బాబు వైఎస్సార్ ల మధ్య తేడా ...సీనియర్ మోస్ట్ భలే విశ్లేషణ !
వైఎస్సార్ ఉదారత్వం కలిగిన మనిషి అని బాపిరాజు చెప్పారు. ఆయన్ని ఎవరైనా ఏదైనా అడగటమే పాపం, ఏదైనా ఇచ్చేస్తారు అని ఆయన చెప్పారు.
By: Satya P | 29 July 2026 9:31 AM ISTవైఎస్సార్ చంద్రబాబు ఇద్దరూ సమకాలీనులే. ఇద్దరూ ఒకేసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇద్దరూ ఒకేసారి మంత్రులు అయ్యారు. ఇక చంద్రబాబు వైఎస్సార్ కంటే తొమ్మిదేళ్ళ ముందుగా సీఎం అయ్యారు. వైఎస్సార్ 2004లో అయ్యారు వైఎస్సార్ రెండు సార్లు గెలిచినా 2009లో దుర్మరణం పాలు అయ్యారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఇద్దరూ మొదట్లో మంచి మిత్రులు ఆ తరువాత రాజకీయ ప్రత్యర్ధులు. అయినా సరే చివరి దాకా వారిద్దరి మధ్య మంచి సామరస్యమే ఉందని చెబుతారు. మరి ఈ ఇద్దరినీ దగ్గరగా చూసిన ఆనాటి సీనియర్ లీడర్లు ఇద్దరి మధ్య తేడాలు ఏంటో చక్కగా చెబుతారు. అలాంటి ఒక సీనియర్ మోస్ట్ లీడర్ మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు అయితే భలేగా ఈ ఇద్దరి గురించి విశ్లేషించారు. ఒక యూట్యూబ్ చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఈ ఇద్దరి గురించి చెప్పిన మాటలు చూసిన వారికి కూడా బాగా ఆసక్తిని కలిగించాయనే చెప్పాలి.
అడగని వారిదే పాపం :
వైఎస్సార్ ఉదారత్వం కలిగిన మనిషి అని బాపిరాజు చెప్పారు. ఆయన్ని ఎవరైనా ఏదైనా అడగటమే పాపం, ఏదైనా ఇచ్చేస్తారు అని ఆయన చెప్పారు. ఎవరికి లేఖ రాయమన్నా రాస్తారు, అది హైకోర్టు సుప్రీం కోర్టులకు అయినా ఆయన రెడీ అని అన్నారు. వారికి లేఖ రాయచ్చా అని కూడా ఆలోచించరని తన సహాయమే ముఖ్యమని అనుకుంటారని బాపిరాజు చెప్పారు. నమ్ముకున్న వాళ్ళకు కమాన్ అంటే కమాన్ అని పంచిపెట్టడమే వైఎస్సార్ కి తెలుసు అని అన్నారు. వైఎస్సార్ గుడ్ హార్ట్ పర్సన్ అని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా హెలికాప్టర్ ఎక్కి జిల్లాల పర్యటనకు వెళ్తే ఏ హామీలు ఇచ్చి వస్తారో అని అప్పటి ఆర్ధిక మంత్రి రోశయ్య కంగారు పడేవారు అని అన్నారు. సీఎం మాట ఇచ్చారు అంటే తప్పకూడదు కదా అని నిధులు సమకూర్చేందుకు ఆయన చూసేవారు అని నాటి ముచ్చట్లను గుర్తు చేశారు. రూలూ రైమూ వైఎస్సార్ కి తెలియదని ఆయన అలా ఇచ్చుకుంటూ పోవడమే తెలుసు అని బాపిరాజు చెప్పారు.
బాబు హార్డ్ వర్కర్ :
చంద్రబాబు హార్డ్ వర్కర్ అని బాపిరాజు కొనియాడారు. ఆయన దగ్గర నిరాశ అన్న మాటే వినిపించదని అన్నారు. ఆయన ఎంతటి కష్టమైనా నష్టమైనా తన హార్డ్ వర్క్ తో ఓర్చి లాభం తీసుకుని వస్తారని చెప్పారు. ఆయన ప్రతీ విషయంలో బాలెన్స్ గా ఉంటారని ఆచీ తూచీ వ్యవహరిస్తారు అని చెప్పారు. బాబు కష్టపడటంలో నంబర్ వన్ అని అన్నారు. అందువల్ల వైఎస్సార్ చంద్రబాబు ఇద్దరూ విభిన్న వ్యక్తులు అని చెప్పారు. ఇద్దరికీ పోలిక పెట్టకూడదని బాపిరాజు చెబుతూనే ఈ ఇద్దరిలో తేడాలను మాత్రం బాగానే విశదీకరించి చెప్పారు.
కరెక్ట్ గానే ఉందంటూ :
బాపిరాజు ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా అయితే లేరు. ఆయన పార్టీ మాత్రం కాంగ్రెస్ అనే అంటారు. అయితే పాత తరం నాయకుడు కాబట్టి అందరితో మంచిగా ఉంటారు. ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. అందరితోనూ మంచి సన్నిహితమైన పరిచయాలు ఉన్నాయి. ఆయన చంద్రబాబు వైఎస్సార్ గురించి వారిద్దరి మధ్య తేడాల గురించి చెప్పిన తీరు మాత్రం చూసిన వారు కరెక్ట్ గానే చెప్పారు అని అంటున్నారు. ఎందుకంటే ఎలాంటి వివక్ష లేకుండా ఆయన ఉన్నది ఉన్నట్లుగానే చెప్పారనే అనిపిస్తోంది కాబట్టి. ఇక్కడ ఒక విషయం ఉంది. ఎంతటి ప్రత్యర్ధులు అయినా బాబు హార్డ్ వర్క్ ని తప్పక పొగుడుతారు. అలాగే వైఎస్సార్ ఉదారత్వాన్ని సైతం కొనియాడుతారు. ఆ క్వాలిటీస్ ఇద్దరినీ పొలిటికల్ గా బిగ్ షాట్స్ గా నిలబెట్టాయన్నది నిజం.
