఇక సీఎం ఆయనే..సిద్ధరామయ్య కొడుకు సంచలనం
రెండున్నరేళ్ల అనంతరం సీఎంగా సిద్ధరామయ్య (సిద్ధు) దిగిపోయి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు అవకాశం ఇవ్వాలనేది 2023 ఎన్నికల అనంతరం కుదిరిన ఒప్పందం.
By: Tupaki Political Desk | 22 Oct 2025 5:45 PM ISTఈ ఏడాది డిసెంబరు నాటికి కర్ణాటకలో అధికార మార్పిడి జరగాల్సి ఉంది. రెండున్నరేళ్ల అనంతరం సీఎంగా సిద్ధరామయ్య (సిద్ధు) దిగిపోయి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు అవకాశం ఇవ్వాలనేది 2023 ఎన్నికల అనంతరం కుదిరిన ఒప్పందం. దీనిపై దాదాపు 6 నెలలుగా ఆ రాష్ట్రంలో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. డీకే శివకుమార్ పైకి చెప్పుకున్నా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఆయన వర్గం ఎమ్మెల్యేలు కూడా తదుపరి సీఎం డీకేనే అంటూ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు సిద్ధు మాత్రం తాను గద్దె దిగే ఉద్దేశంలో లేనట్లుగా కనిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు ఊహించని స్ట్రోక్ తగిలింది.
నాన్న కెరీర్ ముగిసింది...
గురువారం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర బెళగావిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ తన తండ్రి రాజకీయ కెరీర్ ముగిసిందని, తర్వాతి ముఖ్యమంత్రి సతీశ్ జార్కిహోళి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొక్క నెల, రెండు నెలల్లో పదవీ మార్పు గడువు ఉండగా సిద్ధు కుమారుడు ఇలా మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓవైపు తన తండ్రి పదవిని కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తుంటే.. కుమారుడు మాత్రం అతడి రాజకీయ జీవితం చివరికి చేరుకుందని అనడం చర్చనీయంగా మారింది.
డీకే కాదు.. జార్కిహోళి
కర్ణాటక రాజకీయాల్లో సామాజికంగా, ఆర్థికంగా బలమైన నాయకుడు డీకే శివకుమార్. సిద్ధు తదుపరి సీఎం ఆయనే అని ఒప్పందం ఉండగా.. యతీంద్ర మాత్రం అనూహ్యంగా సతీశ్ జార్కిహోళి పేరును తెరపైకి తేవడం గమనార్హం. కాంగ్రెస్ ను ఆయనే సమర్థంగా ముందుకునడిపిస్తారని కూడా కొనియాడారు. సతీశ్.. బలమైన, ప్రగతిశీల భావాలు (ఫార్వర్డ్ థింకింగ్) నాయకుడు అని ప్రశసించారు. పెద్ద బాధ్యతలు తీసుకునేందుకు సతీశ్ సిద్ధంగా ఉండాలని కూడా సలహా ఇచ్చారు. తన తండ్రి అలాంటివారికి మార్గదర్శకుడిగా ఉంటారని తెలిపారు.
కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పి..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో సీఎం మార్పు వ్యవహారం ఎప్పటికైనా కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారడం ఖాయం. బిహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే దీనిపై పార్టీ ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఇప్పటికే డీకే-సిద్ధు వర్గాలుగా పార్టీ విడిపోయింది. పోటీపోటా ప్రకటనలు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో యతీంద్ర వ్యాఖ్యలు మరింత హీట్ పెంచడం ఖాయం. కాగా, ఆయన మాటలపై సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ స్పందించ లేదు.
సిద్ధు గద్దె దిగరు.. డీకే ఆశ వీడరు..
రెండున్నరేళ్లు కాదు ఐదేళ్లు తానే సీఎం అని సిద్ధరామయ్య అంటున్నారు. డీకే మాత్రం తన చేతుల్లో ఏమీ లేదని చెబుతున్నారు. బీజేపీ ఎన్ని కష్టాలు పెట్టినా కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్నట్లు చెబుతున్నారు. ప్రజల్లో, పార్టీలో పట్టున్న సిద్ధును దించేస్తే పార్టీ చీలిపోతుందని కాంగ్రెస్ అధిష్ఠానం భయపడుతోంది. మరి చివరకు పరిష్కారం ఎలా ఉంటుందో చూడాలి.
