కాపులు-దళితులు కలిస్తే.. అధికారం మనదే: సునీల్ ఐపీఎస్
ఏపీలో కాపులు - దళితులు కలిస్తే.. అధికారం మనదేనని ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వ్యాఖ్యానించారు.
By: Garuda Media | 1 Dec 2025 8:59 AM ISTఏపీలో కాపులు - దళితులు కలిస్తే.. అధికారం మనదేనని ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం గుంటూరు జిల్లాలో జరిగిన దళిత బహుజన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెండు వర్గాలే అతి పెద్ద జనాభాను కలిగి ఉన్నాయని తెలిపారు. కాపులు, దళితులు కీలక ఓటు బ్యాంకుగా ఉన్నారని.. వీరిద్దరు కలిసి.. ఎన్నికలకు వెళ్తే రాజ్యాధికారం దక్కుతుందని వ్యాఖ్యానించారు. దీనికి ఈ రెండు వర్గాల వారు కృషి చేయాలని ఆయన సూచించారు.
కాపులు ఎప్పటి నుంచే ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారన్న సునీల్ కుమార్.. అది దక్కాలంటే దళితులతో చేతులు కలపాలని సూచించారు. దళితులు కూడా రాజ్యాధికారం కోసం నిరసనలు, ఉద్యమాలు చేస్తున్నారని.. కానీ, వారు కాపులతో కలిసి ఉంటే అది సాకారం అవుతుందని తెలిపారు. ఈ క్రమంలో కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి.. దళితులు ఉప ముఖ్య మంత్రి పదవిని తీసుకుంటే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఆ పదవిని కూడా కేవలం రెండున్నర మాసాలకు పరిమితం కాకుండా.. ఐదేళ్లు ఉండేలా చూసుకోవాలని కోరారు.
దళిత నేతలుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్, న్యాయవాది జడ శ్రవణకుమార్‌లు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే మరింత మేలు జరుగుతుందని సునీల్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆదిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంద న్నారు. తనకు ఎలాంటి పదవులు, టికెట్ అవసరం లేదన్న ఆయన ఐక్యత కోసం కృషి చేస్తానని.. వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా ముందుకు సాగేందుకు సహకరించడంలో తన వంతు పాత్రపోషిస్తానని చెప్పారు. ఈ దిశగా దళిత మేధావులు ఆలోచన చేయాలన్నారు. అప్పుడే రాజ్యాధికారం దక్కుతుందని.. న్యాయం జరుగుతుందని తెలిపారు.
ఎన్నో వివాదాలు..
కాగా.. ఐపీఎస్ సునీల్ కుమార్‌పై పలు వివాదాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజుపై దేశ ద్రోహం కేసు పెట్టడంతోపాటు.. ఆయనను అక్రమంగా అరెస్టు చేసి కస్టడీలో హింసించారన్న కేసును ఆయన ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఏపీసీఐడీలో చీఫ్‌గా పనిచేసినప్పుడు సిబ్బందిని కూడా వేధించిన కేసులు నమోదయ్యాయి. అలానే ఫైర్ డీజీగా పనిచేసినప్పుడు కూడా విధులను సక్రమంగా నిర్వర్తించలేదన్న విమర్శలు వున్నాయి. కాగా, కూటమి సర్కారు వచ్చాక.. ఆయన బీహార్‌కు బదిలీ చేయించుకున్నారు.
