Begin typing your search above and press return to search.

సైకిలెక్కాలని చూస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ?

ఆయన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అంటున్నా అది టెక్నికల్ గా మాత్రమే. ఆయన అచ్చమైన టీడీపీ మనిషి. తెలుగుదేశం పార్టీ నుంచి అనేక సార్లు గెలుస్తూ వచ్చారు.

By:  Satya P   |   21 March 2026 9:09 AM IST
సైకిలెక్కాలని చూస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే ?
X

ఆయన వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అంటున్నా అది టెక్నికల్ గా మాత్రమే. ఆయన అచ్చమైన టీడీపీ మనిషి. తెలుగుదేశం పార్టీ నుంచి అనేక సార్లు గెలుస్తూ వచ్చారు. ఆయన ఎవరో కాదు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత కరణం బలరాం. ఆయన టీడీపీలో దిగ్గజ నేత అయినా మంత్రి మాత్రం కాలేకపోయారు. దానికి కారణం ఆయన గెలిచినపుడు టీడీపీ ఓడిపోవడం టీడీపీ గెలిచినపుడు ఆయన ఓటమి పాలు కావడం. ఇక తన రాజకీయ జీవితం అంతా టీడీపీతోనే అని ఆయన అనుకున్నారు కానీ చిత్రంగా 2019 ఎన్నికల తరువాత పసుపు గడప దాటి రాక తప్పలేదు. జిల్లా టీడీపీలో అనేక సమీకరణలు అలాగే వైసీపీ నుంచి ఆఫర్లు అన్నీ కలసి ఆయన తన కుమారుడు వెంకటేష్ తో కలసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

ఇదీ అసలు మ్యాటర్ :

ప్రకాశం జిల్లాలో అద్దంకి కరణం బలరాం సొంత నియోజకవర్గం. ఆయన అక్కడ నుంచి 1978లో తొలిసారి కాంగ్రెస్ తరఫున గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక ఆ తరువాత ఆయన 2004లో గెలిచారు. ఇక అద్దంకిలో తిరుగులేని రాజకీయం చేస్తున్న ఆయనకు గొట్టిపాటి కుటుంబం నుంచి పోటీ గట్టిగా ఉంది. గొట్టిపాటి రవికుమార్ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి కరణం బలరాం ని ఓడించారు. 2014లో చూస్తే తన కుమారుడు కరణం వెంకటేష్ ని అద్దంకిలో నిలబెట్టినా వైసీపీ నుంచి గొట్టిపాటి రవి కుమర్ గెలిచారు. ఆ తరువాత ఆయన టీడీపీలోకి రావడంతో కరణం కి సమీకరణలు కుదరలేదు, 2019లో అయితే చీరాలకు కరణం షిఫ్ట్ అయ్యారు. అక్కడ నుంచే గెలిచారు కానీ అద్దంకి మీద రాజకీయ పట్టు కోసం వైసీపీలో చేరారు. ఈలోగా 2024లో కూటమి అధికారంలోకి రావడంతో గొట్టిపాటి రవి కుమార్ మంత్రి అయిపోయారు.

మనసు పసుపు పార్టీతో :

ఇక 2024 ఎన్నికల తరువాత వైసీపీలో కరణం కుటుంబం సుఖంగా లేరని అంటున్నారు. కరణం వెంకటేష్ కి చీరాల ఇంచార్జి బాధ్యతలు అప్పగించినా కార్యక్రమాలు ఏవీ పెద్దగా సాగడం లేదని అంటున్నారు. మొదటి నుంచి టీడీపీలోనే ఉన్న కుటుంబం కాబట్టి సైకిలెక్కాలని చూస్తోంది అని అంటున్నారు. వైసీపీ అయితే అద్దంకి నుంచి రాజకీయం చేయమని కరణం కుటుంబాన్ని కోరుతోంది. చీరాల ఇంచార్జిగా వేరే వారిని తేవాలని చూస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ ని తీసుకుంటారు అని వైసీపీలో టాక్ ఉంది. ఈ నేపధ్యంలో గడచిన కాలంలో అనేక సార్లు కరణం కుటుంబం టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది అని అంటున్నారు.

నో చెప్పేశారా :

అయితే టీడీపీలో బలమైన నేతగా మంత్రిగా ఉంటూ తన స్థానాన్ని పదిలపరచుకున్నారు గొట్టిపాటి రవి కుమార్ దాంతో ఆయన మాటనే జిల్లాలో చెల్లుతోంది అధినాయకత్వానికి కరణం ఫ్యామిలీ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉన్నా జిల్లాలో ఉన్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో ఆయనకు నో ఎంట్రీ బోర్డు చూపిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో అయితే అసలు ఉండే సీన్ లేదు టీడీపీ రమ్మనడంలేదు, దాంతో మాజీ ఎమ్మెల్యే కుటుంబం సైకిలెక్కే రోజు వస్తుందా రాదా అన్నదే పెద్ద చర్చగా ఉంది అంటున్నారు.