తెలుగు పేరు ఉంటే తీసేశారు.. కన్నడిగుల ‘భాష’క్రోదం
తొండ ముదిరి ఊసర వెళ్లి అయినట్టు ఈ కన్నడిగుల భాష ప్రేమ పిందె నుంచి పండు అయ్యి ఇప్పుడు పసరు కారే వరకూ సాగుతోంది.
By: A.N.Kumar | 5 Dec 2025 10:23 PM ISTతొండ ముదిరి ఊసర వెళ్లి అయినట్టు ఈ కన్నడిగుల భాష ప్రేమ పిందె నుంచి పండు అయ్యి ఇప్పుడు పసరు కారే వరకూ సాగుతోంది. ఇన్నాళ్లు తమిళులకే ఈ భాషాభిమానం మెండు అంటూ అనుకునేవారు. ఇప్పుడు కన్నడిగులు అంతకుమించిన ప్రేమతో చెలరేగిపోతున్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడని ఆయన సినిమాలను ఆపేశారు. తర్వాత ఫిల్మ్ ఫెస్టివెల్ లో రణ్ వీర్ సింగ్ ‘కాంతారా’ దేవతను ఇమిటేట్ చేస్తే ఏసుకున్నారు. కర్ణాటకలో బ్యాంకు ఎంప్లాయి కన్నడలో మాట్లాడనందుకు విధ్వంసం చేశారు. ఇలా కన్నడిగుల భాషాభిమానం ఇప్పుడు ముదిరి పాకాన పడుతోంది.
భాష అభిమానం ఉండాలి.. కానీ అది దురాభిమానంగా మారకూడదు. ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతోంది. తెలుగు వారి సినిమాలనే అడ్డుకోవడం చూశాం కానీ.. కొందరు తెలుగు మూలాలు మెండుగా ఉండి.. తెలుగోళ్లు ఎక్కువగా జీవించే బళ్లారిలోనూ కన్నడిగులు తమ పైత్యం చూపించారు. కన్నడ, ఇంగ్లీష్, తెలుగులో మూడింట్లో ఒక హోటల్ పేరు పెడితే తెలుగు పేరును తీసేశారు. కన్నడ రాష్ట్రంలో తెలుగు పేరు ఏంటి అంటూ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
కర్ణాటక రక్షణ వేదిక అనే సంస్థకు విజయనగర జిల్లా అధ్యక్షుడు జి.రాజశేఖర్ రాజన్న ఆధ్వర్యంలో బళ్లారిలో ఆకృతి అనే హోటల్ తెలుగు అక్షరాలను సైన్ బోర్డు నుంచి తొలగించారు. కర్ణాటకలో ఈ తెలుగు పదాలు ఏంటి అంటూ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
ఈ మధ్య ఆ రాష్ట్రంలో కన్నడ ప్రేమ ఎక్కువైంది. కమల్ హాసన్ తన సినిమా ప్రమోషన్ లో ఏదో అన్నాడని ఆయన సినిమాను కూడా కన్నడలో అడ్డుకొని నిషేధించారు. థియేటర్లను మూసివేయించారు. ఆడకుండా చేశారు.
ఇన్నాళ్లు ఈ యావ కేవలం తమిళనాడు, మహారాష్ట్రలోనే ఉండేది. వారి భాష అభిమానంతో ఇతర రాష్ట్రాల వారి జాడ కనిపించనీయకుండా చేసేవారు. కానీ ఇప్పుడు కర్ణాటకకు ఇది పాకి అక్కడ తెలుగు సంస్కృతిని కాపాడే వారిని టార్గెట్ చేసి ఇలా హింసిస్తున్న పరిస్థితి నెలకొంది.
భారత దేశం అంటేనే వివిధ భాషలు, సంస్కృతులు , సమ్మేళనాలకు చిహ్నం. భిన్నంత్వంలో ఏకత్వమే మన అభిమతం. కానీ కొందరు భాషాభిమానుల పైత్యం కారణంగా అక్కడ మైనార్టీ భాషస్తులు భయపడుతున్నారు. తమ సొంత భాషను మాట్లాడడానికే జంకుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి వాతావరణం ఎంత మాత్రం భారతదేశంలో శ్రేయస్కకరం కాదు.
