కర్మ రిటర్న్స్- వెతికి వెంటాడుతుంది !
చాలా మందికి కలిగే సందేహం కర్మలు పట్టి పీడించడం నిజమేనా అన్నది. ఇంతటి సాంకేతిక యుగంలో కూడా అలాంటివి నమ్మాలా అని కూడా ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుంటారు.
By: Satya P | 23 March 2026 10:00 AM ISTచాలా మందికి కలిగే సందేహం కర్మలు పట్టి పీడించడం నిజమేనా అన్నది. ఇంతటి సాంకేతిక యుగంలో కూడా అలాంటివి నమ్మాలా అని కూడా ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుంటారు. అయితే ఎంత టెక్నాలజీ ఉన్నా మనిషి మరణం అనే మాయ తరువాత అదృశ్యం అవుతున్నాడు. అంతే కాదు ఆ తరువాత ఎవరికీ కనిపించడం లేదు, మరి ఎక్కడికి పోతున్నాడు ఏమవుతున్నాడు అన్నది ఎవరైనా పసిగట్టారా అంటే జవాబు శూన్యం. అలాగే జీవించి ఉన్న వారిలో అనేక సమస్యలు ఉంటాయి. ఇవాళ బాగున్న వారు రేపటికి కష్టాలతో సతమతమవుతున్నారు, మాకేంటి అని ధీమాగా ఉన్న వారు సైతం ఏమీ కాకుండా పోతున్నారు. మరి ఇవన్నీ ఏమిటి అంటే జవాబు లేదు. అంటే ఏదో శక్తి నడిపిస్తోంది అన్నది అయితే అర్ధం అవుతోంది కదా. కానీ దీనిని నాస్తికులు భౌతిక వాదులు నమ్మరు, అన్నీ చూపించమంటారు, అయితే కంటికి కనిపించనివి ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయని ఆధ్యాత్మికవాదులు ఆస్తికులు చెబుతూంటారు.
కర్మను నమ్మాల్సిందే :
కర్మ సిద్ధాంతాన్ని నమ్మి తీరాల్సిందే అని అంటారు. ప్రతీ మనిషికి అనారోగ్యం కానీ ఇతర ఇబ్బందులు కానీ మానసిక శారీరక వేదనలు కానీ ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే కర్మల వల్లనే అని ఆస్తికత్వం జవాబు చెబుతుంది. ఈ లోకంలో ఎక్కడో ఒక చోట అంతా బాలెన్స్ అవుతూ ఉంటుంది. లేకపోతే డబ్బున్న వారు బలమున్న వారిదే రాజ్యం అవుతుంది. కానీ వారు ఏదో సమయంలో అన్యాయం చేస్తే మరో సమయంలో దానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారు. ఇది కాల చక్రం నిశితంగా చూస్తుంది. మనిషి చూడలేకపోవచ్చు అని అంటారు.
భీష్ముడి కధే ఉదాహరణ :
కర్మ ఎలా పనిచేస్తుంది అనడానికి మహా భారతంలోకి ఒక్కసారి వెళ్తే భీష్ముడి కధ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. భీష్ముడు అంటే అందరూ ఒకే మాట అంటారు. అంతటి ధర్మ కోవిదుడు లేడని, అది నిజమే. భీష్ముడు కురు పాండవులకు తాత. ఆ సామ్రాజ్యానికి ప్రదాత. ఆయన వివాహం చేసుకోకుండానే తన జీవితాన్ని కౌరవ సామ్రాజ్యం ఉన్నతి కోసం విస్తరణ కోసం అంకితం చేసిన త్యాగశీలి. అలాంటి భీష్ముడిని సైతం కర్మ వదలలేదు అంటే ఆశ్చర్యం వేస్తుంది.
అంపశయ్య మీద నెలలు :
మహా భారత యుద్ధంలో భీష్ముడిని అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టి బాణం వేసి ఓడిస్తాడు, అయితే పార్ధుని శర సంధానానికి మరొకరు అయితే అక్కడే మరణించేవారు. కానీ భీష్ముడుకి ఒక వరం ఉంది. తన మరణం తాను కోరుకున్నపుడే వస్తుంది. కురుక్షేత్ర యుద్ధం దక్షిణాయనంలో జరిగింది. అందువల్ల పుణ్య లోక ప్రాప్తి కోసం ఉత్తరాయణం దాకా భీష్ముడు నిరీక్షిస్తాడు. బాణాలతో చేసిన పానుపు మీదన గాయపడ్డ రక్తమోడుతున్న శరీరంతో నెలలు గడిపాడు. ఆయన ఆ సమయంలో ఎంతో వేదనకు గురి అవుతూంటాడు. తాను ఏమి తప్పు చేశానని ఈ తరహా మరణ వేదన సంభవించింది అని ఆలోచిస్తూంటాడు.
క్రిష్ణుడు చెప్పిన జవాబు :
ఈ సమయంలో భీష్ముడిని చూసేందుకు శ్రీ క్రిష్ణుడు వస్తాడు, అంపశయ్య మీద అవస్థలు పడుతున్న భీష్ముడిని చూసి ఆవేదన చెందుతూ తాతా అని పలకరిస్తాడు. కృష్ణుడిని చూసిన భీష్ముడు తన అంపశయ్య బాధ గురించి వివరిస్తాడు. తాను ఏ తప్పు చేశాను అని ఈ విధమైన శిక్ష అని అడుగుతాడు. తాను తనకు ఉన్న శక్తితో వంద జన్మల దాకా వెనక్కి వెళ్ళి తాను ఏ విధమైన దోషాలు చేశానో పరికించి చూశాను అని చెబుతాడు. ఏ తప్పు చేయలేదని అయినా ఈ కర్మ ఇలా పట్టిందేంటి అని సందేహం వ్యక్తం చేస్తాడు. దానికి కృష్ణుడు చిరు నవ్వుతో భీష్ముడితో ఇలా అంటాడు. వంద జన్మల దాకానే వెళ్ళావు తాతా. నూట ఒక్క జనంలోకి వెళ్ళి చూడు అంటాడు.
ఆ జన్మ పాపం :
దాంతో తన దివ్య శక్తితో భీష్ముడు నూట ఒక్క జనంలోకి వెళ్ళి చూస్తాడు. ఆ జన్మలో భీష్ముడు ఒక యువ రాజు. అధికారం ఉంది, దాంతో గుర్రం మీద దూకుడుగా అడవుల్లో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో భీష్ముడి గుర్రానికి ఒక పాము అడ్డు వస్తుంది. దానిని విసురుగా తీసి ముళ్ళ పొదలలోకి ఆ యువ రాజు పడేసి పోతాడు. నిజానికి కాసేపు ఆగితే ఆ పాము తన మానాన తాను పక్కకు పోతుంది. కానీ మితిమీరిన అహంకారంతో ఆ యువరాజు పాముని అలా చేస్తాడు, దాంతో ముళ్ళ పొదలలో పాము తలెత్తితే బాధ దించితే బాధ ఇలా అచ్చం భీష్ముడు పడిన అంపశయ్య అవస్థల మాదిరిగానే అవస్థలు పడుతూ ఉంటుంది.
కట్టి కుడిచిన శాపం :
అది తెలుసుకున్న భీష్ముడు నూట ఒక్కటన జన్మలో చేసిన పాపం ఇన్నేళ్ళూ ఎందుకు కర్మగా వెంట రాలేదు అని క్రిష్ణుడుని ప్రశ్నిస్తాడు. దానికి క్రిష్ణుడు బదులిస్తూ మిగిలిన వంద జన్మలలో నీవు చేసిన పుణ్యాలు ఒక రక్షణ కవచంగా మారి ఆ కర్మని నీ దగ్గరకు రానీయలేదని చెబుతాడు. మరి ఇపుడే ఎందుకు వచ్చింది అని భీష్ముడు అడిగితే ఈ జన్మ అంతా ఎంతో మంచి చేశావు కానీ తాతా ఒక్క సందర్భంలో మాత్రం తప్పు చేశావు అంటాడు. అదే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో సభలో పెద్దగా ఉన్న భీష్ముడిని ద్రౌపది ఎంత వేడుకున్నా రాజ ధర్మం పేరుతో భీష్ముడు మౌనం వహిస్తాడు. అలా చేసిన తప్పు వల్లనే ఈ జన్మలో ఆనాటి కర్మ దూసుకుని వచ్చిందని అనుభవించి తీరాల్సిందే అని చెబుతాడు. దీనిని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే వందల జన్మలు అయినా కర్మ వెతికి వెంటాడుతుందని. అందుకే తెలిసి తప్పులు చేయకూడదని ధర్మ కోవిదులు చెబుతారు.
