Begin typing your search above and press return to search.

మా నాన్నే అయిదేళ్ళూ సీఎం..... రగులుతున్న డీకే వర్గీయులు

అంతే కాదు ఏ సీఎల్పీ సమావేశంలో అయినా ఎమ్మెల్యేలు అంతా కలసి కూర్చుని ఎన్నుకునేది తమ నాయకుడిని మాత్రమే అని యతీంద్ర సిద్ధరామయ్య అంటున్నారు.

By:  Satya P   |   9 Dec 2025 6:30 PM IST
మా నాన్నే అయిదేళ్ళూ  సీఎం..... రగులుతున్న డీకే వర్గీయులు
X

కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం సీటు విషయంలో వివాదం అయితే ఇంకా అలాగే కొనసాగుతోంది. సరిగ్గా రెండున్నరేళ్ళ తరువాత సిద్ధరామయ్య పదవి నుంచి దిగిపోయి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కి అప్పగించాలన్నది పవర్ షేరింగ్ ఒప్పందం అని ప్రచారం అయితే ఉంది. అదే సమయంలో హైకమాండ్ అయితే ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. ఇక సిద్దరామయ్య డీకే శివకుమార్ ల మధ్య సామరస్య పూరితమైన వైఖరి కొనసాగించేలా బ్రేక్ ఫాస్ట్ లంచ్ మీటింగ్స్ కాంగ్రెస్ హైకమాండ్ సూచనలతో నిర్వహిస్తున్నారు. ఇద్దరు నేతలు మనసు విప్పి మాట్లాడుకోవాలని తాము ఐక్యంగా ఉన్నామని ఒక కీలక సందేశం అటు క్యాడర్ కి ఇటు ప్రజలకు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆలోచనగా ఉంది. దాని ప్రకారం కొంత వరకూ అయితే పవర్ షేరింగ్ వేడి అయితే తగ్గుతోంది.

నాన్నే అయిదేళ్ళూ :

ఇలా సాఫీగా సాగుతున్న వ్యవహారంలోకి సీఎం సిద్దరామయ్య కుమారుడు మాజీ ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య అయిదేళ్ళూ సీఎం గా కొనసాగుతారు అని పూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఇదే జరుగుతుంది అని బల్ల గుద్ది మరీ చెప్పారు నాయకత్వం మార్పులో ఎలాంటి సంక్షోభం లేదని ఆయన అంటూ ఈ రకమైన చర్చ సైతం సాగడానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం పదవిని కోరుతూండడమే కారణం అని ఇండైరెక్ట్ గా డీకే మీద విసుర్లు విసిరారు.

పవర్ షేరింగ్ లేదు :

అంతే కాదు ఏ సీఎల్పీ సమావేశంలో అయినా ఎమ్మెల్యేలు అంతా కలసి కూర్చుని ఎన్నుకునేది తమ నాయకుడిని మాత్రమే అని యతీంద్ర సిద్ధరామయ్య అంటున్నారు. అంతే తప్ప ఎవరు ఎంత కాలం సీఎం గా ఉండాలి అన్నది అక్కడ అసలు చర్చించరు అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. దానిని బట్టి చూస్తే సీఎం సీటు విషయంలో పవర్ షేరింగ్ అన్న ప్రసక్తి ఉండదని యతీంద్ర సిద్ధరామయ్య స్పష్టం చేశారు అన్న మాట. ఇక రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వ సంక్షోభం కూడా ఉండబోత్దని యతీంద్ర సిద్ధరామయ్య అంటున్నారు. ఈ విషయంలో హై కమాండ్ కూడా క్లారిటీగా ఉందని చెప్పుకొచ్చారు.

రాష్ట్రానికి మంచి జరగాలని :

అయితే యతీంద్ర సిద్ధరామయ్య చేసిన ఈ వ్యాఖ్యల మీద డిప్యూటీ సీం డీకే శివకుమార్ ఆచీ తూచీ స్పందించారు. తాను ఇపుడు సంతోషంగా ఉన్నాను. రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుందాం అంటూ ఆయన నర్మగర్భితంగా కామెంట్స్ చేసారు. దాంతో కర్ణాటకలో గమ్మున ఉన్న సీఎం సీటు వ్యవహారం మరోసారి హీటెక్కింది. దానికి కారణం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య అనే అంటున్నారు. పైగా ఆయన వ్యాఖ్యలు ఇండైరెక్ట్ గా డీకే మీద ఉండడంతో కొత్తగా రాజకీయ సెగ రగిలే అవకాశం ఉందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.

సీఎల్పీ కాదు కానీ :

ఇక చూస్తే సాధారణంగా ఇద్దరు కీలక నేతలు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నపుడు దానిని సీఎల్పీలో బహిరంగంగా చర్చించి పార్టీలో వర్గ పోరుకు ఎవరూ తెర తీయరు. హైకమాండ్ ఇద్దరు నేతలను పిలిచి ఈ మేరకు ఒక ఒప్పందం మౌఖికంగానే కుదురుస్తుంది అని అంటున్నారు. అసలు పవర్ షేరింగ్ చర్చ అన్నది లేకపోతే డీకే వర్గీయులు సరిగ్గా రెండున్నరేళ్ల పాలన పూర్తి అయిన తరువాత ఎందుకు డిమాండ్ చేస్తారు అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తరువాత ఒక పది రోజుల పాటు కొత్త ప్రభుత్వం మీద ప్రతిష్టంబన ఏర్పడింది అన్నది కూడా గుర్తు చేస్తున్నారు. ఆ తరువాతనే పవర్ షేరింగ్ అన్న ప్రచారం సాగి సిద్ధరామయ్య సీఎం కి లైన్ క్లియర్ అయింది అని అంటున్నారు. ఇపుడు మా నాన్న అయిదేళ్ళ సీఎం అని యతీంద్ర సిద్ధరామయ్య చెప్పడం మీద డీకే వర్గీయులు రగులుతున్నారు. మరి డీకే దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది.