Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వీక్ పాయింట్ తో ట్రబుల్ షూటర్ చెలగాటం

దేశంలో ఈ రోజు చూస్తే కాంగ్రెస్ మూడే రాష్ట్రాలలో సొంతంగా అధికారంలో ఉంది.

By:  Satya P   |   21 Nov 2025 2:00 PM IST
కాంగ్రెస్ వీక్ పాయింట్ తో ట్రబుల్ షూటర్ చెలగాటం
X

దేశంలో కాంగ్రెస్ నెమ్మదిగా ఎత్తిపోతోంది అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఇప్పటికి 95 సార్లు ఓడిందని ఇక ఆ అయిదూ పూర్తి అయితే సెంచరీ కొట్టి రికార్డు క్రియేట్ చేస్తారు అని బీజేపీ నేతలు సెటైర్లు పేల్చుతున్నారు. రెండు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ ఇంకా సీరియస్ పొలిటీషియన్ గా మారలేదని కాంగ్రెస్ వంటి అతి పెద్ద పార్టీని సరిగ్గా లీడ్ చేయలేకపోతున్నారని ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తున్న వేళ కాంగ్రెస్ చేతిలో ఉన్న రెండు పెద్ద రాష్ట్రాలలో ఒకదానిలో అయితే కుర్చీలాట స్టార్ట్ అయిపోయింది.

కర్ణాటకం ఆసక్తికరం :

దేశంలో ఈ రోజు చూస్తే కాంగ్రెస్ మూడే రాష్ట్రాలలో సొంతంగా అధికారంలో ఉంది. అందులో తొంబై సీట్లు ఉన్న చిన్న రాష్ట్రం హిమాచల్ ని తీసేస్తే సౌత్ ఇండియాలో కర్ణాటక, తెలంగాణా రెండే పెద్ద రాష్ట్రాలు. ఇందులో కూడా కర్ణాటకలో అయితే రాజకీయంగా కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోంది. అక్కడ ప్రస్తుత సీఎం సిద్దరామయ్య వర్సెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నట్లుగా సీన్ ఉంది. 2023 మే నెలలో సీఎం గా కర్ణాటక పగ్గాలు అందుకున్న సిద్ధ రామయ్య పదవీ కాలం కాంగ్రెస్ లో ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లు ఈ నవంబర్ నాటికి పూర్తి అయినట్లే అని డీకే వర్గం బలంగా వాదిస్తోంది. డిసెంబర్ నుంచి 2028 మే నెలలో జరిగే ఎన్నికల వరకు మరో రెండున్నరేళ్ల పాటు డీకేని సీఎం గా చేయాలని వారు కోరుతున్నారు. దాంతో కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయం ముదురుతోంది.

ఢిల్లీ వేదికగా :

ఇక ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డీకే అనుచరులు సమావేశం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. డీకే కూడా ఢిల్లీ రూట్ లో ఉన్నారని టాక్. ఏదో విధంగా సీఎం పీఠం తమ నాయకుడు ఈసారి ఎక్కి తీరాలన్న పట్టుదల డీకే వర్గంలో కనిపిస్తోంది. దానికి కారణాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. ముందుగా కాంగ్రెస్ పెద్దలు పెట్టిన ఒప్పందం గురించే చర్చకు తెస్తున్నారు. చెరి రెండున్నరేళ్ళు అని అన్నారు కాబట్టి సిద్ధరామయయ్య తప్పుకుంటే ఆ ప్లేస్ లోకి డీకే వచ్చి చేరుతారు అని అంటున్నారు. ఇది కాంగ్రెస్ పెద్దలకు అర్ధమయ్యే తీరులోనే చెబుతున్నారు. స్మూత్ గానే చెబుతున్నారు. ఒప్పందం ఉంది కదా అని గుర్తు చేస్తున్నారు.

భయాలు ఎన్నో :

ఇక దేశంలో కాంగ్రెస్ కి వరస పరాజయాలు పలకరిస్తున్నాయి. మిత్రులతో కలసి బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని గెలిచేస్తోంది. అదే సమయం ప్రత్యర్థులకు ఓటమి రుచి చూపించి గేలి చేస్తోంది. కర్ణాటకలో తీసుకుంటే 2023లో బీజేపీ ఓటమి పాలు కాగానే స్థానిక ప్రాంతీయ పార్టీ జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంది దాని ఫలితాలు 2024 లోక్ సభ ఎన్నికల్లో బాగా కనిపించాయి. బీజేపీ జేడీఎస్ కలసి మొత్తం 28 ఎంపీ సీట్లకు గానూ పాతిక దాకా గెలుచుకున్నాయి. కాంగ్రెస్ కి అలా ఏడాది కాలంలోనే బీజేపీ చుక్కలు చూపించింది ఇక 2028లో అయితే బీజేపీ జేడీఎస్ కలసి వస్తే కాంగ్రెస్ చిత్తు అవుతుందని లెక్కలు కూడా ఉన్నాయి. దాంతోనే డీకే వర్గం తొందర పడుతోంది అని అంటున్నారు.

ఇపుడు కాకపోతే మరెపుడు :

ఇదే డీకే వర్గీయుల డిమాండ్ గా ఉంది. 2028లో కాంగ్రెస్ మళ్ళీ గెలిస్తే అపుడు చూసుకోవచ్చు. కానీ అలా జరగకపోతే డీకే సీఎం కల అన్నది పూర్తిగా చెదిరిపోతుంది అని ఆందోళన చెందుతున్నారు కాంగ్రెస్ వరుస ఓటములు చూస్తే కనుక కర్ణాటకలో మళ్ళీ గద్దెనెక్కాలని బీజేపీ గీస్తున్న స్కెచ్ లను గమనిస్తే కనుక డీకే వర్గంలో అయితే ఒక చర్చ సాగుతోంది అని అంటున్నారు. దాంతో పాటు 2023లో కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్ ఎంతో కృషి చేశారని గుర్తు చేస్తున్నారు. ఆయన కృషికి ఫలితంగా సీఎం పదవి ఇవ్వాల్సిందే అన్నది వారి డిమాండ్.

కాంగ్రెస్ పొజిషన్ చూసి :

ఇక చూస్తే కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఇపుడు ఓటములతో ఇబ్బందుల్లో ఉంది. ఏ విధంగానూ ఎవరినీ శాసించే స్థితిలో అయితే లేదు ఇవన్నీ తెలిసే చాలా ఒడుపుగా నేరుగా డీకే వర్గం కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తెస్తోంది అని అంటున్నారు. డీకే ని ట్రబుల్ షూటర్ అంటారు. మరి ట్రబుల్స్ ని క్లియర్ చేసిన ఆయనకు ట్రబుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలుసు కదా అన్నది రాజకీయంగా కూడా అంతా అంటున్న మాట. మొత్తానికి డీకే ఒత్తిడికి లొంగి కాంగ్రెస్ పీఠం ఆయనకు అప్పగిస్తుందా అన్నది ఒక చర్చ. ఒక వేళ అప్పగించినా సిద్ధరామయ్య సైతం తక్కువ వారు కాదనే అంటున్నారు. మొత్తానికి బీహార్ ఎన్నికల ఫలితాలు కర్ణాటకలో కాంగ్రెస్ పుట్టె ముంచనున్నాయా అన్నదే అసలైన చర్చగా ఉంది.